ఎమ్మెల్యేల పనితీరుపై ఐ వి ఆర్ ఎస్ ఆరా !
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
కూటమి పార్టీల ఎమ్మెల్యేల పనితీరుపై అధిష్టానం ఆరా తీస్తున్నారు. గత వారం రోజులుగా మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని భావిస్తున్నారు అంటూ కార్యకర్తలు, ప్రజలకు ఐవిఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. వారి పనితీరు చాలా బాగుందా, బాగుందా, పరవలేదా, బాగా లేదా అన్న ఆప్షన్స్ ఇచ్చి నంబర్ నొక్క మంటున్నారు. గురువారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అయిన సందర్భంగా సి ఎం చంద్రబాబు నాయుడు సలహా మేరకు ఈ సర్వేలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు, కార్యకర్తలు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. ఈ సర్వే పూర్తి అయిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.
2024 జూన్ 12 న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గూర్చి ప్రచారం చేయాలని సూచించారు. గత ఎన్నికల్లో గెలిచిన వారు ఎవరూ వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలి పోవద్దని హితవు చెప్పారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున ఆరుగురు శాసనసభ్యులు ఎన్నికయ్యారు. ఇందులో తొమ్మిదవ పర్యాయం కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందగా, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఐదవ పర్యాయం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు, పూతలపట్టి ఎమ్మెల్యే మురళి మోహన్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్, నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కొందరు ఎమ్మెల్యేలు తమ పదవులను అడ్డుపెట్టుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొందరు గత ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడానికి అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ విషయాల మీద అధిష్టానానికి ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. జిల్లాలో కొందరు శాసనసభ్యులు ఎర్రచందనం, ఇసుక, గ్రానైట్, మట్టి అక్రమ రవాణాలో తలమునకలైనట్లు విమర్శలు ఉన్నాయి. కొన్నిచోట్ల గంజాయి, లాటరీ టికెట్ల వ్యవహారం జోరుగా నడుస్తుంది. వీటిల్లో కూడా శాసనసభ్యులకు వాటా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకరిద్దరి ఎమ్మెల్యేలు విభాగాల వారిగా అధికారులతో సమావేశాలను నిర్వహించి, నెలసరి లక్ష్యాలను నిర్దేశించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజల బాగోగుల కంటే వ్యక్తిగత బాగోగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు పెత్తనం ఎక్కువ అవుతుందని ఆరోపణలు ఉన్నాయి. గతంలో వైసిపి ప్రభుత్వం లో ఉండి చక్రం తిప్పిన ఆ నాయకులు మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరి మళ్లీ చక్రం తిప్పుతున్నారని, దీర్ఘకాలికంగా పార్టీలో ఉన్న కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులకు కార్యకర్తలకు ఇస్తున్న గౌరవం తమకు దక్కడం లేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. దీంతో అధిష్టాన వర్గం అనుమతి లేనిదే ఇతర పార్టీల వారిని టీడీపీలో చేర్చుకోకూడదని చెప్పారు. ఈ నేపధ్యంలో జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై పలువురు కార్యకర్తలు చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారు. ఈ విషయాల మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఐ వి ఆర్ స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. ఐవిఆర్ఎస్ సర్వేలో కొందరి పనితీరు బాగా లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఇలాంటి విమర్శలు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎమ్మెల్యేపై ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. వైసిపి నుంచి వచ్చిన ముగ్గురు నాయకులు ఆయనను అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన వద్ద ఉన్న పిఎ కూడా వైసిపికి అనుకూలంగా ఉన్నారని కొందరు అంటున్నారు. ఇటీవల మండల అధ్యక్ష పదవులను ఏక పక్షంగా నిర్ణయించడానికి ప్రయత్నించారని పలువురు అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేసారు. దీనితో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అలాగే మిగిలిన కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకత వ్యక్తం అవుతోందని తెలిసింది.

