పాలసముద్రం నుండి యదేఛ్చగా గ్రావెల్, మట్టి అక్రమ రవాణా
రోజుకు 600 టిప్పుర్ల మట్టిని తరలింపు
సామాజిక మాధ్యమాలలో వీడియోలు చక్కర్లు
విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
స్థలాలను పరిశీలించిన తహసిల్దార్, ఎస్.ఐ
సిపిఐ బృందం కూడా పరిశీలన
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో అక్రమ వ్యవహారాలు ఒక్కేక్కటిగా వెలుగును చూస్తున్నాయి. వైసిపి నుంచి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తులు ఇందుకు కేంద్ర బిందువులు కావడం గమనార్హం. ఒక వ్యక్తి ఎమ్మెల్యే పేరు చెప్పుకుని లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు సంచలనం రేపాయి. ఆయన మాట్లాడిన ఆడియో వైరల్ కావడంతో వెదురుకుప్పం పోలీసులను ఆశ్రయించారు. ఒక టిడిపి నాయకుడు ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ ఒక దళిత మహిళ వీడియో విడుదల చేసింది. ప్రకాశం జిల్లాకు చెందిన క్వారీ యజమాని వెంకటేశ్వర రెడ్డి, కార్వేటినగరం మండలంలో తన క్వారీ రెన్యువల్ కోసం ప్రజాప్రతినిధి అనుచరుడు హరీష్ యాదవ్ కు 50 లక్షలు ఇచ్చినట్టు ఒక ఆడియో వైరల్ అయ్యింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉండగా పాలసముద్రం నుండి తమిళనాడుకు గ్రావెల్, మట్టి అక్రమ రవాణా ప్రస్తుతం హాట్ టాపిక్ గ మారింది. ఈ విషయం సామజిక మాధ్యమాలలో రావడంతో ఈ విషయమై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పి మనికంట చందోలు విచారణకు ఆదేశించారు. దీంతో శుక్రవారం స్థానిక తహసిల్దార్, ఎస్. ఐ లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు ఆధ్యర్యంలో ఒక బృందం శుక్రవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్రమార్కులకు ఈ విషయం ముందుగా సమాచారం అందడంతో శుక్రవారం అక్రమ రవాణాను తాత్కాలికంగా నిలుపుదల చేసి, కొన్ని హిటాచిలు మాత్రం చెరకు తోటలు,వాగులో దాచారు. వాటికీ సిపిఐ నాయకులు, మండల అధికారులు పరిశీలించారు.
పాలసముద్రం మండలం తమిళనాడుకు సరిహద్దులో ఉండడంతో ఇక్కడి నుంచి గ్రావెల్ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. తమిళనాడులో వాల్టా చట్టం కఠినంగా అమలుచేస్తూ, అక్కడ గ్రావెల్ తరలింపును ప్రభుత్వం నిషేధించింది. దీనివల్ల తమిళనాడుకు సరిహద్దులో ఉన్న పాలసముద్రం మండలం నుంచి అక్రమార్కులు నిత్యం గ్రావెల్ మట్టిని ఆ రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. బలిజకండ్రిగ, వనదుర్గాపురం, సింహరాజుపురం, తిరుమలరాజుపురం, గంగమాంబాపురం, బాలకృష్ణాపురం గ్రామాలు తమిళనాడుకు సమీపంలో ఉన్నాయి. ఇక్కడవున్న గ్రావెల్ క్వారీల నుంచి అక్రమార్కులు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవురోజుల్లో ఎక్కువగా తరలిస్తున్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న టిప్పర్ల ద్వారానే వీటిని తరలిస్తున్నా,అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రావెల్ తరలించే మార్గంలో విద్యుత్ లైన్లు తక్కువ ఎత్తులో ఉండడంతో తీగలు టిప్పర్లకు తగులుతాయనే ఉద్దేశంతో కొయ్యలతో వాటిని పైకి లేపి యథేచ్చగా గ్రావెల్ తరలించుకుపోతున్నారు. ఈ వ్యవహారం కూడా రచ్చ ఎక్కింది. గతంలో మాజీ మంత్రి రోజాకు సన్నిహితంగా ఉంది అధికార పార్టీలో చేరిన వ్యక్తి శరవణ ఇప్పుడు కొండలను తవ్వి తమిళనాడుకు గ్రావెల్ తరలిస్తున్నట్టు తెలిసింది. పాలసముద్రం మండలంలో 4 చోట్ల గ్రావెల్ తరలింపు జరుగుతున్న విషయాన్ని టిడిపికే చెందిన కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పెట్టారు. ఎస్ ఆర్ ఆర్ కండ్రిగ, వేపకోన, అత్తిమంజేరి పేట, ప్రాంతాల నుంచి గ్రావెల్ అక్రమ తరలింపు జరుగుతున్నదని ఆరోపిస్తున్నారు. మట్టి తవ్వడానికి ఒక్కొక్క చోట ఐదారు హిటాచీలు పనిచేస్తున్నాయని అంటున్నారు. వీటి సాయంతో ఒక్కొక్క చోట నుండి సుమారు 150 టిప్పర్లతో తమిళనాడుకు గ్రావెల్ తరలిస్తున్నారని తెలిపారు. వీరు రోజుకు 600 టిప్పుర్ల మట్టిని తరలిస్తున్నట్టు వీడియోలో క్యాషియర్ చెప్పారు. అక్కడ దొరికిన సమాచారం ప్రకారం తమిళనాడు ఒక్కో టిప్పర్ గ్రావెల్ ను రూ 8000 కు అమ్ముతున్నట్టు తెలిసింది. ఇందులో మధ్యవర్తుల రూ 1500, అక్రమార్కులకు రూ 5000 వస్తుందని అంటున్నారు. ఈ లెక్కన నెలకు రూ 7.50 కోట్లు దోచుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఆరు నెలల నుంచి ఈ అక్రమ దందా కొనసాగుతోందని ఒక నాయకుడు చెప్పారు. నగరి నియోజక వర్గంలోని కొన్ని క్వారీల పేరుతో ఉన్న పర్మిట్లు అడ్డు పెట్టుకుని ఇక్కడ అక్రమ రవాణా చేస్తున్నారని అంటున్నారు. గత మూడు రోజులుగా వివిధ వార్తా మాధ్యమాలలో ఈ వ్యవహారాలపై అనేక కథనాలు వస్తున్నా, ఎమ్మెల్యే, ఆయన అనుచరులు, అధికారులు, పార్టీ నేతలు ఎవరు వివరణ ఇవ్వలేదు. దీనిపై టిడిపి రాష్ట్ర నాయకుడు ఒకరిని ప్రశ్నించగా కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందని చెప్పి దాట వేశారు.
*తరచుగా ప్రమాదాలు*

