20, జూన్ 2025, శుక్రవారం

నేటి నుంచి కలెక్టరేట్ వద్ద మామిడి రైతుల నిరసన

నేటికీ అమలు కాని  ప్రభుత్వం ప్రకటించిన ధర
 ఫ్యాక్టరీలు, రాంపుల వద్ద, ధరల పట్టిక ఊసే లేదు.
 అన్లోడింగ్ కు పైరవీలు, మితిమీరిన రాజకీయ జోక్యం.
టోకన్ల జారిలో పెరుగుతున్న రాజకీయ జోక్యం 
 అచేతనమైన ఉధ్యాన శాఖ.

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం ఆందోళనకు శ్రీకారం పెడుతుంది. శనివారం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సత్యాగ్రహానికి మామిడి రైతులు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ గత రెండు రోజులుగా మామిడి ధర అమలు విషయమై జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జిల్లాలోని అన్ని జ్యూస్ ఫ్యాక్టరీలను పరిశీలించి మద్దతు అమలు విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయినా జిల్లాలో మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు మద్దతు ధరను ఇవ్వటం లేదు. పైగా టోకన్ల కోసం రైతులు ఫ్యాక్టరీల వద్ద పడి కాపులు కాస్తున్నారు. టోకన్ల మంజూరులో రాజకీయ జోక్యం  రోజురోజుకు పెరుగుతోంది. రాజకీయ నాయకులు చెప్పిన వారికి టోకన్ మంజూరు చేస్తున్నారు. దీంతో సామాన్య రైతులకు టోకెన్లు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పక్వానికి వచ్చిన మామిడి మాగి, నేల రాలిపోతుంటే, ఎం చేయాలో రైతులకు తోచడం లేదు.

