15, జూన్ 2025, ఆదివారం

జీడి నెల్లూరు టిడిపి ఎన్నికలకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు

మండలాల్లో ఎన్నికల పరిశీలనకు మరో ఆరుగురు పరిశీలకులు

మొత్తం తొమ్మిది మంది పరిశీలకుల నియామకం

ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామ, క్లస్టర్, మండల అధ్యక్షుల ఎన్నిక

అధిష్టానంతే అంతిమ నిర్ణయం


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.


గంగాధర నెల్లూరు నియోజకవర్గ  టిడిపి  గ్రామ, క్లస్టర్,  మండల  కమిటీల ఏర్పాటు మళ్ళీ మొదటికి వచ్చింది. అధిష్టానం శనివారం నియోజక వర్గానికి ముగ్గురు, ఆరు మండలాలకు ఆరుగురు పరిశీలకులను నియమించింది. దీనితో ఇప్పటి వరకు నిర్ణయించిన కమిటీలు బుట్టదాఖలు అయ్యాయి.  ఇప్పటికే మండల స్థాయిలో గ్రామ,  బూత్, క్లస్టర్ కమిటీలు పూర్తయ్యాయి. మండల కమిటీల జాబితా సిద్ధం అయినప్పటికీ అధిష్టానం జోక్యంతో ఆ ప్రకటన ఆగిపోయింది. ఇప్పుడు అన్ని కమిటీలను తాజాగా ఏర్పాటు చేయవలసి వస్తోంది. దీనితో ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ వర్గంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంలో కొత్త అశలు చిగురించాయి. 


