కర్ణాటకలోని హోస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో చిత్తూరు వాసులు ఆరు మంది మృతి
మృతులలో బి.టెక్ విద్యార్థి, మూడు నెలల చిన్నారి
మృతులు జీడి నెల్లూరు నియోజకవర్గియులు
16 మందికి గాయాలు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : కర్ణాటకలోని హోస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ఆరుగురు మృతి చెందారు, వారిలో మూడు నెలల బాలుడు ఉన్నాడు. మరో 16 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు హోస్కోట్‌లోని సిలికాన్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొదుతున్నారు. తిరుపతి నుండి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసి బస్సు ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని ఎస్‍ఆర్ పురం, వెదురుకుప్పం మండల వాసులుగా గుర్తించారు. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 3 నెలల బాలుడితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన తులసి (21) బీటెక్ విద్యార్థి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో ఘటనా స్థలిలోనే వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగుకు చెందిన కేశవరెడ్డి, అతని సోదరుని కుమారుడు 3 నెలల బాబు ప్రాణాలు కోల్పోయారు. ఎస్ఆర్పురం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన తనూజ, వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగుకు చెందిన జనార్ధన్, ఆయన తల్లి పాపమ్మ, భార్య గిరిజ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. హోస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఘటనలో మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. పరిస్థితిపై అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని వెల్లడించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గంగాధర నెల్లూరు శాసనసభ్యులు థామస్, రాష్ట్ర మాల కార్పొరేటర్ డైరెక్టర్ యుగంధర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరుండి పర్యవేక్షించాలని నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు హరీష్ యాదవ్, బోడి రెడ్డి సుధాకర్ రెడ్డి, దామోదర్ రెడ్డిలను ఎమ్మెల్యే ఎంవి థామస్ పురమయించారు. నేతలు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో వీడియో కాల్ లో ఎమ్మెల్యే తో మాట్లాడించారు. అనంతరం ఎమ్మెల్యే మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. రెవెన్యూ, పోలీస్ లు ఆర్టీసీ సిబ్బందిని దగ్గరుండి పర్యవేక్షించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా మరో 11 మంది కర్ణాటకలో ని హోస్కోట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని టిడిపి నాయకులు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న గారు, ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నియోజకవర్గం చెందిన 6 మంది మరణంపై తన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిత్తూరు నుండి బెంగళూరు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు కర్ణాటక రాష్ట్రం హోస్కోట పరిధిలో ప్రమాదానికి గురై 6 మంది మృతిచెందడం పట్ల ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో వెదురుకుప్పం మండలం, ఆళ్లమడుగు చెందిన టీడీపీ నాయకులు కేశవులు రెడ్డి, ఎస్ఆర్ పురం మండలం, పుల్లూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రమేష్ కుమార్తె, బి.టెక్ చదువుతున్న తులసి మృతిచెందిన విషయం తీవ్ర విషాదాన్ని కలిగించిందన్నారు. గాయాలపాలైన వారికి అత్యవసర సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నియోజకవర్గం చెందిన 6 మంది మరణంపై రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో వెదురుకుప్పం మండలం, ఆళ్లమడుగు చెందిన కేశవులు రెడ్డి, ఎస్ఆర్ పురం మండలం, పుల్లూరు గ్రామానికి చెందిన తులసి మృతిచెందిన విషయం తీవ్ర విషాదాన్ని కలిగించింది. గాయాలపాలైన వారికి అత్యవసర సేవలు అందించాలని వైద్యులను కోరారు. మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేసిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు. గాయపడిన వారికి తక్షణ సహాయం కింద 10 లక్షల రూపాయలు అందించాలన్నారు. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎంఓ కు ఫోన్ లో సూచించారు. మృతి చెందిన మృతదేహాలను యుద్ధ ప్రాతిపదికన పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అందించాలని కోరారు. ఫిట్నెస్ ఉన్న బస్సులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా సౌకర్యం కోసం ఉపయోగించాలన్నారు. ఫిట్నెస్ లేని బస్సులును రాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యం కోసం ఉపయోగించడం ద్వారానే తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదం జరగకుండా వాటి నివారణకు చర్యలు చేపట్టాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు.
పో రై గంగ 1 బస్సు ప్రమాదం

