5, జూన్ 2025, గురువారం

జిల్లాలో అమలు కానీ మామిడి మద్దతు ధర

టన్ను రూ. 5 వేలకు కొనుగోలు చేస్తున్న ఫాక్టరీలు 
ప్రారంభం కాని మామిడి ఫ్యాక్టరీలు 
కోయడానికి సిద్దంగా ఉన్న మామిడి పంట
అందోళన చెందుతున్న రైతులు  


చ్బిట్టురు బ్యూరో, ఆంధ్రప్రభ.


తోతాపురి మామిడి టన్నుకు 12 వేల రూపాయలు జిల్లా కలెక్టర్ నిర్ణయించిన మద్దతు ధర జిల్లాలో అమలు జరిగే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ఈ ధరకు మామిడిని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీనితో జిల్లాలో మామిడి సీజన్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇతర జిల్లాలో నుంచి ఐదు రూపాయలకే కిలో మామిడిని జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు తెప్పించుకుంటున్నాయి. దీని మీద గురువారం మామిడి రైతులు ఆందోళనకు దిగారు. దీనికి తోడు గంగాధర నెల్లూరు సమీపంలోని జైన్ ఫ్యాక్టరీ కూడా 5000 రూపాయలు వంతున తాము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఒకవైపు మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ప్రారంభం కాకపోవడం, మరోవైపు 5వేల రూపాయలకే టన్ను మామిడిని తీసుకోవడంతో జిల్లాలోని మామిడి రైతాంగం అందోళన వ్యక్తం చేస్తున్నారు 

చిత్తూరు జిల్లాలో విస్తారంగా మామిడి పంట సాగయ్యింది. జిల్లాలో సుమారు లక్ష 50 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. మామిడి రైతులకు గత మూడు సంవత్సరాలుగా చేదు అనుభవం ఎదురవుతుంది. మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఏం చేయాలో రైతులకు పాలు పోవడం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలో మామిడి రైతులకు కష్టకాలం ప్రారంభమైంది. సాధారణంగా అన్ని దేశాలకు భారతదేశం అతిపెద్ద మార్కెట్టు. ఇతర దేశాలు తన ఉత్పత్తులను  భారతదేశానికి తీసుకుని వచ్చి అమ్ముకుంటారు. అయితే అందుకు భిన్నంగా మామిడి పల్ప్ మాత్రం మన దేశంలో వినియోగం కావడం లేదు. మామిడి పల్ప్  గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. వారు కొంటేనే ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండడంతో గత మూడు సంవత్సరాలగా మామిడి పల్ప్  ఎగుమతులు దాదాపుగా ఆగిపోయాయి. దీంతో జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలలో పల్ప్ నిల్వలు  పేరుకుపోతున్నాయి. ఫలితంగా జిల్లాలో మామిడిని కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీ యజమానులు ముందుకు రావడం లేదు. జిల్లాలో సుమారుగా 37 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ సంవత్సరం నాలుగు లక్షల టన్నుల తోతాపురి మామిడి దిగుబడి అవుతుందని అంచనా. ఈ విషయమై మద్దతు ధర ప్రకటించడానికి జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. రెండు మూడు సార్లు రైతులు, మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలో యజమానులతో సమావేశం నిర్వహించారు. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో మామిడి తోతాపురి రకానికి టన్నుకు 12 వేలుగా నిర్ణయించారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్ పాల్గొని ధర నిర్ణయానికి సహకరించారు. అయితే మామిడి పల్ప్ కు డిమాండ్ లేకపోవడంతో  రైతులకు ఆ ధరను చెల్లించలేమని జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు చేతులెత్తేశారు. సమావేశం ముగిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ని కలిసి 12 వేల రూపాయల మద్దతు ధరను చెల్లించలేదని స్పష్టం చేశారు. తమ కష్టసుఖాలను పరిగణలోకి తీసుకోకుండా మద్దతు ధరను నిర్ణయించడ సమంజసం కాదన్నారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు జిల్లాలో మామిడి ఫ్యాక్టరీలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన రెండు మూడు ఫ్యాక్టరీలు కూడా ఖాదర్, పులేరా రకాలను తీసుకుంటున్నాయి. ఖాదర్ రకం కిలో 20 రూపాయలు, పులేరా పది రూపాయలు పలుకుతుంది. ఈ ధరలు కూడా శుక్రవారం నుంచి తగ్గవచ్చునని భావిస్తున్నారు. ఒకవైపు మామిడి పంట పక్వానికి వచ్చి కోయడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక వైపు ఫ్యాక్టరీలు ప్రారంభం కాకపోవడంతో ఏం చేయాలో రైతులకు దిక్కుతోచడం లేదు. పక్వావానికి వచ్చిన కాయలు తోటలోనే నేల పాలవుతున్నాయి. తమకు గిట్టుబాటు కాకపోవడంతో పోతాపురి కాయలను తీసుకోవడానికి జూస్ ఫ్యాక్టరీలు ముందుకు రాలేదు. దీంతో గంగాధర నెల్లూరు సమీపంలోని జైన్ ఫ్యాక్టరీ తోతాపురి మామిడి టన్ను 5000 రూపాయలుగా నిర్ణయించింది. మామిడి రైతులు ఎవరైనా తీసుకుని వస్తే తాము తీసుకుంటామని ప్రకటించింది. దీంతో స్థానికంగా రైతులు ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. వేలూరు రోడ్డులోని ఆర్ ఎం ఎం, తాసా ఫ్యాక్టరీలు రాజంపేట, కోడూరు ప్రాంతాల నుంచి టన్ను ఐదువేల రూపాయలు వంతున మామిడిని గురువారం తెప్పించుకున్నాయి. ఈ విషయం తెలియడంతో మామిడి రైతులు ఆర్ ఎం ఎం ఫ్యాక్టరీకి చేరుకొని ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ టన్ను తోతాపూరి రకం 12 వేల రూపాయలకు నిర్ణయించగా, 5000 రూపాయలకు ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఇరువర్గాలు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని కలిసి తమ వాదనను వినిపించాయి. మొత్తం మీద జిల్లాలో మామిడి రైతుల సమస్య జటిలం అవుతోంది. మామిడికాయలు పక్వానికి వచ్చి కోయడానికి సిద్ధంగా ఉన్నాయి. జ్యూస్ ఫ్యాక్టరీలు తీసుకోవడానికి సిద్ధంగా లేవు. ఫలితంగా ఈ సంవత్సరం కూడా మామిడి రైతులు భారీగా నష్టపోయి ప్రమాదం కనిపిస్తుంది. మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు 6 నుంచి 7 రూపాయల మధ్య ధర నిర్ణయించి కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. అంతకుమించి ధర ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నాయి. కొన్ని ఫ్యాక్టరీలు ఈ సంవత్సరం ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని మామిడి రైతులకు ఒక దారి చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
పో రై. వేలూరు రోడ్డులోని ఆర్ ఎం ఎం ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తున్న మామిడి రైతులు 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *