24, జూన్ 2025, మంగళవారం

చిత్తూరు జిల్లాలో రోడ్డుపాలవుతున్న మామిడి

అమలు కానీ ప్రభుత్వ మద్దతు ధర 

మామిడి తీసుకోవడానికి ముందుకురాని ఫ్యాక్టరీలు

కాయలు అన్లోడ్ కు మూడు నుంచి నాలుగు రోజులు 

ట్రాక్టర్లలోనే కుళ్ళి పాడవుతున్న మామిడి 

పర్మిట్లు దొరకక చెట్ల వద్దే రాలిపోతున్న కాయలు 


ఆంధ్రప్రభ, చిత్తూరు బ్యూరో.

ఏడాది మొత్తం శ్రమించి పండించిన మామిడికి చిత్తూరు జిల్లాలో గిట్టుబాటు ధర లభించడం లేదు. గిట్టుబాటు ధర లేకున్నా, పక్వానికి వచ్చిన కాయలను జ్యూస్ ఫ్యాక్టరీలు తీసుకోవడం లేదు. జ్యూస్ ఫ్యాక్టరీలకు సంబంధించిన బంధుమిత్రులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాన్య రైతులకు మామిడి సరఫరా చేయడానికి పర్మిట్లు దొరకడం లేదు. ఒకవేళ పర్మిట్ దొరికినా, ఫ్యాక్టరీ వద్ద అన్లోడ్ కావడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది. దీంతో ట్రాక్టర్లలోనే మామిడికాయలు కుళ్లి పాడైపోతున్నాయి. దీంతో ఫ్యాక్టరీలు ఆ కాయలను తిరస్కరించడంతో రైతులు రోడ్డు మీదనే పారబోస్తున్నారు. మరి కదరు రైతులకు కాయలను సరఫరా చేయడానికి పర్మిట్లు దొరకక  పండించిన పంటను రోడ్డుపాలు చేస్తున్నారు. ఇంకొంతమంది రైతులు మామిడికాయలను కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి ధమనీయంగా తయారయింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెటింగ్ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. పక్వానికి వచ్చిన కాయలు తోటలోనే   రాలిపోతున్నాయి. ఫ్యాక్టరీలకు సరఫరా చేయడానికి పర్మిట్లు దొరకడం లేదు. దీంతో ఈ సీజన్ కు మామిడి రైతులు పంట మీద ఆశలను వదులుకుంటున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంటను బాధతో రోడ్డుపాలు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. వాటి నుంచి ఏటా ఎనిమిది లక్షల టన్నులు దిగుబడి వస్తుంది. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే, చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు అధికంగా సాగులో ఉన్నాయి.  ప్రధానంగా పల్ప్ పరిశ్రమకు అవసరమైన తోతాపురి రకం మామిడిని అధికంగా సాగు చేస్తారు. దిగుబడిని అంచనా వేసిన జిల్లా అధికారులు కిలో తోతాపురి మామిడి కిలో రూ. 12కు కొనుగోలు చేయాలని మద్దతు ధర ప్రకటించారు. అందులో నాలుగు రూపాయలు ప్రభుత్వం, మిగతా ఎనిమిది రూపాయలు చెల్లిస్తుందని ప్రకటించారు. అంతధరకు మొదటి నుంచి పరిశ్రమ వర్గాలు ససేమిరా అన్నాయి. ప్రైవేటు మార్కెట్ లో నాలుగుకు మించకుంటే, ఎనిమిది రూపాయలు ఎలా చెల్లించగలమని గుజ్జు పరిశ్రమల యజమానులు మొండికేస్తున్నాయి. మామిడి గుజ్జు పరిశ్రమల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చర్చించి, ఒప్పించారు. అయినా, చిత్తూరు జిల్లాలో మామిడి ధర సంక్షోభంలో పడింది. గత సంవత్సరంతో పుల్చుకుంటే,  దిగుబడి గణనీయంగా పెరగడం రైతుల్లో ఆనందం వికసించినా, ధరలు ఉస్సూరుమనిస్తున్నాయి. ఈ సీజన్లో చివరి కాయ వరకు కొంటాం. కిలో కు 12 రూపాయలు మద్దతు ధర నిర్ణయించాం. ఫ్యాక్టరీలు 8 రూపాయలు చెల్లిస్తాయి. ప్రభుత్వం మరో 4 రూపాయలు అందచేస్తుంది. ఫ్యాక్టరీలు రైతులకు 8 రూపాయలు ఇవ్వల్చిందే. లేకుంటే, చూస్తూ ఉరుకోనేది లేదని చిత్తూరు జిల్లాలో పర్యటించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చం నాయుడు స్పష్టం చేశారు.  