28, జూన్ 2025, శనివారం

పాలసముద్రం మండలంలో మారుతున్న టిడిపి రాజకీయ సమీకరణాలు

ఎమ్మెల్యేకు దూరమైన భీమినేని చిట్టిబాబు నాయుడు. 

చేతులు కలిపిన చిట్టిబాబు నాయుడు, రాజేంద్ర 

మండలంలో తిరుగుతూ గ్రామ కమిటీల ఏర్పాటు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

గంగాధరనెల్లూరు నియోజక వర్గంలో టిడిపి రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు జరిగిన ఏడాదికే ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కు పలువురు  నేతలు దూరం అవుతున్నారు. ఆయనకు పార్టీ టికెట్టు రావడంలో కీలక పాత్ర పోషించిన పాలసముద్రం మండలానికి చెందిన రాష్ట్ర కార్య నిర్వాహక భీమినేని చిట్టిబాబు నాయుడు, పాలసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు రాజేంద్రన్, పార్లమెంటు ఎస్సీ విభాగం నాయకుడు గుండయ్య, బీగాల రమేష్ తదితరులు నేతలు వ్యతిరేక వర్గంగా తయారు అయ్యారు. పాలసముద్రం మండలంలో ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా గ్రామ కమిటీల ఏర్పాటు కు చిట్టిబాబు రాజేంద్రన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికి 12 గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు మిగిలిన కమిటీలను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పాలసముద్రం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రన్ ను తొలగించి ఆస్థానంలో శివా నాయుడును నియమించాలని ఎమ్మెల్యే వర్గం ప్రయత్నాలు చేస్తుంది. దానిని ఎదుర్కొని మాజీ ఎంపీపీ మాజీ జడ్పిటిసి ప్రస్తుత మండల పార్టీ అధ్యక్షుడు రాజేంద్రన్ ను తిరిగి కొనసాగించడానికి మరో వర్గం గట్టి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మండలం మొత్తం తిరిగి మద్దతును కూడగట్టుతూ వారికి అనుకూలంగా ఉన్నవారిని గ్రామ కమిటీ అధ్యక్షులుగా నియమిస్తున్నారు.


ఎన్నికల సమయంలో అండగా ఉన్న ఎమ్మెల్యే తమ్ముడు నిధి కూడా ఆయనకు దూరంగా ఉన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తటస్థంగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు ప్రస్తుత ఎమ్మెల్యే థామస్ కు అన్ని విధాల సహకరించారు. ఆయనకు అండదండగా ఉంటూ నియోజకవర్గంలో పార్టీ నాయకులను పరిచయం చేసి ప్రచార కార్యక్రమాలలో ముందుండి నడిపించారు. ప్రస్తుతం చిట్టి బాబు ఎమ్మెల్యేకు దూరమయ్యారు. తొలినుంచి పాలసముద్రం మండల రాజకీయాలలో చిట్టిబాబుకు రాజేంద్ర కు పొసగడం లేదు. ఇరువురు ప్రత్యర్థులుగా రాజకీయాలను నడిపారు. తొలినుంచి రాజేంద్ర ఎమ్మెల్యే థామస్ కు దూరంగా ఉంటూ వచ్చారు. చిట్టిబాబు ఎమ్మెల్యేకు దూరం కావడం, రాజేంద్రను పట్టించుకోకపోవడంతో గత రెండు మూడు రోజులుగా చిట్టిబాబు రాజేంద్ర పాత వైరాన్ని పక్కనపెట్టి, ఒకటిగా కలిసిపోయారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మండలంలో, నియోజకవర్గంలో మద్దతును కూడగడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆరు మండలలో వర్గపోరు ఊపందుకున్నది. దీనితో మండల, గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేయలేక పోతున్నారు. రెండు సార్లు పరిశీలకులను మార్చినప్పటికీ కనీసం సమావేశాలు కూడా నిర్వహించలేక పోతున్నారు. దీనితో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో చేతులు కలుపుతున్నారు. పాలసముద్రం మండల కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా మండల ఎన్నికల అధికారి కోదండ యాదవ్ ను ఆహ్వానించి గ్రామ, బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. దీని కోసం గురు, శుక్ర వారాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. సమావేశంలో భీమినేని చిట్టిబాబు నాయుడు, శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు సలహా ఇచ్చినప్పటికీ థామస్, రాజేంద్రను పట్టించుకోలేదు. గత మార్చి ఒకటవ తేదీ జి డి నెల్లూరు వచ్చిన చంద్రబాబు రాజేంద్ర పనితీరును ప్రశంసించారు. ఒక సారి ఆయనతో కలిసి చర్చించి, తన వద్దకు తీసుకుని రమ్మని చంద్రబాబు ఎమ్మెల్యేకి సూచించారు. అయితే థామస్ ఇప్పటి వరకు రాజేంద్రను పట్టించుకోలేదు. పైగా ఈ సారి ఆయనను తొలగించి తాళ్లూరి శివా నాయుడును మండల కమిటీ అధ్యక్షుడిని చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. దీనితో రాజేంద్ర ఎమ్మెల్యేని కాదని స్వతంత్రంగా కమిటీల ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన ఐదు మండలాలలో వర్గ పోరు ఎక్కువగా ఉన్నందున కనీసం సమావేశాలు కూడా ఏర్పాటు చేయలేక పోతున్నారు. కాగా శనివారం జి డి నెల్లూరులో జరిగిన థామస్ జన్మదిన వేడుకల్లో కూడా వర్గ పోరు స్పష్టంగా కనిపించింది. ఆయన భారీ ఎత్తున వేడుకలు తలపెట్టినప్పటికీ  నియోజక వర్గానికి చెందిన చిట్టిబాబు నాయుడు, గుండయ్య, రాజేంద్ర వర్గీయులు గైర్హాజరు అయ్యారు. రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్, నియోజక వర్గం పరిశీలకుడు బొమ్మి సురేంద్ర యాదవ్, ఎన్నికల అధికారులు జె రమణా రెడ్డి, రెడ్డివారి గురువా రెడ్డి వేడుకల్లో పాల్గొన లేదు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలలో జగన్ మోహన్ నాయుడు, మురళీ మోహన్ మినహా మిగిలిన వారు రాలేదు. లోక సభ సభ్యుడు దగ్గుమల్ల ప్రసాదరావు గైహాజర్ అయ్యారు. గత వారం రోజులుగా నియోజక వర్గంలో జరుగుతున్న కొన్ని సంఘటనల వల్ల బయటి నాయకులు ఎవరూ రాలేదని తెలిసింది. కాగా ఎన్నికల అనంతరం వైసిపి నుంచి వచ్చి పార్టీలో చేరిన శరవణ, హరీష్ యాదవ్, గుణశేఖర్ యాదవ్ పి ఎ చంద్రశేఖర్ దగ్గర ఉండి వేడుకలను నిర్వహించడం నియోజకవర్గం టిడిపి నాయకుల్లో చర్చిని అంశంగా మారింది. వీరు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నుంచి టిడిపిలో చేరిన వారికే ఎమ్మెల్యే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో దీర్ఘకాలికంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు క్రమంగా ఎమ్మెల్యేకి దూరమవుతున్నారు.

పో రై గంగ 1 గ్రామ కమిటీల ఏర్పాటు సందర్భంగా కలిసి పనిచేస్తున్న చిట్టిబాబు, రాజేంద్ర.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *