ఏం బి సి లకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు
తుఫాను కారణంగా 20 ట్రాన్స్‌ఫార్మర్లకు నష్టం
జిల్లాలో స్మార్ట్ మీటర్ల బిగింపు కార్యక్రమం ప్రారంభం
కుప్పం నియోజకవర్గానికి ఆరు సబ్ స్టేషన్ల మంజూరు
పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని వినియోగించుకోవాలి
ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తు కేంద్రం అవినీతిపై విజిలెన్స్ విచారణ
'ఆంధ్రప్రభ బ్యూరో'తో విద్యుత్తు శాఖ ఎస్ఇ ఇస్మాయిల్ అహ్మద్
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
జిల్లాలో అత్యంత వెనుకబడిన కులాల కుటుంబాలకు వంద యూనిట్ల ఉచిత విద్యుత్తును అందజేయనున్నట్లు విదుత్తు శాఖ చిత్తూరు జిల్లా సూపరింటిండెంట్ ఇంజనీర్ (ఎస్ ఇ) షేక్ ఇస్మాయిల్ అహ్మద్ వెల్లడించారు. ఆయన శనివారం చిత్తూరులో "ఆంధ్రప్రభ బ్యూరో"తో మాట్లాడుతూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాన్నారు. ఈ ఆదేశాలను జిల్లాలోని డిఈ లు, ఏఈలకు పంపామని తెలిపారు. అర్హత కలిగిన ఎంబీసీ కులాల వారు విద్యుత్ బిల్లు, ఆధార కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, తెలుపురంగు రేషన్ కార్డుతో సంబంధిత ఏఈకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. దరఖాస్తు అందిన వెంటనే వారికి ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాల జాబితాలోని ఏ గ్రూపులో 32 కులాలను అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించిన వాటిల్లో బాలసంతు, బహురూపి, బండార, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెడ్లవారు, జంగం, జోగి, కాటిపాపల, కోర్చ, మొండివారు, బండ, మొండిబండ, పిచ్చిగుంట్ల, వంశీరాజ్, పాముల, పార్థి (నీర్షికారి), పంబల, దమ్మలి, దమ్మల, దమ్ముల, దమల, పెద్దమ్మవాండ్ల, దేవరవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముత్యాలమ్మవాండ్లు, వీరముష్టి, నెత్తికోతల, వీరబద్రియ, గుడాల, కుజరభట్ట, కోష్మారే, రెడ్డిక, మొండిపట్ట, నొక్కార్, పరికిముగ్గుల, యాత, చోపెమరి, కైకాడి, జోషినందివలాస్, మందుల, కోనపులి, పట్ర, రాజన్నల, రాజన్నలు, కాసికాపడి, కాసికాపుడి కులాలు ఉన్నాయని వివరించారు. వారికి 100 యూనిట్ల వరకు ఉచిత యూనిట్ విద్యుత్తును సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. 100 యూనిట్లు దాటితే, వందకు పైన వినియోగించిన యూనిట్లకు మాత్రమే వినియోగదారులు విద్యుత్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుందన్నారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ యూనిట్లకు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. చిత్తూరులో జిల్లాలో తుఫాను కారణంగా 15 ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల్ అయ్యాయని, 5 ట్రాన్స్‌ఫార్మర్లు కింద పడ్డాయని తెలిపారు. 40 చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. తుఫాన్ కారణంగా విద్యుత్ శాఖకు 15 లక్షల రూపాయల నష్టం జరిగిందని, ఫెయిల్ అయిన, కిందపడిన ట్రాన్స్‌ఫార్మర్లను మార్చి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం జరిగిందన్నారు. నగిరి, కార్వేటినగరం మండలాల్లో ఎక్కువ నష్టం కలిగిందని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో కొత్తగా ఆరు సబ్ స్టేషన్ లు మంజూరయ్యాయని, ఒక్కొక్క సబ్ స్టేషన్ ను 3.5 కోట్ల రూపాయలతో నిర్మిస్తామన్నారు. లో వోల్టేజీ నివారణకు ఈ సబ్ స్టేషన్ లను మంజూరు చేసినట్లు వివరించారు. ఇందుకు స్థలాల అన్వేషణ జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్ల బిగింపు కార్యక్రమం చురుగ్గా జరుగుతుందన్నారు. ఇప్పటివరకు పదివేల స్మార్ట్ మీటర్లను బిగించామన్నారు. సెల్ ఫోన్లు రిచార్జి చేసుకున్న విధంగా స్మార్ట్ మీటర్ కలిగిన వినియోగదారులు ముందుగానే డబ్బులు చెల్లించి విద్యుత్తును కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన విద్యుత్తు బ్యాలన్స్ అయిపోగానే హెచ్చరిక వస్తుందని, తదుపరి రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. విద్యుత్తు బ్యాలెన్స్ అయిపోయిన అర్ధరాత్రి వంటి సమయాలలో విద్యుత్ సరఫరా ఆగడం జరగదన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద జిల్లాలో 1,800 దరఖాస్తుల అందాయని, అందులో 120 మందికి సూర్యగర్ యోజన కింద సూర్య విద్యుత్ పలకలను అమర్చడం జరిగిందన్నారు. ఇందుకు 100 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుందని, బ్యాంకు రుణం, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ పథకం కింద సూర్య విద్యుత్ పలకలను అమర్చుకుంటే విద్యుత్ బిల్లుల ఆదా ఆవుతుందని వివరించారు. ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో ఐదు ఎకరాల స్థలంలో సూర్యఘార్ పథకం కింద విద్యుత్ పలకలను అమర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు స్థలాల పరిశీలన జరుగుతుందన్నారు. ఇందువల్ల రైతులకు లో వోల్టేజి సమస్య ఉండదని, విద్యుత్ బిల్లులు కూడా తగ్గుతుందన్నారు. చిత్తూరులోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తు కేంద్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకల మీద ట్రాన్స్కో విభాగానికి చెందిన విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. చిత్తూరు పట్టణంలో మరో మూడు నెలల్లో పూర్తిస్థాయి సూపరిండెంట్ కార్యాలయం పనిచేయడం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు సిబ్బందిని, అధికారులను నియమించారని, ఒక్కొక్కరుగా విధుల్లోకి చేరుతున్నారని ఇస్మాయిల్ తెలిపారు. త్వరలోనే పూర్తి సేవలు విద్యుత్ వినియోగదారులకు చిత్తూరు కేంద్రంగా అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
పో రై గంగ 1 విద్యుత్తు శాఖ ఎస్ఇ ఇస్మాయిల్ అహ్మద్