అయినా చిత్తూరు జిల్లాలో ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు జరగడం లేదు. జ్యూస్ ఫ్యాక్టరీలు నాలుగు నుంచి ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి జిల్లాలోని అన్ని జ్యూస్ ఫ్యాక్టరీలను పరిశీలించారు. ఎక్కడ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు జరగడం లేదని గుర్తించారు. కనీసం కిలోకు ఆరు రూపాయలు అయినా చెల్లించాలని మామిడి గుజ్జు ఫ్యాక్టరీలను కోరారు. వారి విజ్ఞప్తిని కూడా గుజ్జు పరిశ్రమలు పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు నోటీసులు జారీ చేశారు. రైతులకు ఆరు రూపాయల వంతున కచ్చితంగా ఇవ్వాలని కోరారు. అయినా జిల్లా కలెక్టర్ ఆదేశాలను ఏ జ్యూస్ ఫ్యాక్టరీ కూడా అమలు చేయడం లేదు. రైతుల పండించిన మామిడిని కూడా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఒక్కొక్క జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద 400 వరకు ట్రాక్టర్లు వేచి ఉన్నాయి. అన్లోడింగ్ కు  మూడు నుంచి నాలుగు రోజుల సమయం  పట్టడంతో, ట్రాక్టర్ల లోనే కాయలు పాడైపోతున్నాయి. దీంతో రైతులు  సోమల మండలంలో మామిడికాయలు రోడ్డు పక్కన టన్నుల కొద్ది  పడేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మ్యాంగోనగర్ గా ప్రసిద్ధి చెందిన చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండల కేంద్రానికి సమీపంలోని దామరచర్ల ప్రైవేట్ మార్కెట్ మండీల వద్ద ఇచ్చే రేటు కూలీలు రవాణా ఖర్చులకు రావడం లేదని రైతులు  వలవల ఏడుస్తున్నారు. దిగుబడి తక్కువ ఉన్నప్పుడు ధరలు ఉండడం లేదు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది దిగుబడే కాదు. మామిడికాయ నాణ్యత కూడా మెరుగ్గా ఉంది. జిల్లాలోని రైతుల నుంచి మామిడి దిగుబడిని గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. విభిన్న ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని పర్యవేక్షణకు నియమించింది. ఇంత చేసినా మామిడి తోటలు సాగులు చేసిన రైతులకు కష్టాలు, కడగండ్లు, కన్నీరే మిగిలింది. పొరుగు రాష్ట్రాల నుంచి మామిడి కాయలు రాకుండా కట్టడి చేశారు. జిల్లాలోని దిగుబడి మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించడమే కాదు. సరిహద్దుల్లో మహారా ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణాలు ఇవిఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలు పూర్తిస్థాయిలో తెరవకపోవడం ఒక కారణమైతే. ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు కూడా సామర్ధ్యానికి తగినట్లు పనిచేయడం లేదు. ఎక్కువ కాయలు తీసుకుంటే, తమకు ఎక్కువ నష్టం వస్తుందని ఫ్యాక్టరీ యజమానులు భావిస్తున్నారు. దీంతో ఎదో చేస్తున్నట్లు షో చేస్తున్నారు. అప్పుడప్పుడు రెండు రోజుల పాటు మామిడి తీసుకోకుండా, విరామం ప్రకటిస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో కిలో మూడు నుంచి నాలుగు రూపాయలు ఉంటే, ఎనిమిది ఎలా చెల్లించగలమని ప్రశ్నిస్తున్నారు. కొన్ని పరిశ్రమల వద్దకు టోకెన్లు లేకున్నా, మామిడికాయల లోడుతో వెళ్లిన ట్రాక్టర్లు కిలోమీటర్ల కొద్ది బారులు తీరాయి. ఈ ఏడాది మామిడి దిగుబడి అధికంగా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర బలవంతంగా రుద్దడం వల్లే రైతులకు కష్టాలు తప్పడం లేదనే భావన వినిపిస్తోంది. మార్కెట్టులో ఉన్న ధరలకు ఒకటి లేదా రెండు రూపాయలు అధికంగా ఇచ్చినా రైతులు మామిడికాయలు రోడ్డుపై పడేసే పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 47 మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం, వీటిలో 39 పల్ప్ ఫ్యాక్టరీల నుంచి, 27 పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వ కొనుగోలుకు స్పందించాయి. ఏడు పరిశ్రమలు తెరవలేదు. అందులో చిత్తూరు జిల్లాలో 35 పరిశ్రమలకు 27 మాత్రమే తెరిచారు.  జిల్లాలోని ఒకో మామిడి గుజ్జు పరిశ్రమలో రోజుకు 250 టన్నులు ప్రాసెస్ చేయగలిగే సామర్థ్యం ఉంది. దీనివల్ల అన్ని యూనిట్లు పనిచేస్తే, ఉమ్మడి జిల్లాలోని అన్ని పరిశ్రమలు తెరవడం వల్ల 12 వేల టన్నుల నుంచి 13 వేల టన్నులు మామిడి ప్రాసెస్ చేయవచ్చు. అయితే, ప్రస్తుతం ఎనిమిది వేల టన్నులు మాత్రమే ప్రాసెస్ చేస్తున్నారు. ప్రతి పల్ప్ పరిశ్రమలో ఒకే ర్యాంప్ మాత్రమే పనిచేస్తోంది. మిగతా రెండు, మూడు ర్యాంపులు కూడా వినియోగంలోకి తీసుకుని వస్తే, రైతుల నుంచి కాయలు కొనుగోలు చేయడం పెద్ద కష్టం కాదు. 

