మామిడికి ప్రభుత్వ సబ్సిడీని పెంచాలని రైతుల వినతి
ఫ్యాక్టరీలు ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఇవ్వడం లేదు
రాంపులు కిలోకు మూడు రూపాయలు మాత్రమే ఇస్తున్నాయి
దీంతో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందడం లేదు
ప్రభుత్వ సబ్సిడీగా మరో నాలుగు రూపాయలు పెంచాలని రైతుల వినతి
తోటల విస్తీర్ణం ఆధారంగా సబ్సిడీ విడుదల చేయాలని మనవి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు కావడం లేదు. మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో రైతులు మామిడికాయలను భారీగా తీసుకుని వస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద కిలోమీటర్ల దూరం మామిడి ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. దీంతో ఫ్యాక్టరీలు మామిడి ధరలను భారీగా తగ్గించి, రెండు రోజులపాటు సెలవులను ప్రకటిస్తున్నారు. రైతులు కోసిన మామిడికాయలను మార్కెటింగ్ తీసుకోలేక రోడ్లమీద పారబోస్తున్నారు. కావున రైతులు పండించిన పంటకు మద్దతు ధర అమలు అయ్యే విధంగా చూడాలని రైతు సంఘ నాయకులు కోరుతున్నారు. ఇందు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు రూపాయలను సబ్సిడీగా మామిడి రైతులకు అందచేయాలని కోరుతున్నారు. లేకుంటే ఈ సంవత్సరం రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో లక్ష 50 వేల ఎకరాలలో మామిడి సాగయింది. ఈ ఆర్థిక సంవత్సరం సుమారుగా ఐదు లక్షల టన్నుల మామిడి దిగుబడి రావచ్చని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మామిడిని క్రషింగ్ చేసి, పల్ప్ తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయడానికి చిత్తూరు జిల్లాలో 35 గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. గత రెండు సంవత్సరాలుగా మామిడి పల్ప్ నిల్వలు ఎగుమతి లేకుండా పేరుకుపోవడంతో ఈ సంవత్సరం మామిడిని తీసుకోవడానికి ఫ్యాక్టరీలు ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పంపిన నివేదిక ఆధారంగా మామిడికి మద్దతు ధరను నిర్ణయించింది. జ్యూస్ ఫ్యాక్టరీలు ఎనిమిది రూపాయలు రైతులకు చెల్లిస్తే, ప్రభుత్వం మరో నాలుగు రూపాయలను సబ్సిడీగా ప్రకటించింది. మొత్తం మీద కిలోపు 12 రూపాయలు మద్దతు ధర లభిస్తుందని ప్రభుత్వం భావించింది. ఆలస్యంగా మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ప్రారంభం కావడంతో కాయలను సరఫరా చేయడానికి రైతులు పోటీలు పడుతున్నారు. జిల్లాలో 35 గుజ్జు ఫ్యాక్టరీలో ఉండగా 27 మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగిలిన ఫ్యాక్టరీలు వివిధ కారణాలతో ప్రారంభానికి నోచుకోలేదు. ఫ్యాక్టరీలకు రైతులు మామిడికాయలతో భారీగా తరలి రావడంతో ఫ్యాక్టరీలు మామిడి కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించాయి. ఫ్యాక్టరీలలో ఐదు నుంచి 6 రూపాయల వరకు మాత్రమే ధర రైతులకు లభిస్తుంది. కొన్ని ఫ్యాక్టరీలు నాలుగు రూపాయలు కూడా అందజేస్తున్నాయి. జిల్లా కలెక్టర్ రెండు మూడు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి, మామిడి న్యూస్ ఫ్యాక్టరీలను పరిశీలించారు. రైతుల బాధలను, ఫ్యాక్టరీ యజమానుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎనిమిది రూపాయలు సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చారు. కనీసం ఆరు రూపాయలకు తక్కువ కాకుండా చెల్లించాలని జిల్లా కలెక్టర్ జ్యూస్ ఫ్యాక్టరీలను కోరారు. అయితే కొన్ని ఫ్యాక్టరీలలో ఈ ధర కూడా అమలు కావడం లేదు. ర్యాంపులలో కిలో కాయలను మూడు రూపాయలకు