రోడ్డు మీద మామిడి కాయలు పారబోసి రైతు నిరసన
పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అరగొండ వద్ద ఒక రైతు వినూత్నంగా నిరసన తెలియజేశారు. మంగళవారం తవణంపల్లికి చెందిన ఒక రైతు తన మామిడికాయల కోసం అమ్ముకోవడానికి ర్యాంపుకు తీసుకొని వచ్చారు. మామిడి ధరల విషయం ర్యాంపు యజమానితో మాట్లాడగా తాను కిలోకు రెండున్నర రూపాయలు మాత్రమే చెల్లిస్తానని చెప్పారు. దీంతో ఆ రైతు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర విషయమై ప్రశ్నించాడు. ఆ విషయాన్ని జిల్లా అధికారులను అడగాల్సిందిగా ర్యాంపు యజమాని సమాధానమిచ్చాడు. దీంతో రైతు ఆగ్రహించి మామిడి కాయలను నడిరోడ్డుపై పోసి నిరసన తెలిపారు. దీంతో బంగారుపాలెం- అరగొండ రహదారిలో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లాలనే ఉద్దేశంతోనే తాను మామిడిని రోడ్డుమీద పారబోసినట్లు ఆ రైతు వివరించారు. తనకు కాకున్న ఇతర రైతులకైనా న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాన్ని రైతు వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకిలో 12 రూపాయలు అమలు జరగడం లేదు. మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు కిలోక ఆరు రూపాయలు, ర్యాంపులు కిలోక కిలోకు నాలుగున్నర రూపాయలు చెల్లించాలన్న జిల్లా యంత్రాంగం ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. వివరాలను పరిశీలిస్తే .. రైతుల నుంచి మామిడిని కొన్ని ఫ్యాక్టరీలే కొంటున్నాయి. కొన్ని చిన్న ఫ్యాక్టరీలు మాత్రం టోకెన్లు లేకుండా తీసుకుంటున్నారు. అక్కడ ర్యాంపులు ఏర్పాటు చేశారు. ర్యాంపుల వల్ల కూడా రైతులకు నష్టం కష్టం కలుగుతుంది. కొందరు ఫ్యాక్టరీ యజమానులు వద్ద రైతులు తీసుకొచ్చే మామిడికాయలు నేరుగా కొనడం లేదు. ర్యాంప్ అంటే.. ఓ వ్యక్తికి మామిడికాయలు కొనుగోలు చేసే బాధ్యత అప్పగిస్తారు. అతనికి ఫ్యాక్టరీ వాళ్ళు కిలో నాలుగు రూపాయలు యజమాని చెల్లిస్తే, ఆ వ్యక్తి రెండు రూపాయల కమీషన్ తీసుకోని రైతులకు రెండు నుంచి మూడు రూపాయలు మాత్రమే చెల్లిస్తారు. ఈ విధానం వల్ల కూడా రైతులకు నష్టం తప్పడం లేదు.జిల్లాలోని పరిశ్రమలన్నిటిని తెరిపిస్తే, రైతులకు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం రైతుకు గిట్టుబాటు ధర ప్రకటించినా, కొన్ని పరిశ్రమలు సామర్ధ్యాని కంటే తక్కువగా రన్ చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో కాయలు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు కష్టనష్టాలు తప్పడం లేదు. చిత్తూరు జిల్లాలో మరో 10 రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ప్రధాన కారణం సీజన్ ముగింపునకు రావడమేననిపరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