  మామిడి మద్దతు ధర ప్రకటించడంలో ఆలస్యం కావడంతో చిత్తూరు జిల్లాలో మామిడి క్రషింగ్ సీజన్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అక్వానికి వచ్చిన కాయలను ఫ్యాక్టరీలకు తరపున చేయడానికి మామిడి రైతులు తొందర పడుతున్నారు. అయితే జిల్లాలోని పరిశ్రమలు తమ సామర్థ్యం వరకే మామిడిని తీసుకుంటున్నాయి. జిల్లాలో 25 మామిడి పరిశ్రమలు క్రషింగ్ ను ప్రారంభించినట్లు ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పలు పరిశ్రమలు మామిడి రైతులకు టోకెన్లను జారీ చేస్తున్నాయి. టోకెన్ల ప్రకారం రైతులు మామిడికాయలను ఫ్యాక్టరీలకు తీసుకురావాలని కోరుతున్నారు. అయితే టోకెన్ల విధానంలో పారదర్శకత లోపించిందని మామిడి రైతులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమల యజమానులు అనుసరిస్తున్న విధానానికి నిరసనగా జిల్లాలోని మామిడి ఫ్యాక్టరీల ఎదుట రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పలు ఫ్యాక్టరీలు ఇప్పటికే ఈ నెలాఖరు వరకు టోకెన్లను జారీ చేశాయి. మరికొన్ని పరిశ్రమలు జూలై నెల మొదటి వారానికి కూడా టోకెన్లను జారీ చేశాయి. టోకెన్లు జారీ చేసిన రైతుల నుంచి మాత్రమే మామిడికాయలను తీసుకుంటామని ఫ్యాక్టరీ యజమానులు చెబుతున్నారు. అయితే ఫ్యాక్టరీ యజమానులు టోకెన్లను తమ బంధువులకు, మిత్రులకు అధికంగా జారీచేసినట్లు రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో సామాన్య రైతులకు టోకెన్లు లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టోకన్లు లేకుండా మామిడిని ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళ్లితే అన్లోడ్ చేయడానికి రెండు, మూడు రోజులు సమయం పడుతుంది. దీంతో ట్రాక్టర్లలోని కాయలు మాగి రైతుకు తీవ్ర నష్టం కలుగుతుంది. రైతులకు జారీచేసే టోకెన్లు పారదర్శకంగా ఉండాలని జిల్లాలోని మామిడి రైతులు కోరుతున్నారు. అలాగే ఇప్పటివరకు జారీ చేసిన టోకెన్ల వివరాలు నోటీసు బోర్డులలో ప్రదర్శించాలని కోరుతున్నారు. మామిడి ఫ్యాక్టరీలకు కాయలతో రైతులు భారీగా తరలి రవడంతో పరిశ్రమలు మామిడి మద్దతు ధరను భారీగా తగ్గించాయి. నాలుగు నుంచి ఐదు రూపాయలకు మాత్రమే రైతుల దగ్గర మామిడికాయలను కొంటున్నారు. ఆ ధరకు అయితే తీసుకుంటామని లేకుంటే వద్దని పరిశ్రమ యజమానులు ఖరాకండిగా చెబుతున్నారు. దీంతో చేయునదిలేక మామిడి రైతులు ఏదో ఒక ధరకు మామిడికాయలు తీసుకొంటే చాలని ఉద్దేశంతో మామిడికాయలను ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నారు. మామిడి రైతులు పోటీలు పడి మామిడికాయలు తీసుకురావడంతో పరిశ్రమల యజమానులు చెప్పిందే ధరగా చలామణి అవుతుంది. జిల్లాలోని రాంపులు, మండీలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. చిత్తూరు జిల్లాలో 35 మామిడి గుజ్జు పరిశ్రమంలో ఉండగా ప్రస్తుతం 27 పరిశ్రమలు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన 8 పరిశ్రమలు ప్రారంభమయ్యే సచనలు కనిపించడం లేదు. అలాగే జిల్లాలో 30 వరకు ర్యాంపులు ఉండగా ఇప్పటివరకు 23 మంది మాత్రమే మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నమోదు చేసుకున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి మామిడి రైతులు వ్యాపారస్తులు పూర్తిస్థాయిలో జిల్లాకు రాలేదు. దీంతో ర్యాంపులలో, మండీలలో వ్యాపారం పూర్తిస్థాయిలో జరగడం లేదు. మండీలు తోతాపురం తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో మామిడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.  మామిడి రైతులను ఆదుకోవడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ఏపీ  రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ  మంత్రి చెప్పిన మాటలకు కూడా విలువ లేకుండా పోయిందని దీనికి నిరసనగా కలెక్టరేట్ వద్ద శనివారం తేదీ న సత్యాగ్రహం నిర్వహిస్తున్న ట్లు మామిడి రైతుల సంక్షేమ సంఘం కన్వీనర్  డా. టి. జనార్దన్, ఎస్. ఆనంద నాయుడులు , ఉమాపతి నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన  మామిడి రైతుల సంక్షేమ సంఘం కమిటీ జూమ్ మీటింగ్ నిర్వహించారు . ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులను గుజ్జు యాజమాన్యాలు ,రాంపుల నిర్వాహకులు, ఒకవైపున నరకయాతన చూపిస్తుంటే, జిల్లా యంత్రాంగం సమన్వయం చేసి హేతుబద్ధంగా క్రమబద్ధీకరించి ప్రభుత్వ నిర్ణయం అమలు చేయాల్సి ఉండగా పూర్తిగా చేతులెత్తేయడం దారుణమన్నారు. జిల్లాలో ఇప్పటివరకు  ప్రభుత్వ ఉత్తర్వు మేరకు ఫ్యాక్టరీ యజమానులు గాని, రాంపుల వద్ద గాని, ధరల పట్టిక ప్రదర్శించకపోవడం  దుర్మార్గమన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖాతరుచేయని , ఫ్యాక్టరీల లైసెన్సు కనీసం కనీసం ఇద్దరివి రద్దు చేయమని పదేపదే విజ్ఞప్తి చేసినా అధికారులకు చెవికెక్కక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.  అమరావతిలో  సీఎం జరిపిన సమీక్షా సమావేశంలో సైతం 8 +4 ధర కచ్చితంగా మామిడి కి కల్పిస్తామని స్పష్టంచేసినా జిల్లాలో ఎక్కడా నేటికీ అమలు కాకపోవడంలో  ఔచిత్యమేమిటని వారు ప్రశ్నించారు. చివరకు మామిడి ఫ్యాక్టరీల వద్ద అన్లోడింగ్ సైతం  పూర్తిగా, రాజకీయ జోక్యం , మితిమీరిన పైరవీలతో, సామాన్య  రైతులకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు.  ప్రభుత్వం నకు చిత్తశుద్ధి వుంటే, పల్ఫ్ నిల్వలను సైతం కొనుగోలు చేసి సంక్షేమ పథకాలకు అందజేయాలని, కిలో కు 12 రూపాయలు మామిడికి ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసికోవాలని డిమాండ్ చేశారు. లేనిచో ఉద్యమం ఉధృతం చేయడంతో పాటు న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *