ఈకేవైసీ చేసుకున్న రైతులకే అన్నదాత సుఖీభవ
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రకటించిన 20 వేల రూపాయల కోసం జిల్లాలోని రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఈ కేవైసీ చేసుకొని రైతులకు ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ నిధులు కానీ జమ కావు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 19 విడతల్లో రూ.2 వేల చొప్పున కోట్లాది మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, 20వ విడత పీఎం-కిసాన్ నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు 20వ విడత పీఎం-కిసాన్ నిధుల విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే జూన్ 20వ తేదీన రైతుల ఖాతాల్లోకి 20వ విడత పీఎం-కిసాన్ నిధులు జమ అవుతాయని సమాచారం.
అన్నదాత సుఖీభవ పథకం అమల నిమిత్తం రైతులకు ఈ కెవైసీ చేయడానికి నిమిత్తం వ్యవసాయ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. జిల్లాలోని రైతులందరికీ ఈ కేవైసీ నిర్వహించారు. అలాగే రాజ్యాంగ పదవిని కలిగి ఉన్న లేదా కలిగి ఉన్న వ్యక్తులకు ఈ పథకం వర్తించదు. ఏదైనా ప్రభుత్వ మంత్రిత్వ శాఖ, విభాగం లేదా కార్యాలయం, దాని ఫీల్డ్ యూనిట్‌లో ఉద్యోగులు, లేదా అధికారులుగా కొనసాగుతున్న లేదా సేవలందిస్తున్న వ్యక్తులకు, ఏదైనా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వం కింద ఉన్న స్వయంప్రతిపత్తి సంస్థలలో అధికారిగా లేదా ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తులకు ఈ పథకం కింద నిధులు అందవు. స్థానిక ప్రభుత్వ సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత మరియు మాజీ మంత్రులు, లోక్‌సభ రాజ్యసభ ప్రస్తుత మరియు మాజీ సభ్యులు, రాష్ట్ర శాసనసభ మరియు రాష్ట్ర శాసన మండలిల ప్రస్తుత, మాజీ సభ్యులకు ఈ పథకం వర్తించదు. జిల్లా పంచాయతీ ప్రస్తుత లేదా మాజీ చైర్‌పర్సన్ లకు, ఏదైనా మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత, మాజీ మేయర్ లకు, మునుపటి అసెస్‌మెంట్ ఇయర్ లో ఆదాయపు పన్ను దాఖలు చేసిన ఏ వ్యక్తి అయినా లేదా అతని, ఆమె కుటుంబం అయినా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను పొందేందుకు అర్హులు కారు . పదవీ విరమణ చేసిన లేదా పదవీ విరమణ చేసిన వ్యక్తి ప్రతి నెలా రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న అతని,ఆమె కుటుంబం ఈ పథకం నుండి మినహాయించబడ్డారు. డాక్టర్, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, న్యాయవాదులు, ఆర్కిటెక్ట్‌లు వంటి నిపుణులు తమ తమ రంగాలలో వృత్తిపరంగా పాలుపంచుకున్న కుటుంబాలు కూడా ఈ పథకానికి అనర్హులు. జిల్లా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం చిత్తూరు జిల్లాలో 2,08,272 మంది రైతులు ఉన్నారు ఇందులో 2,01,439 మంది ఈ కె వైసీ చేయించుకున్నారు. మిగిలిన 6,158 మంది ఈకేవైసీ చేపించుకోలేదు. జిల్లాలో ఈ కేవైసీ చేయించుకొని రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు జమ కావు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ యోజన పథకం కింద ఈనెల 20వ తేదీన రెండు వేల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం అందజేయు ఆర్థిక సహాయంతో పాటు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక సహాయం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న రైతు భరోసా కార్యక్రమం పేరును మార్పు చేసి అన్నదాత సుఖీభవ పేరుతో కొత్త పథకం తీసుకుని వచ్చింది. ఈ పథకం కింద మార్పులు చేర్పులో చేయడానికి కొంత సమయం పట్టింది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో రైతులకు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులను అందలేదు. ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం 'సూపర్ సిక్స్' కార్యక్రమం కింద రైతులకు 'అన్నదాత సుఖభీభవ పథకం కింద ఏడాదికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిషాన్ యోజన కింద 6 వేల రూపాయలను మూడు విడుతలుగా అందచేస్తుంది. దానితో కలిపి రాష్త్ర ప్రభుత్వం మరో 14 వేల రూపాయలను కలిపి 20 వేల రూపాయలుగా రైతులకు జమ చేస్తుంది. ఈ పథకం అమలుకు రూ.4,500 కోట్ల రూపాయలను రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లో ప్రతిపాదించారు. రాష్ట్రంలోని భూమిలేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి రూ.20 వేల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించారు. ఈ అన్నదాతీ సుఖీభవ పథకం విధివిధానాలు, మార్గదర్శకాలపై ప్రభుత్వ ఆదేశాలు త్వరలో జారీ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు చెప్పారు. రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి హామీ ఇచ్చింది. అంతకుముందు టిడిపి ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. వైసిపి సర్కారు ‘వైఎస్‌ఆర్ రైతు భరోసా’ పేరిట స్కీంను అమలు చేయగా కూటమి ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ అని పేరు పెట్టింది. కాగా ఇప్పటి వరకు దీనిపై విధి విధానాలు ఖరారు చేయలేదు. వైసిపి రైతు భరోసా వలే కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం కిసాన్‌తో కలిపి అమలు చేస్తారా, విడిగానా అనే మీమాంశ నెలకొంది. విధి విధానాలు నిర్ణయిస్తేకాని స్పష్టత రాదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న తరుణంలో ‘అన్నదాత’ సాయంపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కేంద్ర పథకం పిఎం కిసాన్ కింద కిస్తుకు రూ.2 వేల వంతున ఈ సంవత్సరం రెండు కిస్తులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేశారు. జూన్ 18న ఒక పర్యాయం , అక్టోబర్ 5న రెండో విడత జమ చేశారు. గత వైసిపి సర్కారు పిఎం కిసాన్‌తో కలిపి భరోసా రూ.13,500 మూడు విడతల్లో అమలు చేసింది. ఆ సొమ్ములో కేంద్రానిది ఆరు వేలు కాగా, రాష్ట్రానిది 7,500. కౌలు రైతులకు కేంద్రం ‘పిఎం కిసాన్’ ఇవ్వలేదు. సొంత భూమి కలిగిన వారిలో కూడా పలు నిబంధనలతో ఏటా కోతలు విధించింది. దాంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం భూమి ఉన్న రైతుతోపాటు కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడం హర్షదాయకం. భూమి ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి 20 వేలను అందజేస్తుంది. కౌలు రైతులకు మాత్రం నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే 20 వేల రూపాయలను అందజేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ పథకాన్ని జూన్ 20వ తేదీన అమలు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో రైతులు ఆశగా అన్నదాత సుఖీభవ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.

