ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలుకు చర్యలు
పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోయండి
ఈ విషయమై మామిడి రైతులకు విస్తృతంగా అవగాహన
ప్రాసెసింగ్ కంపెనీల వద్ద మండల అధికారుల పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు జూన్ 06 (ఆంధ్రప్రభ బ్యూరో): తోతాపురి మామిడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 12 వేల రూపాయల మద్దతు ధరను జిల్లా స్థాయిలో పటిష్టంగా అమలుచేయడానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రొసెసింగ్ కంపెనీల వద్ద మామిడి సరఫరా పై పర్యవేక్షణకు మండల స్థాయిలో తహసిల్దార్లు, వ్యవసాయ, ఉద్యాన శాఖ, పోలీస్ అధికారుల ను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రాసెసింగ్ కంపెనీల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అందుకు అనుకునంగా మామిడి సరఫరాకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. శుక్రవారం జిల్లా సచివాలయం లోని సమావేశపు మందిరం నుండి జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి తో కలసి తోతాపురి మామిడిని ప్రొసెసింగ్ కంపెనీలకు తరలింపులో భాగంగా కంపెనీల వద్ద తీసుకోవలసిన చర్యల పై రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ మద్ధతు ధర ప్రకటించడం జరిగిందని, దీనిని పూర్తి స్థాయిలో రైతులకు మేలు జరిగేలా చేయడంలో జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, పోలీస్ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్ళడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయన్నారు. ఇందుకు ప్రధానంగా ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్ళడం లో భాగంగా ఇతర రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక నుండి ప్రొసెసింగ్ కంపెనీ లకు మామిడి సరఫరా కాకుండా చెక్ పోస్ట్ ల వద్ద నిఘా పెంచాలన్నారు. మండల స్థాయిలో ఎం ఆర్ ఓ, వ్యవసాయ అధికారి, ఉద్యాన శాఖ అధికారి వారి పరిధిలో గల ప్రొసెసింగ్ కంపెనీ ల వద్ద రోజుకు మూడు షిఫ్ట్ లలో విధులు నిర్వర్తించేలా వి ఆర్ ఓ, ఉద్యాన, వ్యవసాయ అసిస్టెంట్ లతో కలసి ఒక బృందంగా మూడు బృందాలను సిద్ధం చేసుకోవాలని వీరితో పాటు రోజులో ఒకసారి అయిన మండల స్థాయి అధికారులు, ప్రాసెసింగ్ కంపెనీల వద్దకు వెళ్ళి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలన్నారు. విధుల్లో ఉన్న వారు ప్రాసెసింగ్ కంపెనీకి తోతాపురి మామిడిని అందించిన రైతుల వారీ వివరాలు వారి ఆధార్, బ్యాంక్ ఖాతా, ఫోన్ నెంబర్ వివరాలను పూర్తిగా నమోదు చేసుకోవాలన్నారు. ట్రేడర్లు, ఎఫ్ టి ఓ కలెక్షన్ సెంటర్ లు, ర్యాంప్ లు, మండీలు వద్ద నుండి రైతులు వచ్చినప్పటికీ వారి వివరాలను కూడా నమోదు చేయాలని తెలిపారు. మామిడి ధర నిలకడగా ఉంటుందని, పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోసి ప్రొసెసింగ్ కంపెనీ లకు తరలించాలనే విషయం పై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, ఈ విషయంలో క్షేత్ర స్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అసిస్టెంట్లు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. దీనితో పాటు వారి పరిధిలో ఉన్న తోతాపురి రకం మామిడి పంట దిగుబడి, ఏ రోజు ఎన్ని టన్నులు కోత కోయడం జరుగుతుందనే అంశాన్ని పూర్తిగా అంచనా వేసిన పక్షంలో రైతులను ఏ ప్రాసెసింగ్ కంపెనీలకు పంపాలనే విషయాన్ని అధికారులు నిర్ధారించుకునేందుకు అవకాశం ఉంటుందని, ఈ దిశగా కూడా అధికారులుపని చేయాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మామిడి సీజన్ లో ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరలో రైతుకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ నెల రోజులు రెవెన్యూ, ఉద్యాన, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేయడం ద్వారా రైతులకు మరింత మేలు చేసేందుకు అవకాశం ఉంటుందని, ఈ దిశగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. ర్యాంప్ లు, మండీలలో తూనీకలు, కొలతల అధికారుల ద్వారా తూకాలను పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళికృష్ణ, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల ఉద్యాన శాఖ అధికారులు, మధుసూదన్ రెడ్డి, దశరథ రామి రెడ్డి, రవిచంద్ర బాబు, డి ఎస్ ఓ శంకరన్, మార్కెటింగ్ ఏడి పరమేశ్వరన్, తూనీకలు, కొలతలు శాఖ ఏడి స్వామి తదితరులు పాల్గొన్నారు.
పో రై గంగ 2 ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు విషయమై సమిక్షిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