రైతుల ఆందోళన

మామిడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు కాకపోవడం రైతుల నుంచి మామిడిని జ్యూస్ ఫ్యాక్టరీలు తీసుకోకపోవడంతో జిల్లాలోని రాజకీయ పార్టీలు మామిడి రైతులకు అండగా నిలుస్తున్నాయి. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ ఆందోళనకు దిగాయి. రైతులకు 12 రూపాయల గిట్టుబాటు ధరను ఇవ్వాలని, రైతును పండించిన మామిడిని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాయి. గత శనివారం మామిడి ధరల స్థిరీకరణ కమిటీ కూడా ఆందోళన నిర్వహించింది. జిల్లా కలెక్టర్ ని కలిసి మామిడి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరింది. మంగళవారం బంగారుపాళ్యం మామిడి మార్కెట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే పోలీస్ అధికారులు వైసిపి ఆందోళనకు అనుమతిని మంజూరు చేయలేదు. అయినా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మంగళవారం ధర్నా నిర్వహించారు. మరోవైపు రైతులకు టోకన్లు జారీ చేయడం లేదంటూ రైతులు జ్యూస్ ఫ్యాక్టరీ లేదుట ఆందోళనకు దిగుతున్నారు.


పో రై గంగ 1 ఫ్యాక్టరీ వద్ద అన్లోడ్ చేయకుండా పాడైన రోడ్డు మీద పోసిన కాయలు 

గంగ 2 ఫ్యాక్టరీలకు తోలడానికి పర్మిట్ దొరకక రోడ్డు మిద పోసిన కాయలు 

గంగ 3 కోయకుండా చెట్ల వద్దనే రాలిపోతున్న కాయలు 







అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *