6, జూన్ 2025, శుక్రవారం

మామిడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

రాష్ట్రస్థాయిలో మద్దతు ధర నిర్ణయం 
టన్ను మద్దతు ధరగా 12 వేల రూపాయలు 
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూ. 4000 
మామిడి ఫ్యాక్టరీ ధర రూ. 8000 
రైతులలో ఆనందోత్సాహాలు


చిత్తూరు, బ్యూరో ఆంధ్రప్రభ.

కష్టకాలంలో మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్రస్థాయిలో తోతాపూర్ రకం మామిడికి మద్దతు ధరను ప్రకటించింది. తోతాపురి రకానికి టన్నుకు మద్దతు ధర 12 వేల రూపాయలుగా నిర్ణయించింది. ఇందులో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు 8 వేల రూపాయలను మామిడి రైతులకు అందజేస్తారు. మరో నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించడంతో మామిడి రైతులల్లో  హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు ఉత్సాహంతో మామిడి పంటను కోయడానికి సిద్ధమవుతున్నారు. 

రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా యుద్ధం కారణంగా చిత్తూరు జిల్లా నుంచి గత మూడు సంవత్సరాలుగా మామిడి పల్ప్ ఎగుమతి ఆగిపోయింది. దీంతో ఫ్యాక్టరీలలో మామిడి పల్ప్ నిల్వలు పేరుకుపోతున్నాయి. తొలుత కరోనా పేరుతో మామిడి ఎగుమతులకు బ్రేక్ పడింది. అనంతరం యుద్ధం కారణంగా మరో రెండు సంవత్సరాలు ఆగిపోయాయి. దీంతో మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా గత మూడు సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది రైతులు మామిడిని తీసివేసి ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పర్యాయం చిత్తూరు జిల్లాలో సగం పంట వచ్చింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల టన్నుల మామిడి దిగుబడి రావచ్చని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తోతాపరి మామిడికాయలను తీసుకోవడానికి మొదటి నుంచి మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద ప్రత్యేక దృష్టిని సారించింది. మూడు పర్యాయాలు మామిడి రైతులు, ఫ్యాక్టరీల యజమానులతో సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీనివాసన్ కూడా పాల్గొన్నారు. రైతుల కష్టసుఖాలతో పాటు ఫ్యాక్టరీ యజమానుల లాభనష్టాలను కూడా తెలుసుకున్నారు. దీనికి తోడు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా మామిడి రైతుల మీద దృష్టిని సారించారు. జిల్లా కలెక్టర్ కు జిల్లాలోని శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సహకరించారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విపులంగా వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు మద్దతు ధర మీద కసరత్తును ప్రారంభించింది. ఫ్యాక్టరీ యజమానులతో సమావేశం నిర్ణయించి మద్దతు ధరను నిర్ణయించే ప్రయత్నం జరిగింది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను ఇవ్వడానికి ఫ్యాక్టరీ యజమానులు ముందుకు రాలేదు. ఫ్యాక్టరీలను ప్రారంభించేది లేదని స్పష్టం చేశారు. కిలో మామిడి ఐదు రూపాయల వంతున అయితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ విషయంలో గురువారం మరోసారి మామిడి ఫ్యాక్టరీల యజమానులకు మామిడి రైతులకు జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. ఇరు వర్గాల వాదనలను సావధారణంగా విన్నారు. పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. ఇప్పటికే పరిస్థితి అదుపు తప్పిందని, ఈ విషయము ఆలస్యం జరిగితే జిల్లాలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని వివరించారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగా స్పందించింది. గురువారం రాత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు విలేకరుల సమావేశంలో మామిడి మద్దతు ధరను ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో నిర్ణయించిన ప్రకారం 12 వేల రూపాయల మద్దతు ధర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలు రైతులకు ఎనిమిది వేల రూపాయలు చెల్లిస్తే, ప్రభుత్వం తరఫున మరో నాలుగు వేల రూపాయలను చెల్లిస్తామని వివరించారు. మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి భరోసా ఇచ్చారు. దీంతో రైతులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మామిడి రైతులు, రైతు సంఘం నాయకులు అభినందిస్తున్నారు. మద్దతు ధరను ప్రకటించడానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పార్లమెంటు సభ్యుడు ప్రసాదరావుకు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తొందరగా విధి విధానాలను రూపొందించి మామిడి క్రషింగ్ కు ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతున్నారు.
పో రై గంగ 1 తోతాపురి మామిడి 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *