బంధుమిత్రులకే మామిడి సరఫరా టోకన్లు
టోకన్లు కోసం పరుగులు తీస్తున్న రైతులు
సగం కూడా ప్రారంభం కానీ మామిడి గుజ్జు పరిశ్రమలు
పూర్తిస్థాయిలో క్రషింగ్ చేయని పరిశ్రమలు
జిల్లాలో మామిడి గుజ్జ పరిశ్రమల నిర్వాహకం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లాలో ఈ క్రషింగ్ సీజనకు నాలుగున్నర లక్షల మామిడి దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. వీటిని క్రషింగ్ చేయడానికి జిల్లాలో 34 మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం రైతుల నుంచి మామిడిని తీసుకోవడానికి ఈ పరిశ్రమలు ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు సగం ఫ్యాక్టరీలు కూడా ప్రారంభం కాలేదు. ప్రారంభమైన ఫ్యాక్టరీలు కూడా ఖాదర్, పులేరా వంటి కలర్ కాయలను క్రషింగ్ చేస్తున్నాయి. పలు ఫ్యాక్టరీలు ఇంకా తోతాపుర మామిడిని తీసుకోవడం లేదు. ఏదో మొక్కబడిగా కొంతమంది రైతుల నుంచి మామిడిని తీసుకుంటున్నాయి. చాలా ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. సగం సామర్థ్యంతో మాత్రమే ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. దీంతో రైతులు మామిడిని ఫ్యాక్టరీలకు సరఫరా చేయడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముందుగా టోకన్ల నిమిత్తం బారులు తీరుతున్నారు. కొద్దిమందికి ఇచ్చి, టోకెన్లు అయిపోయాయని ఫ్యాక్టరీ యజమానులు చెప్పడంతో అక్కడ గొడవలు జరుగుతున్నాయి. పలు ఫ్యాక్టరీల్లో రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తన సామర్థ్యం ప్రకారం తమ మామిడికాయలను తీసుకుంటున్నామని ఫ్యాక్టరీ యజమాన్యం చెప్పుతోంది. రైతులను నియంత్రించడం మామిడి ఫ్యాక్టరీల వద్ద కష్టమవుతుంది. జిల్లాలో ఇప్పటికే మామిడి పక్వానికి వచ్చి చాలా రోజులు అయింది. మద్దతు ధర వివాదం కారణంగా జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలా వరకు మామిడి నేలపాలు అయింది. ఆలస్యం అయ్యే కొద్ది చాలావరకు పంటను రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో మామిడిని త్వరగా ఫ్యాక్టరీలకు సరిపరా చేయడానికి రైతులు పోటీలు పడుతున్నారు. రైతులు చాలావరకు మామిడి మద్దతు ధర గురించి పట్టించుకోవడం లేదు. చాలా ఫ్యాక్టరీలు 6 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. అయినా మామిడికాయలను సరఫరా చేయడానికి రైతులు ఫ్యాక్టరీల వద్ద బారులు తీరుతున్నారు. మద్దతు ధరతో సంబంధం లేకుండా మామిడికాయలు తీసుకుంటే చాలనే అభిప్రాయం రైతులలో వ్యక్తం అవుతుంది. ఆలస్యం అయ్యే కొద్ది మామిడికాయలు నేలరాలి, రైతులు భారీగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో రైతులు టోకన్ల కోసం తమకు పరిచయం ఉన్న రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు, జ్యూస్ ఫ్యాక్టరీ యజమానుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. జిల్లాలో మామిడి వ్యాపారం ఇంకా ఊపు అందుకోలేదు. ఇతర రాష్ట్రాల నుంచి మామిడి కొనుగోలుకు వ్యాపారస్తులు పూర్తిస్థాయిలో రాలేదు. మామిడి మండీలు చాలావరకు తోతాపురి రకం మామిడిని తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. మామిడి కలర్ కాయలను మాత్రమే తీసుకొని వ్యాపారం చేస్తున్నాయి. జిల్లాలో రాంపులు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. అక్కడక్కడ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో ర్యాంపులు మండీలు ముందుగా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడికి ప్రభుత్వ అధికారులు వచ్చి, రైతుల దగ్గర నుంచి ధ్రువీకరణ పత్రాలను తీసుకొని ప్రభుత్వానికి అందజేస్తారు. ప్రభుత్వం రాయితీ కింద కిలో మామిడికి నాలుగు రూపాయలు విడుదల చేస్తుంది. రెండు రోజుల కిందట గంగాధర నెల్లూరులోని జైన్ ఫ్యాక్టరీ వద్ద రైతులు భారీగా ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం టోకెన్ అవసరం లేకుండా ముందుగా వచ్చిన మామిడికాయలను తీసుకుంటామని తెలిపింది. కొన్ని ఫ్యాక్టరీల యజమానులు గత సంవత్సరం తమకు మామిడికాయలను సరఫరా చేసిన రైతులకు మాత్రమే టోకన్లు జారీ చేస్తున్నారు. కొత్త రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మరి కొంతమంది తమ బంధుమిత్రుల వరకే పరిమితం అవుతున్నారు. ఇలా రైతులకు టోకెన్లు దొరక్కుండా నానా ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క మామిడి పక్వానికి వచ్చి నేల రాలే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రైతులు కోతకు వచ్చిన పంటను ఏం చేయాలో పాలుపోకుండా దిగాలు పడుతున్నారు.
పో రై గంగ 1 జైన్ ఫ్యాక్టరీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు
పో రై గంగ 1 జైన్ ఫ్యాక్టరీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