కొంటున్నారు. జూస్ ఫ్యాక్టరీలు మామిడికాయలను తీసుకోకపోవడంతో రైతులు విధిలేకుండా ర్యాంపులకు వెళ్తున్నారు. దీంతో ర్యాంపు యజమానులు కిలోపు మూడు రూపాయల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. ఫ్యాక్టరీలు సగటున ఐదు రూపాయలు ఇస్తుండగా, ర్యాంపులు మూడు రూపాయలు మాత్రమే రైతులకు కొనుగోలు ధరగా ఇస్తున్నాయి. ప్రభుత్వం నాలుగు రూపాయలు సబ్సిడీగా మామిడి రైతులకు అందజేస్తుంది. దీంతో ఫ్యాక్టరీలకు తోలిన రైతులకు మద్దతు ధరగా 8 నుంచి పది రూపాయలు మాత్రమే లభిస్తుంది. రాంపులకు సరఫరా చేసిన వారికి ప్రభుత్వ సబ్సిడీతో కలుపుకుంటే ఏడు రూపాయలు మాత్రమే గిట్టుబాటు అవుతుంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని కలిసిన రైతు సంఘం నాయకులు ఈ విషయమై జిల్లా కలెక్టర్ తో చర్చించారు. జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన ధరను జ్యూస్ ఫ్యాక్టరీలు, ర్యాంపులు అమలు చేయడం లేదు, కావున ప్రభుత్వమే సబ్సిడీని మరో నాలుగు రూపాయలు పెంచాలని ప్రతిపాదించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. తాను ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లానని చెప్పారు. ప్రభుత్వం అదనంగా సబ్సిడీని మామిడి రైతులకు ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కిలో మీద ఒకటి నుంచి రెండు రూపాయల వరకు సబ్సిడీని పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే రైతు సంఘం నాయకులు సబ్సిడీని మరో నాలుగు రూపాయలు పెంచాలని కోరుతున్నారు. ఈ విషయంలో మామిడి ధరల స్థిరీకరణ కమిటీ సభ్యులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీని పెంచకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావడానికి సిద్ధమవుతున్నారు.
*విస్తీర్ణం ఆధారంగా సబ్సిడీ*
రాష్ట్ర ప్రభుత్వం మామిడి పంటకు మద్దతు ధర 12 రూపాయలను ప్రకటించి, నాలుగు రూపాయలను సబ్సిడీగా రైతులకు చెల్లిస్తుంది. ఇందుకు ఫ్యాక్టరీకి సరఫరా చేసిన మామిడి వివరాలను వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలి. అలా నివేదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతులు సరఫరా చేసిన కాయలకు కిలో నాలుగు రూపాయల వంతున సబ్సిడీ అందజేస్తుంది. ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన మామిడి కాయలను త్వరగా దించకపోవడంతో ట్రాక్టర్ల లోనే కాయలు మాగిపోతున్నాయి. ఆ కాయలను ఫ్యాక్టరీలు తిరస్కరిస్తున్నాయి. అలాగే చాలా కాయలు తోటలోనే మాగి రాలిపోతున్నాయి. కొన్ని కాయలు పురుగులు పడి రాలిపోతుండగా, మరికొన్ని కాయలు చీలిపోతున్నాయి. రింగురోగంతో మరికొద్ది కాయలు పాడవుతున్నాయి. కాయలను ఫ్యాక్టరీకి తీసుకపోయి, వాళ్ళు తీసుకోకపోవడంతో కొంతమంది రైతులు రోడ్లమీద కూడా పారబోస్తున్నారు. ఈరకంగా ఫ్యాక్టరీకి చేరేలోపు చాలా కాయలను రైతులు నష్టపోతున్నారు. కావున ఎకరాకు మామిడి చెట్ల ఆధారంగా ప్రభుత్వం సబ్సిడీని మంజూరు చేయాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు. మామిడి పంట ఎకరాకు సగటున నాలుగు టన్నులు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన ప్రభుత్వం వద్ద పంటల లెక్కలు ఉన్నాయి. ఇదివరకే ఈ లెక్కలను సేకరించి, దాని ప్రకారమే రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. కావున ఫ్యాక్టరీలకు, రాంపులకు సరఫరా చేసిన కాయల ఆధారంగా కాకుండా, మామిడి తోటల విస్తీర్ణం ఆధారంగా ప్రభుత్వం రైతులకు సబ్సిడీని అందజేయాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.

