జిల్లా రైతులకు విరివిగా రుణాలు
అవినీతి రహితంగా బ్యాంకు అభివృద్ధి
డి సి సి బ్యాంకు చైర్మన్ గా భాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డి
నూతన చైర్మన్ కు అభినందనల వెల్లువ
చిత్తూరు, జూన్ 4 (ఆంధ్రప్రభ బ్యూరో) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో జిల్లాలోని రైతులకు విరివిగా రుణాలను అందచేస్తానని డిసిసిబి చైర్మన్ గా నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. అవినీతి రహితంగా బ్యాంకును లాభాల బాటలో నడిస్తానని హామీ ఇచ్చారు. డిసిసిబి చైర్మన్ గా నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డి బుధవారం ఉదయం బ్యాంకు కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన డిసిసిబి ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ క్రమంలో కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన శ్రేయోభిలాషులు అమాసకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాలోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్యాంకును అభివృద్ధి బాటలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులతో పాటు, బడుగు, బలహీన వర్గాలకు అమలు చేసి జిల్లా సహకార కేంద్ర బ్యాంకుతో పాటు, దాని అనుబంధ శాఖలను అభివృద్ధి బాటలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గత పాలకమండలి తనపై అవినీతి ఆరోపణలు చేశారని, అనవసరంగా విజిలెన్స్ తనిఖీలను చేపట్టారని ఆరోపించారు. అయితే తాను ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడకపోవడంతో తన మంచితనాన్ని అనుభవాన్ని గుర్తించి రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తనను తిరిగి మళ్లీ డిసిసిబి చైర్మన్ గా నియమించిందన్నారు. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కూటమి నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు గత వైకాపా ప్రభుత్వ పాలనలో డిసిసిబి పాలకమండలి చేసిన అవినీతి, అక్రమాలను వెలికి తోడనని, పార్టీలకతీతంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానన్నారు. అదే క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బ్యాంకు సేవలను విస్తృతం చేస్తామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు, నగరి, చంద్రగిరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, గాలి భానుప్రకాష్ నాయుడు, పులివర్తి నాని, డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( చుడ ) చైర్ పర్సన్ కటారి హేమలత, భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, చిత్తూరు జిల్లా టిడిపి అధ్యక్షులు సిఆర్ రాజన్, టిడిపి యువ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్, డిసిసిబి సీఈఓ శంకర్ బాబు, జీఎంలు మనోహర్ గౌడ్, లిల్లీ క్యాథరిన్, డీసిసిబి లీగల్ ఆఫీసర్ వై గంగిరెడ్డి, డిఆర్ వనజ, డిసిఓ నాగవర్ధిని, డిసిఏఓ బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గంగ 2 బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్న అమాస రాజశేఖర్ రెడ్డి
గంగ 3 ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
గంగ 4 ,5 రాజశేఖర్ రెడ్డి క అభినందనలు