ప్రస్తుతం నియోజకవర్గ పరిశీలకుడుగా మల్లారపు రవిప్రకాష్ వ్యవహరిస్తున్నారు.  అధనంగా రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడును కొత్తగా నియోజక వర్గం పరిశీలకులుగా నియమించారు. వీరు మండల, క్లస్టర్ కమిటీల ఆశావహుల పేర్లు ఎంపిక చేసి అధిష్టాన వర్గానికి పంపుతారు. పార్టీ ఐ వి ఆర్ ఎస్ సర్వే ద్వారా 70 శాతం మద్దతు ఉన్న వారిని మండల అధ్యక్షునిగా నియమిస్తుంది. ఎవరికీ తగిన మద్దతు లేక పోతే తిరిగి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.  వీరు కాకుండా మరో ఆరు మందిని మండల పరిశీలకులుగా నియమించారు. వీరు బూత్, గ్రామ, యూనిట్ కమిటీలను ఎంపిక చేసి పార్టీకి పంపుతారు. జి డి నెల్లూరు మండలానికి బంగారు పాల్యం మాజీ ఎంపిపి ఎన్ పి జయప్రకాశ్,  కార్వేటినగరం మండలానికి  రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, పాలసముద్రం మండలానికి  పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, పెనుమూరు మండలానికి పార్లమెంటు ఉపాధ్యక్షుడు గంజి మాధవయ్య, ఎస్ ఆర్ పురం మండలానికి చుడా చైర్ పర్సన్ కటారి హేమలత, వెదురుకుప్పం మండల పరిశీలకునిగా కాణిపాకం ఆలయ  మాజీ చైర్మన్ ఎం సురేంద్రబాబును నియమించారు. వీరు అన్ని స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తారు. నియోజక వర్గంలో కమిటీల ఏర్పాటు తొలి నుంచి వివాదాస్పదంగా ఉంది. ఎమ్మెల్యే తన చుట్టూ ఉన్న నలుగురు వ్యక్తుల సూచన మేరకు ఏక పక్షంగా కమిటీలను ఏర్పాటు చేశారని పలువురు అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేశారు. పలువురు సీనియర్ నాయకులు గత నెలలో రాష్ట్ర ఎన్నికల నిర్వహణా కమిటీ చైర్మన్ వర్ల రామయ్యను తిరుపతిలో కలసి ఫిర్యాదులు చేసారు. వీరిలో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, థామస్ తమ్ముడు నిధి ఉండటం విశేషం. దీనితో పాటు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా ఫిర్యాదులు చేశారు. దీనితో సంస్థాగత ఎన్నికలను నిలిపి వేయాలని అధిష్టానం ఆదేశించింది.  ఎమ్మెల్యే ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని వ్యతిరేక వర్గాలు పలు ఆరోపణలు చేశారు. మూడు సార్లు పదవిలో ఉన్న వారికి తిరిగి అవకాశం ఇవ్వరాదని మంత్రి నారా లోకేష్ సూచించారు. దీనికి పొలిట్ బ్యూరో ఆమోదం కూడా లభించింది. అయితే మూడు, అంతకంటే ఎక్కువ సార్లు పదవిలో ఉన్న ముగ్గురిని మండల అధ్యక్షులుగా కొనసాగించడానికి ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఎమ్మెల్యే కోటరీ ప్రలోభాలకు లొంగి పోయారని కొందరు ఆధారాలతో సహా అధిష్టాన వర్గానికి పంపారని తెలిసింది. ఒక మండల నాయకుడు పనులు చేయిస్తానని ఓ దళిత మహిళ వద్ద లక్ష రూపాయలు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులు అందాయి. దీనికి సంబంధించిన ఆడియో, వీడియోలను అధిష్టాన వర్గానికి పంపారు. అలాంటి వ్యక్తిని ఒక మండలానికి అధ్యక్షుని చేయడానికి ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారని అంటున్నారు. చంద్రబాబు ప్రశంసలు అందుకున్న పాలసముద్రం మండల కమిటీ అధ్యక్షుడు  రాజేంద్ర (ఎస్సీ)ను తొలగించి కమ్మ సామాజిక వర్గం నేతకు పదవి కట్టబెట్టే ప్రయత్నం చేశారని తెలిసింది. కాగా ఆరు మండలాలలో ఒకటి కూడా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించలేదని ఫిర్యాదులు అందాయి. అన్ని స్థాయిల్లో సామాజిక న్యాయం చేయాలని పార్టీ ఆదేశించినా అధిక శాతం ఓట్లు ఉన్న రెడ్లను పక్కన పెట్టడం వివాదానికి దారితీసింది.  జి డి నెల్లూరు మండలంలో ప్రస్తుత అధ్యక్షుడు సామి దాసు, మాజీ అధ్యక్షుడు దేవ సుందరం, శ్రీధర్ యాదవ్ మధ్య పోటీ నెలకొన్నది. ఎస్ ఆర్ పురం మండలంలో జయశంకర్ నాయుడు కొనసాగాలని భావిస్తున్నారు. అయితే ఆయన మూడు సార్లు పదవిలో ఉన్నందున మార్చాలని కొందరు అంటున్నారు. రాజశేఖర్ నాయుడు, మునివర్ధ నాయుడు, వేమా నాయుడు, పైనేని మురళి పోటీ పడుతున్నారు. కార్వేటినగరంలో  ప్రస్తుత అధ్యక్ష చంగల్రాయ యాదవ్ కొనసాగాలని ఆశిస్తున్నప్పటికీ మూడు సార్లు పదవిలో ఉన్నందున మార్చాలని కొందరు కోరుతున్నారు. రవి యాదవ్, రవికుమార్, వాసుదేవ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వెదురుకుప్పం మండలంలో  ప్రస్తుత అధ్యక్షుడు లోకనాథ రెడ్డి కొనసాగాలని కోరుకుంటున్నారు. మునిచంద్రా రెడ్డి, కిషన్ చంద్, మోహన్ మురళీ పోటీ పడుతున్నారు. పెనుమూరులో తిరిగి రుద్రయ్య నాయుడు పదవిలో కొనసాగాలని పట్టుగా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా హరి బాబు నాయుడు, సుబ్రమణ్యం నాయుడు, ప్రకాశ్ నాయుడు, సతీష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, షణ్ముఘ వర్మ, నాగరాజ రంగంలోకి దిగారు. రుద్రయ్య ఇప్పటికీ ఎనిమిది సార్లు పదవిలో ఉన్నారని, ఈ సారి తమలో ఒకరికి ఇవ్వాలని కోరుతున్నారు. కాగా నియోజక వర్గంలోని ఆరు మండలాలలో సామాజిక న్యాయం పాటించాలని అధిష్టానం భావిస్తోంది. మూడు సార్లు లేదా ఆరు సంవత్సరాలు పదవిలో ఉన్న వారిని పక్కన పెట్టాలని నిర్ణయించారు.  ఈ నేపధ్యంలో కొత్త పరిశీలకుల నియామకం చర్చకు దారి తీస్తోంది. నియోజకవర్గంలోని అన్ని రకాల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. గ్రామ, క్లస్టర్, మండల అధ్యక్షుల నియామకంలో ఏకగ్రీవానికి మొదట ప్రాధాన్యత ఉంటుంది. పోటీ ఉంటే ఆ పేర్లను పరిశీలకులు అధిష్టానానికి నివేదిస్తారు. అధిష్టానం ఐవిఆర్ఎస్ ద్వారా కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకొని, అధిక ఓట్లు వచ్చిన వారిని అధ్యక్షులుగా నియమిస్తారు. ఇందులో ఎలాంటి సిఫార్సులకు తవుండదని అధిష్టానం స్పష్టం చేసింది. ఒక నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత ఎన్నికల నిమిత్తం తొమ్మిది మంది పరిశీలకులను అధిష్టానం నియమించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.






అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *