జీడి నెల్లూరు మండల ఎన్నికలకు త్రిసభ్య కమిటీ !
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుల ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. నిర్ణీత సమయానికి ఎన్నికలు నిర్వహించకపోవడం, మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ విషయమై అధిష్టానం దృష్టిని కేంద్రీకరించింది. పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో మండల పార్టీ అధ్యక్షులు ఎన్నిక జరగాలని అధిష్టానం భావిస్తోంది. ఇందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సిఫార్సులను రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ముందు ఉంచింది. ఒకటి రెండు రోజుల్లో త్రి సభ్య కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడనున్నాయి.
గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో టిడిపి మండల కమిటీల ఏర్పాటుకు త్రిసభ్య కమిటీ వేయడానికి అధిష్టానం నిర్ణయించింది. రెండు, మూడు రోజుల్లో సభ్యులను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. నియోజక వర్గంలో మండల కన్వీనర్ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ తొలుత తనకు నచ్చిన వారిని ఎంపిక చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు వర్గం అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేయడంతో ఎన్నికలు ఆగిపోయాయి. మహానాడు అయిన తరువాత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం పరిశీలకుడిగా ఉన్న రవి ప్రకాష్ నాయుడు ఒక్కరే ఎన్నికలు నిర్వహించడం కష్టమని భావిస్తున్నారు. దీనితో పక్క జిల్లాలకు చెందిన ఇంకో ఇద్దరిని పరిశీలకులుగా నియమిస్తున్నారు. 2020లో చిట్టిబాబు నాయుడు సమన్వయకర్తగా ఉన్నారు. అప్పటి పరిశీలకుడు బొమ్మి సురేంద్రతో పాటు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డికి ఎన్నికల నిర్వహణ బాధ్యత పెట్టారు. ఇప్పుడు ముగ్గురు సభ్యులను నియమించాలని నిర్ణయించారు. అయితే ఎమ్మెల్యే థామస్ వర్గంలో ముగ్గురు వ్యక్తులు తమ వర్గం వారిని ఎంపిక చేయాలని చూస్తున్నారు. చిట్టిబాబు నాయుడు మరి కొందరు కలసి కొత్త వారిని ఎన్నుకునేందుకు కార్యకర్తల మద్దతు సమకూర్చుకుంటున్నారు. పాలసముద్రం మండలంలో చిట్టిబాబు నాయుడుకు చెక్ పెట్టడానికి తాళ్లూరి శివ నాయుడు ఎన్నుకోవడానికి ఒక వర్గం పట్టుదలగా ఉంది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు రాజేంద్రను కొనసాగించడం మంచిదని కొందరు భావిస్తున్నారు. మార్చి ఒకటవ తేదీన జి డి నెల్లూరు వచ్చిన చంద్రబాబు నాయుడు ఆయనను ప్రశంసించిన విషయం గుర్తు చేస్తున్నారు. జి డి నెల్లూరు మండలంలో ప్రస్తుత అధ్యక్షుడు సామి దాసు, మాజీ అధ్యక్షుడు దేవ సుందరం, శ్రీధర్ యాదవ్ మధ్య పోటీ నెలకొన్నది. ఎస్ ఆర్ పురం మండలంలో జయశంకర్ నాయుడు కొనసాగాలని భావిస్తున్నారు. అయితే ఆయన మూడు సార్లు పదవిలో ఉన్నందున మార్చాలని కొందరు అంటున్నారు. రాజశేఖర్ నాయుడు, మునివర్ధ నాయుడు, వేమా నాయుడు, పైనేని మురళి పోటీ పడుతున్నారు. కార్వేటినగరంలో ప్రస్తుత అధ్యక్ష చంగల్రాయ యాదవ్ కొనసాగాలని ఆశిస్తున్నప్పటికీ మూడు సార్లు పదవిలో ఉన్నందున మార్చాలని కొందరు కోరుతున్నారు.
రవి యాదవ్, రవికుమార్, వాసుదేవ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వెదురుకుప్పం మండలంలో ప్రస్తుత అధ్యక్షుడు లోకనాథ రెడ్డి కొనసాగాలని కోరుకుంటున్నారు. మునిచంద్రా రెడ్డి, కిషన్ చంద్, మోహన్ మురళీ పోటీ పడుతున్నారు. పెనుమూరులో తిరిగి రుద్రయ్య నాయుడు పదవిలో కొనసాగాలని పట్టుగా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా హరి బాబు నాయుడు, సుబ్రమణ్యం నాయుడు, ప్రకాశ్ నాయుడు, సతీష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, షణ్ముఘ వర్మ, నాగరాజ రంగంలోకి దిగారు. రుద్రయ్య ఇప్పటికీ ఎనిమిది సార్లు పదవిలో ఉన్నారని, ఈ సారి తమలో ఒకరికి ఇవ్వాలని కోరుతున్నారు. కాగా నియోజక వర్గంలోని ఆరు మండలాలలో సామాజిక న్యాయం పాటించాలని అధిష్టానం భావిస్తోంది. మూడు సార్లు లేదా ఆరు సంవత్సరాలు పదవిలో ఉన్న వారిని పక్కన పెట్టాలని నిర్ణయించారు. మూడు మండలాలలో ఎస్సీ, బీసీలకు అవకాశం కల్పిస్తారు. మిగిలిన మూడింటిలో రెండు కమ్మ, ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉంది.

