ఏడాది పాలనలో కొందరికి మోదం మరి కొందరికి ఖేదం
ఆనందంగా శాసనసభ్యులు, నామినేటెడ్ చైర్మన్లు
పార్టీ విజయం కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తల్లో నిరాశ
ఏడాదిగా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూపులు
ఇప్పటికైనా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని వినతి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా కార్యకర్తల్లో ఒక వైపు మోదం మరో వైపు ఖేదం కనిపిస్తోంది. ముఖ్యంగా టిడిపి నాయకులు, కార్యకర్తల్లో భిన్న కోణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురువారం అన్ని నియోజక వర్గం, మండల కేంద్రాలలో సంబరాలు జరుపుకున్నారు. అధికారంలో ఉన్న శాసనసభ్యులు, నామినేటెడ్ పదవులు పొందిన చైర్మన్లు ఆనందంగా ఏడాది పాలన సందర్భంగా ఉత్సవాలను జరుపుకుంటున్నారు. గత ఎన్నికలలో పార్టీ విజయం కోసం శ్రమటోడ్చిన నాయకులు, కార్యకర్తలు ఏడాదిగా నామినేటెడ్ పదవులను ఆశించి నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వము ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేయాల్సిందిగా కోరుతున్నారు.
జిల్లాలో ఉన్న ఒక లోక్ సభ స్థానం, ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలలో టిడిపి అభ్యర్థులే గెలిచారు. లోక సభ సభ్యునిగా దగ్గుమల్ల ప్రసాదరావు కొత్తగా రాజకీయాలలోకి వచ్చి గెలిచారు. అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయుడు, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, జి డి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ మోహన్ తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కుప్పంలో వరుసగా ఎనిమిదవ సారి గెలిచిన నారా చంద్రబాబు నాయుడు నాలుగవ సారి ముఖ్యమంత్రి అయ్యారు. పుంగనూరు నుంచి రెండు సార్లు, పలమనేరు నుంచి రెండవ సారి గెలిచిన ఎన్ అమరనాథ రెడ్డి మంత్రి పదవి ఆశించి విఫలం అయ్యారు. ఈ నేపధ్యంలో కొత్తగా ఎమ్మెల్యే అయిన వారు, వారి అనుచరులు సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలు చేసిన హామీలను ప్రజలకు వివరించారు. అయితే పార్టీ కోసం ఐదేళ్లు అనేక విధాలుగా కష్ట పడినా పదవులు దక్కని నాయకులు వారిని నమ్ముకున్న కార్యకర్తలు ఏడవలేక నవ్వినట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు టికెట్టు తీసుకున్న వారిని నెత్తిన పెట్టుకుని గెలిపించి ప్రయోజనం లేక పోయిందన్న భావన అన్ని చోట్లా వినిపిస్తోంది. జిల్లాలో సీనియర్ నాయకుడైన అమరనాథ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వక పోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన గతంలో చంద్రబాబు మంత్రి వర్గంలో పనిచేసారు. లోకేశ్ పాదయాత్ర ప్రారంభించి నప్పుడు నాలుగు రాయలసీమ జిల్లాలో ఆయన వెంటతిరిగారు. గతంలో జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షునిగా సేవలు అందించారు. అయినా ఆయనను పక్కన పెట్టడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో మాజీ ఎమ్మెల్యేలు సి కె బాబు, ఎ ఎస్ మనోహర్, కాజూరు బాలాజీ, చంద్రప్రకాష్ తదితరులు రాత్రి పగలు పనిచేసి జగన్ మోహన్ నాయుడు గెలుపుకు కృషి చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, మహిళా నాయకురాళ్ళు కటారి హేమలత, వైవి రాజేశ్వరి టిడిపి అభ్యర్థి గెలుపుకు కృషి చేసారు. వీరిలో కటారి హేమలతకు మాత్రం తుడా చైర్మన్ పదవి దక్కింది. అయినా ఇప్పటి వరకు మిగిలిన వారికి నామినేటెడ్ పదవి దక్కలేదు. పూతలపట్టు నియోజక వర్గానికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ నిత్యం మీడియాలో పోరాటం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనకు ప్రభుత్వంలో ఎలాంటి గుర్తింపు లేదని ఆయన వర్గీయులు అంటున్నారు. జి డి నెల్లూరు నియోజక వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి కష్టకాలంలో వైసిపి నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయనను పట్టించుకునే నాథుడే లేదన్న భావన ఆయన వర్గీయులలో వ్యక్తం అవుతోంది. అదే నియోజక వర్గానికి చెందిన రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు వర్గంలో కూడా అసంతృప్తి కనిపిస్తోంది. నగరి నియోజక వర్గానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి పోతుగుంట విజయబాబు కూడా పదవి ఆశిస్తున్నారు. కాగా కుప్పం నియోజక వర్గానికి చెందిన మునిరత్నం, రాజశేఖర్ లకు రాష్ట్ర స్థాయి పదవులు వచ్చాయి. నగరి నియోజక వర్గానికి చెందిన అమాస రాజశేఖర్ రెడ్డి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ అయ్యారు. మరికొందరికి చిన్న పదవులు దక్కాయి. అయితే ప్రతి పక్షంలో ఉండగా పోరాటం చేసిన వారిని పార్టీ పట్టించుకోక పోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి అయినా కొందరికి పదవులు ఇస్తే మంచిదని అంటున్నారు. జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టులు కూడా ఇంకా భర్తీ కావాల్సి ఉంది. కాణిపాకం, బోయకొండ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవులు, ఇంకా కొన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భర్తీకి నోచుకోలేదు. ఇప్పటివరకు జిల్లాలో కొన్ని మార్కెటింగ్ కమిటీలకు చైర్మన్ లను ప్రకటించిన, డైరెక్టర్ లను నియమించలేదు. అలాగే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ ల నియామకం జరిగింది. వీటికి డైరెక్టర్లు, జిల్లా సహకార ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్, డైరెక్టర్లు నియమితులు కవాల్సి ఉంది. రాష్ట్రస్థాయిలో పలు సంస్థలకు చైర్మన్ లను నియమించిన, డైరెక్టర్ పదవులను భర్తీ చేయలేదు. అధికారంలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు ఏడాది పాలనను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే నామినేటెడ్ పదవులను ఆశించిన నాయకులు మాత్రం నిరాశకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇదిగో అదిగో అంటూ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు కార్యకర్తలను, నాయకులను ఊరిస్తూనే ఉన్నారు. అయితే పదవుల పందారం కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. దీంతో నామినేటెడ్ పదవులను ఆశించిన నాయకులు నిరాశకు గురవుతున్నారు.

