చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో చిత్తూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయి. అందుకు భిన్నంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తరువాత అసాధారణంగా జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. చిత్తూరులో ప్రస్తుతం 34° సెంటీగ్రేడు ఉష్ణోగ్రత నమోదవుతోంది. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరింది. రాబోయే కొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతలు 39 నుండి 40 వరకు పెరిగే అవకాశం ఉంది. అడపాదడపా మేఘాలు, తేలికపాటి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఎండ తీవ్రత మాత్రం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో వడగాల్పుల ప్రభావం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉహించని విధంగా మండుతున్న ఎండలకు జనం విలవిల్లాడుతున్నారు. ఎండ తీవ్రత నుంచి రక్షించుకునేందుకు పండ్లు, శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. వేడిమి నుంచి రక్షించుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఎండ తాపాన్ని తట్టుకునేందుకు ఆయా గ్రామాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. చల్లని నీటి కోసం ఇళ్లలో నీటి బాటిళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారు. తలకు టోపీలు, ముఖానికి తెల్లని చేతిరుమాళ్లు కట్టుకోవడం, మహిళలు ముఖానికి చేతులను కప్పే దుస్తులు ధరించకుండా బయటకు వెళ్లడం లేదు. ప్రజలు నీడ, చల్లని గాలి, శీతల పానీయాల కోసం వెతుకుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో శీతలపానీయాలు, కొబ్బరి బొండాలు దుకాణాలు వెలిశాయి. ప్రజలు, వాహనదారులు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, కొబ్బరి బొండాల దుకాణాల వద్దకు చేరుకుంటున్నారు. చల్లదనం ఇచ్చే పుచ్ఛకాయలు, కొబ్బరి బొండాలు, దోసకాయలు, పండ్ల రసాలు, శీతల పానీయాలు, ఐస్‌క్రీంలకు గిరాకీ భలే పెరిగింది. ఖర్చులకు వెరవకుండా వేసవిలో సేదదీరడానికి అందుబాటులో ఉండే సదుపాయాలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎండల కారణంగా జిల్లాలో కరెంట్‌కు డిమాండ్ పెరిగిపోయింది. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో విరివిగా విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. ఎండలు, ఉకపోత ధాటికి తాళలేక ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీనిని తట్టుకోవడానికి తరచుగా విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. ఈ కోతలు పట్టణాల నుండి గ్రామాల వరకు ఉంటున్నాయి. రానున్న కాలంలో పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వేసవిలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండటం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెపుతున్నారు. చిత్తూరు జిల్లాలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటున్న కారణంగా ప్రజలు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరు బయట పనిచేసే వారు సూర్యరశ్మి కాపాడుకునేలా జాగ్రత్త పడాలి. తరుచూ నీళ్లు తాగాలి. ఎకువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. తెలుపు రంగు, లేత రంగులు పలుచని కాటన్ వస్త్రాలు ధరించాలి. తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. ఓఆర్‌ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. చంటిపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వడగాల్పులకు గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వడదెబ్బకు గురైన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. కాఫీలు, టీలు అధిక వేడి సమయంలో తీసుకోకూడదు. నీరు ఎంత ఎకువ తీసుకుంటే అంత మంచిది. ఎండలో ఎకువగా తిరిగితే డయేరియా రావొచ్చు. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో వృద్ధులు వడదెబ్బకు గురికాకుండా చూసుకోవాలి. ఎండలో ఎక్కువసేపు పనిచేయకూడదు. ఒకవేళ తప్పనిసరైతే ఎక్కువ నీటిని తాగాలి. నెత్తిన టోపీ ధరించాలి. వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఎండలో తిరిగేటప్పుడు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఒత్తిడికి గురి కాకుండా పనిచేయాలి. వడదెబ్బ బారిన పడినవారు గ్లూకోజ్, ఎలక్ర్టోల్ ఓఆర్‌ఎస్‌ను నీటిలో కలిపి తరచూ తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. ప్రాథమిక చికిత్సలో భాగంగా చల్లని నీటితో శరీరాన్ని తుడవడం, చిటికెడు ఉప్పు, చెంచా పంచదార కలిపిన నీటిని తాగి దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళాలి. ఎండలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పాలకూర, ముల్లంగి, వెల్లుల్లి, బీట్‌రూట్ వంటివి తీసుకోవడం మంచిది. ఎండలో నేరుగా నిలబడటం లేదా అధిక శారీరక శ్రమ చేయడం మానుకోవాలి. విపరీతమైన జ్వరం, మూత్ర విసర్జన సరిగా లేకపోవడం, నీరసం, నోరు తడి ఆరిపోవడం, చర్మం పొడిబారడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎండలకు తాగునీటి కొరత ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా సూచిస్తున్నారు.