14, జూన్ 2025, శనివారం

రైతులకు రూ. 8 చెల్లించకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చం నాయుడు హెచ్చరిక  


చిత్తూరు, జూన్ 14 (ఆంధ్రప్రభ బ్యూరో) : జిల్లాలోని మామిడి ఫ్యాక్టరీలు కిలోకు ఎనిమిది రూపాయలు వంతెన రైతులకు తప్పక చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు స్పష్టం చేశారు. శనివారం సాయంకాలం చిత్తూరు మంగసముద్రం మార్కెట్ యార్డులో రైతులతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం మామిడి దిగుబడి ఊహించని విధంగా ఎక్కువగా వచ్చిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారని తెలిపారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసన్ వారం రోజులు చిత్తూరులోనే బస చేసి మద్దతు ధర పైన కసరత్తు చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి మద్దతు ధర 12 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందులో ఫ్యాక్టరీలు 8 రూపాయలు చెల్లిస్తాయని, ప్రభుత్వం నాలుగు రూపాయలు చెల్లిస్తుందని వివరించారు. రైతులు తొందరపడి పక్వానికి రాని కాయలను కోయవద్దని మంత్రి కోరారు. చివరి కాయ వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, రైతులు పక్వానికి వచ్చిన కాయలనే కోసి ఫ్యాక్టరీలకు సరఫరా చేయాలని సూచించారు. ప్రతి ఫ్యాక్టరీ తప్పనిసరిగా ఎనిమిది రూపాయలు ఇవ్వాలని అలా ఇవ్వని పక్షంలో ప్రభుత్వం తన పని తాను చేస్తుందని మంత్రి హెచ్చరించారు. ఎవరైనా ఎనిమిది రూపాయలకు తక్కువ ధరను చెల్లిస్తే జిల్లా కలెక్టర్, ఉద్యానవన శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. చిత్తూరులో అసంపూర్తిగా ఉన్న మంగసముద్రం మార్కెట్ యార్డును పూర్తి చేయడానికి అవసరమైన నిధులను విడుదల చేస్తున్నట్లు మంత్రి అచ్చం నాయుడు ప్రకటించారు. 30 ఎకరాలలో చిత్తూరు మార్కెట్ యార్డును మోడల్ మార్కెట్ యార్డ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చిత్తూరుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి మామిడి రాకుండా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. మామిడికి మద్దతు ధరను ప్రకటించినందుకు మంత్రి అచ్చం నాయుడును తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతు సంఘాలు ఘనంగా సన్మానించాయి. జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు సి ఆర్ రాజన్ మాట్లాడుతూ పక్క రాష్ట్రాల నుంచి మామిడి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, దళారీ వ్యవస్థ నిర్మూలించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ చిత్తూరు మంగసముద్రం మార్కెట్ యార్డును 30 ఎకరాలలో గత తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేయాలని 9 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. ఇందులో మూడున్నర కోట్ల రూపాయలను ప్రభుత్వ విడుదల చేసిందని, ప్రస్తుతం మరో ఏడున్నర కోట్ల రూపాయలు అవసరమని, ఆ నిధులను విడుదల చేయాల్సిందిగా కోరారు. చిత్తూరు పార్లమెంటు సభ్యుడు ప్రసాదరావు మాట్లాడుతూ మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ప్రభుత్వం నిర్ణయించిన ఎనిమిది రూపాయల మద్దతు ధరను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మద్దతు ధర అమలు విషయమై జిల్లాలో పర్యటించిన మంత్రిని అభినందించారు. వ్యవసాయ శాఖ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ మాట్లాడుతూ శ్రీనివాసపురం, కృష్ణగిరి నుంచి మామిడి రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. చిత్తూరు శాసనసభ్యుడు జగన్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మద్దతు ధర నిర్ణయం లో జిల్లా కలెక్టర్ చూపిన చొరవను అభినందించారు. ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ ప్రతి ఒక్కరికి అందుతుందని, రైతులు తొందర పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాదరి, ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఆముద, చూడ చైర్మన్ కటారి హేమలత, బిజెపి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, ఉద్యానవన శాఖ డిడి తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరులో జరిగిన రైతుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అచ్చం నాయుడు 

సమావేశానికి హాజరైన రైతులు, రైతు సంఘం నాయకులు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *