జీడీ నెల్లూరులో మళ్ళీ రచ్చకెక్కిన లంచం రగడ !
క్వారీ పునరుద్ధరణకు రూ. 50 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు
సంవత్సరానికి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు ఆడియో
సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆడియో
అధిష్టానానికి ఫిర్యాదు చేసిన టిడిపి నేతలు.
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గంగాధర నెల్లూరుకు చెందిన ప్రజాప్రతినిధి అనుచరుడు ఒకరు క్వారీ యజమాని వెంకటేశ్వర రెడ్డి వద్ద 50 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆడియో జిల్లా వ్యాపారంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఆడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. బుధవారం రెండు టీవీ ఛానల్ లో కూడా ఈ ఆడియో టేబులు ప్రసారమయ్యాయి. గత నాలుగు రోజుల కింద ఇదే నియోజకవర్గానికి చెందిన లంచాల బాగోతం పోలీస్ స్టేషన్ కు ఎక్కింది. తాను లంచం తీసుకున్నట్లు చెబుతున్న ఒక ఆడియోను ఒక ప్రభుత్వ ఉద్యోగి సామాజిక మాధ్యమాలలో పెట్టడంతో అతనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఎటూ తేలకముందే క్వారీ కి సంబంధించిన అనుమతులు పునరుద్ధరిస్తామని 50 లక్షలు తీసుకున్నట్లు మరో ఆడియో సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమైంది ఈ విషయాన్ని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకొని వెళ్లారు.
ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర రెడ్డి కార్వేటినగరం వద్ద క్వారీ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దానికి అటవీ శాఖ నుంచి సరైన అనుమతులు లేవని అధికారులు క్వారీ పనులకు అడ్డుపడ్డారు. దీనితో వెంకట రెడ్డి, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిని సంప్రదించాడు. ఆయన ఎమ్మెల్యే పేరు చెప్పి 50 లక్షలు తీసుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు అనుమతులు ఇవ్వక పోవడంతో వేంకటేశ్వర రెడ్డి ఫోన్లో ఆ అనుచరుడితో మాట్లాడుతూ తన ఆవేదన చెప్పుకున్నాడు. తాను 50 లక్షలు ఇచ్చినా పనికకపోవడం ఏమిటని నిలదీశారు. దీనితో పాటు నెలకు కోటి రూపాయలు అడిగితే తాను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ప్రశ్నించారు. తనకు ఆరోగ్యం కూడా బాగా లేదని తనను వేధించవద్దని ప్రాధేయ పడ్డారు. దీనికి ఆ అనుచరుడు సమాధానం చెపుతూ తను 50 లక్షలు ఎమ్మెల్యేకి ఇచ్చానని కావాలంటే అడిగి తెలుసుకోవాలని సమాధానం ఇచ్చాడు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొన్ని ప్రధాన ఛానళ్లలో ప్రసారం చేశారు. కాగా ఆ అనుచరుడు గతంలో వైసిపి నేత విజయానంద రెడ్డికి సన్నిహితుడిగా ఉండేవారని టిడిపి రాష్ట్ర నేత ఒకరు చెప్పారు. ఆయన ఎన్నికల ముందు థామస్ పంచన చేరి చక్రం తిప్పుతున్నారని అన్నారు. ఆయన అక్రమ వ్యవహారాలపై అధిష్టానం వర్గానికి నివేదిక పంపమని తెలిపారు. థామస్ ఈ నెల 28 వ తేదీన గంగాధర నెల్లూరులో భారీ ఎత్తున తన జన్మదిన వేడుకలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను చెన్నైకి శరవణ, హరీష్ యాదవ్, గుణశేఖర్ యాదవ్ , ఎమ్మెల్యే పి ఏ చంద్రశేఖర్ తీసుకున్నారు. ఈ దశలో ఇలాంటి ఆరోపణలు రావడం ఎమ్మెల్యేకి ఇబ్బంది కారణంగా తయారు అయ్యిందని అంటున్నారు. కాగా ఆ అనుచరుడు గతంలో మాజీ ముఖ్య మంత్రి నారాయణ స్వామి, విజయానంద రెడ్డితో తిరిగిన ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో హల్ చల్ చేస్తున్నాయి. థామస్ వ్యతిరేక వర్గం ఈ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకుని అధిష్టాన వర్గానికి ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటన సందర్భంగా వైసీపీ వాళ్లకు ఎటువంటి సహాయము చేయవద్దని కోరారు. పాముకు పాలు పోసినట్లు అవుతుందని హెచ్చరించారు. అయినా గంగాధర నియోజకవర్గంలో వైసీపీ నుంచి వచ్చిన కొంతమంది ఎమ్మెల్యే ముఖ్య అనుచరులుగా చలామణి అవుతున్నారు. వారి కారణంగానే స్థానిక ప్రజాప్రతినిధికి చెడ్డ పేరు వస్తుందని పార్టీకి చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు అవినీతి ఆరోపణలు వచ్చిన, చంద్రబాబు నాయుడు స్వయంగా హెచ్చరించిన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిస్థితులు మారలేదు. వైసీపీ నుంచి వచ్చిన కొంతమంది తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పుతున్నారు. ఇందువల్ల పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధికి దూరమవుతున్నారు. మండల పార్టీ అధ్యక్షుల నియామకంలో కూడా వీరి కారణంగానే చెడ్డ పేరు వచ్చిందన్న విషయాన్ని పార్టీ నాయకులు గుర్తు చేసన్నారు.
నోట్: ఇందుకు సంబంధించిన ఆడియో మహా న్యూస్ సాక్షి ఛానల్ లో ఈరోజు ప్రసారమైంది.

