11, జూన్ 2025, బుధవారం

జిల్లాలో అమలుకాని రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ధర


ఐదారు రూపాయలకే కొంటున్న మామిడి గుజ్జు పరిశ్రమలు 

తమ ప్రాంగణంలోకి అధికారులు రాకూడదని ఒక గుజ్జు ఫ్యాక్టరీ హెచ్చరిక 

మండల అధికారులకు లీగల్ నోటీస్ జారీ 

ఫ్యాక్టరీలోకి ప్రవేశిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

దిక్కుతోచని స్థితిలో జిల్లా యంత్రాంగం.

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

జిల్లాలోని మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు జరిగే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమలు మామిడి రైతులకు కీలోకు ఎనిమిది రూపాయలు ఇవ్వడానికి సుముఖత చూపడం లేదు. దీంతో జిల్లాలో పలు గుజ్జు పరిశ్రమలు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన కొన్ని పరిశ్రమలు కూడా ఎక్కడా ఎనిమిది రూపాయల మద్దతు ధరలు ఇవ్వడం లేదు. ఐదు రూపాయల నుంచి ఆరు రూపాయల వరకు మాత్రమే రైతులకు చెల్లిస్తున్నారు. దీంతో విధి లేక జిల్లాలోని రైతులు తమ పంటను మామిడి గుజ్జు పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. 

చిత్తూరు జిల్లాలో 50వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లాలో 5.5 లక్షల టన్నుల మామిడి దిగుబడి రానుందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో చిత్తూరు జిల్లా నుంచి 4.8  లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 41 మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, చిత్తూరు జిల్లాలో 35 యూనిట్లు ఉన్నాయి. వీటి ప్రాసెసింగ్ సామర్థ్యం  3.5 మెట్రిక్ టన్నులు. జిల్లాలోని గుజ్జు ఫ్యాక్టరీల్లో మామిడి పల్ప్ పేరుకుపోయిందన్న కారణంతో మామిడి పంటను తీసుకోవడానికి మొదటనుంచి గుజ్జు పరిశ్రమలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమావేశం ఏర్పాటు చేసింది 12 రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించిన, అందుకు గుజ్జు పరిశ్రమలు ముందుకు రాలేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడంతో రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయల మద్దతు ధరలు కొనసాగించాలని నిర్ణయించింది. గుజ్జు ఫ్యాక్టరీలు ఎనిమిది రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయలు మామిడి రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చేశారు. ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని ఫ్యాక్టరీల వద్ద ఏర్పాటు చేసి, రైతులు సరఫరా చేసే మామిడిని నమోదు చేయాలని నిర్ణయించారు. ఇందుకు జిల్లాలోని ఒక   ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీవ్రస్థాయిలో స్పందించింది. తమ అనుమతి లేకుండా తమ ఫ్యాక్టరీ ఆవరణంలోకి ప్రభుత్వ అధికారులు రావడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయమై మండల ఇన్చార్జి అయిన తాసిల్దార్ కు లీగల్ నోటీసులు అందజేసింది. తమ అనుమతి లేకుండా ప్రభుత్వ సిబ్బంది అనధికారికంగా ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలలో ఫ్యాక్టరీ లోపలికి ప్రవేశించడంతో  తమ హక్కులకు ఉల్లంఘన జరుగుతోందని పేర్కొంది. ఇది అక్రమంగా ఫ్యాక్టరీలోక ప్రవేశించడం అవుతుందని,  అనధికార ఉనికి కారణంగా స్థానిక వ్యక్తులు గుంపులుగా చేరి తమ కార్యకలాపాల అడ్డుకునే ప్రమాదం ఉందని ఆందోళనను వ్యక్తం చేసింది. ఇందువల్ల  భద్రత ఉల్లంఘన, దొంగతనము, శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దొంగతనము, ఆస్తికి నష్టము, తమ కార్యకలాపాలకు ఆటంకం జరిగితే సంబంధిత ప్రభుత్వ సిబ్బందిని వ్యక్తిగతంగా, సంస్థాగతంగా బాధ్యులు చేస్తామని కంపెనీ హెచ్చరించింది. వెంటనే ప్రభుత్వ సిబ్బంది తన కంపెనీ ప్రాంగణం నుండి, పార్కింగ్ ప్రాంతాలు, కారిడార్లు, అంతర్గత ప్రాంతాల నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. భవిష్యత్తులో తన అనుమతి లేకుండా ఎవరు తన ఫ్యాక్టరీలోకి రాకూడదని, అలా వస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ రకమైన లీగల్ నోటీస్ ఇవ్వడంతో ప్రభుత్వం మీదనే మామిడి గుజ్జు పరిశ్రమలు తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నాయి. మద్దతు ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఇవ్వడం కుదరదని అంటున్నాయి. ఐదారు రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేమని, ఇష్టమైతే మామిడిని సరఫరా చేయవచ్చు, లేకుంటే అవసరం లేదని భీష్మించుకున కూర్చున్నాయి. జిల్లాలో 35 గుజ్జు ఫ్యాక్టరీలో ఉండగా 10 నుంచి 15 వరకు మాత్రమే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అవి కూడా ఐదారు రూపాయల వంతున మామిడిని తీసుకుంటున్నాయి. కొన్ని పరిశ్రమలు ధర తెలియజేయకుండా మామిడిని తీసుకొని ప్రాసెసింగ్ చేస్తున్నారు. రైతులు విధి లేకుండా మామిడిని ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నారు. గుజ్జు ఫ్యాక్టరీలు రోజుకు 100 వరకు పరిమిట్లను జారీ చేస్తున్నారు. ఈ మేరకు మామిడి రైతులు వాటికి మామిడికాయలను సరఫరా చేయాలి.  జిల్లాలోని దామల చెరువు మామిడి మార్కెట్లో  బుధవారం తోతాపురి రకం ఐదు రూపాయలు కిలో పలుకుతుందని సమాచారం. జిల్లాలో చిత్తూరు, బంగారుపాలెం మార్కెట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఇంకా ర్యాంపులు, పలు ఫ్యాక్టరీలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎనిమిది రూపాయల మద్దతు ధర ఇవ్వడానికి ఇష్టం లేకపోవడంతో పలు ఫ్యాక్టరీలు ఇంకను ప్రారంభం కాలేదు. జిల్లా అధికారులు అన్ని ఫ్యాక్టరీలను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఫ్యాక్టరీలు జిల్లా అధికారులకే లీగల్ నోటీసులు జారీ చేయడంతో ఏం చేయాలో జిల్లా అధికారులకు సైతం పాలు పోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను సైతం ధిక్కరించి రైతులకు నష్టం కలిగిస్తున్న ఫ్యాక్టరీల విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

పో రై గంగ 4 మామిడి

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *