త్వరలో ఆడబిడ్డ నిధి పధకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు
18 నుండి 59 ఏళ్ల వయస్సు మహిళలకు రూ. 1,500
బడ్జెట్ లో ఈ పథకానికి రూ.3,300 కోట్లు కేటాయింపు
ఖరారు అవుతున్న పధకం విధివిధానాలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్న నేపధ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పథకాలు ఏడాది ఆలస్యమైంది. ఇకపై ఆలస్యం చేస్తే విపక్షాల నుంచి కాకుండా ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తాయని గ్రహించి వాటిపై స్పషెల్ ఫోకస్ పెట్టింది. అర్హులు మిస్ అవ్వకుండా అనర్హులకు పథకాలు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లుల ఖతాల్లో నగదు జమ చేసింది. ఇదే నెలలో రైతుల ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనుంది. ఆగస్టులో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం స్టార్ట్ చేయనుంది.
కూటమి సర్కారు వచ్చి ఏడాది అవుతోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు మొదటి నెలల నుంచే పింఛన్లు పెంచింది. అంతేకాకుండా ఏకంగా బకాయిలను కూడా ఇచ్చింది. తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అన్న క్యాంటీన్లు భారీగా ఏర్పాటు చేసింది. తల్లికి వందనం ప్రారంభించింది. ఇప్పుడు మహిళలకు ఇచ్చిన మరో పథకం అమలుపై ఫోకస్ చేసింది. అర్హులైన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తామంటూ ఎన్నికల్లో మాట ఇచ్చారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రూ.3,300 కోట్లు ఈ పథకం కోసం కేటాయిస్తున్నట్టు బడ్జెట్ స్పీచ్‌లో ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇప్పుడు ఆ పథకం అమలుపై ఫోకస్ చేశారు. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 నుండి 59 సంవత్సరాల వయస్సు గల మహిళలకు రూ. 1,500 నెలవారీ చెల్లింపు , ఇది వారి ముఖ్యమైన అవసరాలను నిర్వహించడానికి, వారి ఆర్థిక సమస్యలను తగ్గించడంలో వారికి సహాయపడుతుంది. ఈ పథకం క్రమంగా ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా మహిళలకు సాధికారతను అందిస్తుంది. అర్హుల గుర్తింపు నుంచి వారి రిజిస్ట్రేషన్ వరకు అన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందిస్తున్నారు. ఇందులో నేరుగా అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. పథకం అమలు అయిన తర్వాత వచ్చే ఫిర్యాదులు, ఎదుర్కొనే సమస్యలు ఇతర ఇబ్బందులను పరిష్కారం కోసం ఈ వెబ్‌సైట్ ఉపయోగపడనుంది. ఈ పథకానికి ఎవరు అర్హులో కూడా ఇందులో తెలిసిపోనుంది. అర్హులు ఇందులో నేరుగా అప్లై చేసుకోవచ్చు. లేదా మీసేవ కేంద్రాల్లో, సచివాలయంలో కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ప్రతి మహిళ యొక్క వయసు 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబం వార్షిక ఆదాయం నిర్దిష్ట పరిమితిలో ఉండాలి. ఏడాదికి 18000 రూపాయల లోపు ఆదాయం ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు అర్హులు. ఇందు నిమిత్తం లబ్ధిదారుని ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, వయోపరిమితి గురించి తెలిపే సర్టిఫికెట్ ( పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదా టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో ), లబ్ధిదారుని బ్యాంకు ఖాతా వివరాలు, నివాస ధ్రువీకరణ పత్రంజత చేయాల్చిఉంటుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులైన మహిళలు అన్ని వివరాలను సిద్దం చేసుకోవాల్చి ఉంటుంది. ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రస్తుతం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నందున, మరి కొద్ది రోజుల్లో ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పథకం ప్రారంభించిన తర్వాత అభ్యర్థులు దగ్గర్లోని గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే పథకానికి అర్హులైన వారు తమ బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్‌కార్డు వివరాలు, రేషన్ కార్డు వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. పథకాల లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్టివ్‌గా ఉంచుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా చాలా మంది ఖాతాల్లో వేసిన డబ్బులు తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకి చేరాయి. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు యాక్టివ్‌గా లేనందున ఈ సమస్య ఏర్పడింది. అందుకే అర్హులైన వారంతా తమ ఖాతాలకు ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆడబిడ్డ నిధి కోసం ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ప్రభుత్వ పించన్ తీసుకుంటున్న వారు ఇందుకు అనర్హులు.

