టిడిపి విస్తృతస్థాయి సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేల డుమ్మా
సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మామిడి రైతుల సమస్యలను ప్రస్తావించిన చిత్తూరు ఎమ్మెల్యే
ఫ్యాక్టరీ యజమానులతో మాట్లాడి మద్దతు ధర ఇప్పించాలన్న సీఎం
ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని నిర్దేశం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి చిత్తూరు జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు, నియోజకవర్గ పరిశీలకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యక్రమాల గురించి చంద్రబాబు మార్గదర్శనం చేశారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నెలరోజుల పాటు ప్రజాప్రతినిధులందరూ ఇంటింటికి తిరగాలని, ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చెప్పాలని, వైసిపి కొత్త రాజకీయాలను వివరించాలని కోరారు. అయితే ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు శాసనసభ్యుడు జగన్మోహన్ నాయుడు, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, చిత్తూరు ఎంపీ ప్రసాదరావు హాజరయ్యారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్, నగరిఎమ్మెల్యే భాను ప్రకాష్ ఈ సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకోవాలని, పార్టీ కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పార్టీ కార్యక్రమాల కంటే ఆలయ దర్శనాలు, విదేశీ పర్యటనలు ముఖ్యం కాదన్నారు.
ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్తారని జిల్లాలోని మామిడి రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే జిల్లాకు చెందిన కొందరు శాసనసభ్యులకు ఈ సమస్య పట్టనట్లు సమావేశానికి హాజరు కాలేదు. హాజరైన వారిలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడు మాత్రం ఈ విషయమై ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. జిల్లాలోని శాసన సభ్యులందరూ ఏకమై తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని భావించిన మామిడి రైతులకు నిరాశ ఎదురయింది. ఒక పరిష్కార మార్గంతో తిరిగి వస్తారన్న మామిడి రైతుల ఆశలు అడియాసలయ్యాయి. చిత్తూరు జిల్లాలో టిడిపి ప్రజా ప్రతినిధులకు మామిడి రైతుల సమస్యలు పట్టడంలేదని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. మామిడి పండ్లు పండించే తమ గోడు ఎవరు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మంగళగిరిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు సభలో కూడా ఈ విషయం స్పష్టం అయ్యింది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయుడు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మామిడి పండించే రైతుల సమస్యలను ప్రస్తావించారు. దీనికి స్పందనగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు మామిడి గుజ్జు ఫ్యాక్టరీల వద్దకు వెళ్ళి యజమానులను నిలదీయమని ఆదేశించారు. కిలో మామిడికి ఫ్యాక్టరీ వారు ఇచ్చే ఎనిమిది రూపాయలకు, ప్రభుత్వం ఇచ్చే నాలుగు రూపాయలు కలిపి రైతులకు ఇప్పించాలని సూచించారు. అయితే ఇప్పటి వరకు ఒక ప్రజాప్రతినిధి కూడా ఫ్యాక్టరీల వద్దకు వెళ్ళలేదు. దీనిపై టిడిపి రాష్ట్ర నేత ఒకరు మాట్లాడుతూ మన ఎమ్మెల్యేలకు చంద్రబాబు అంటేనే భయం లేదు, ఆయన చెపితే వినే వారు ఎవరు అంటూ వ్యాఖ్యానించారు. మంగళగిరిలో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారని తెలిపారు. జిల్లాలో సీఎం చంద్రబాబు తో పాటు ఉన్న ఆరు మందిలో ముగ్గురు సమావేశంలో పాల్గొనక పోవడం బట్టి వారికి ప్రజల పట్ల ఎంత మాత్రం శ్రద్ధ లేదని అర్థం అవుతోందని అంటున్నారు. జిల్లాకు చెందిన ఎన్ అమరనాథ రెడ్డి, డాక్టర్ వి ఎం థామస్, గాలి భానుప్రకాష్ సమావేశానికి గైర్హాజర్ అయ్యారు. జూలై రెండు నుంచి నెల రోజుల పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి సుపరిపాలన గూర్చి ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. జగన్ పాలనలో జరిగిన కుట్రలు వెలుగులోకి తేవాలని, కూటమి చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కోరారు. అయితే చిత్తూరు జిల్లాలో తిరగలేమని కొందరు నాయకులు అంటున్నారు. ముఖ్యంగా మామిడి రైతుల ముఖం చూడలేమని, వారి విమర్శలకు తమ వద్ద జవాబు లేదని అంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకంటే బాగుందని టిడిపి వారే కొందరు తెలిపారు. కూటమి నేతలు గ్రామాలకు వస్తే అవమానాలు ఎదుర్కోవలసి వస్తుందని టిడిపి నాయకులే ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి చాలా దమనీయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 12 రూపాయల మద్దతు ధర అమలు జరగడం లేదు. జిల్లాలోని జ్యూస్ ఫ్యాక్టరీలు నాలుగు నుంచి ఐదు రూపాయలు వరకు చెల్లించే అవకాశం ఉంది. ర్యాంపుల వద్ద రెండు నుంచి రెండున్నర రూపాయలు చెల్లిస్తున్నారు. పక్వానికి వచ్చిన మామిడికాయలను ఫ్యాక్టరీలకు సరఫరా చేయడానికి కుదరడం లేదు. ఏ ఫ్యాక్టరీ వద్ద చూసిన వందలాది వాహనాలు బారుల తీరి ఉన్నాయి. ఫ్యాక్టరీలకు కాయలను సరఫరా చేయకుండా కొందరు రోడ్లమీదనే పారబోస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని శాసనసభ్యులు బుధవారం నుంచి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ విజయాలను ఎలా వివరిస్తారో వేసి చూడాల్సిందే.

