7, జూన్ 2025, శనివారం

చిత్తూరు టిడిపి పార్లమెంటరీ అధ్యక్ష పదవికి పోటాపోటీ


చిత్తూరు బ్యూరో ఆంధ్రప్రభ

చిత్తూరు పార్లమెంటు టిడిపి అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఈ నెల 15 వ తేదీ లోపల జాతీయ, రాష్ట్ర కమిటీలతో పాటు పార్లమెంటు అధ్యక్షుల నియామకం కూడా జరిగే అవకాశం ఉంది. గత నెల 28 వ తేదీ మహానాడులో సిఎం చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అనవాయితీ ప్రకారం  ఎన్నికైన రెండు వారాలలో పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తారు. గతంలో ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు సౌలభ్యం కోసం పార్లమెంటు కమిటీలను ఏర్పాటు చేసారు. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గంలో చిత్తూరు జిల్లాలోని ఆరు నియోజక వర్గాలతో పాటు తిరుపతి జిల్లాలోని చంద్రగిరి కూడా కలసి ఉంది. 

చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రబాబు ( కుప్పం) ముఖ్య మంత్రిగా ఉన్నారు.అమరనాథ రెడ్డి ( పలమనేరు), గురజాల జగన్ మోహన్ నాయుడు ( చిత్తూరు), గాలి భాను ప్రకాష్ ( నగరి) డాక్టర్ వి ఎం థామస్ ( జి డి నెల్లూరు), డాక్టర్ మురళీ మోహన్ ( పూతలపట్టు), పులివర్తి నాని ( చంద్రగిరి) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. చిత్తూరు లోక్ సభ సభ్యునిగా దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు. ప్రస్తుతం చంద్రగిరి నియోజక వర్గానికి చెందిన సి ఆర్ రాజన్ అధ్యక్షునిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు అప్పటి వరకు అధ్యక్షునిగా ఉన్న పులివర్తి నాని స్థానంలో బిసి సామాజిక వర్గానికి చెందిన రాజన్ ను అధ్యక్షునిగా నియమించారు. తిరిగి ఆయనే కొనసాగుతారని కొందరు కొందరు భావిస్తున్నారు. అయితే ఆయన రాష్ట్ర వన్నె కుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులు అయినందున కొత్తవారిని నియమిస్తారని మరి కొందరు భావిస్తున్నారు. జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమించే ఈ నేపధ్యంలో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు పార్లమెంటు అధ్యక్ష పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పాలసముద్రం, మండల కమిటీ అధ్యక్షుడు, జడ్పీటీసీ, పుత్తూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు నిర్వహించారు. జి డి నెల్లూరు నియోజక వర్గం సమన్వయ కర్తగా పనిచేశారు. రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ పదవి ఆశించి పొందలేక పోయారు. ఐరాల మండలానికి గిరి నాయుడు కూడా రేసులో ఉన్నారు. గతంలో ఆయన పార్టీ మండల కమిటీ అధ్యక్షునిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పూతలపట్టు నియోజక వర్గంలో పార్టీ గెలుపుకు కృషి చేసారు. చిత్తూరు మండలానికి చెందిన చంద్రప్రకాష్ నాయుడు అధిష్టానం బాధ్యత ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఆయన చిత్తూరు ఎంపిపి, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు నిర్వహించారు. ఆయన భార్య గీర్వాణి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. బంగారు పాల్యం మండలానికి చెందిన ఎన్ పి జయప్రకాశ్ నాయుడు కూడా పదవిని ఆశిస్తున్నారు. ఆయన గతంలో బంగారు పాల్యం మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన భార్య సుచిత్ర బంగారుపాలెం మండల పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సోదరుడు ధరణి ప్రసాద్  మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు చిత్తూరు రాజకీయాలను శాసించిన ఎన్ పి కుటుంబానికి చెందిన జయప్రకాశ్ నాయుడు గత ఎన్నికల్లో చిత్తూరు టికెట్టు ఆశించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ కూడా పదవి ఆశిస్తున్నారు. తొలి నుంచి పార్టీలో ఉన్న ఆయనకు చంద్రబాబు కుటుంబంతో బంధుత్వం కూడా ఉంది. జిల్లా రాష్ట్ర పార్టీలో పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. గత పార్లమెంటు సమయంలో ఎంపీ ప్రసాదరావు ఎలక్షన్ ఏజెంట్ గా ఆయన విజయానికి కృషి చేశారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కలిచర్ల శ్రీకాంత్ ఎన్నికల సమయంలో ఎలక్షన్ ఏజెంట్  కూడా  పనిచేశారు. తిరుపతి, సత్యవేడు ఎన్నికల పరిశీలకులుగా బాధ్యతలు నిర్వహించారు. డిసిసి బ్యాంకు డైరెక్టర్ గా పనిచేశారు. కాగా పుత్తూరుకు చెందిన  రాష్ట్ర కార్యదర్శి పోతుగుంట విజయబాబు రేసులో ఉన్నారు. ఆయన 2009 ఎన్నికల్లో నగరి నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వీరందరూ కమ్మ సామాజిక వర్గం కాగా బలిజ సామాజిక వర్గానికి కాజూరు బాలాజీ కూడా పార్లమెంటు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కరోనా వంటి కష్ట సమయంలో చిత్తూరు పట్టణంలో పార్టీ తరఫున ఆనందయ్య కరోనా మందును వార్డు వార్డుకు సరఫరా చేశారు. అలాగే విరివిగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ఆయన అభిమానులు భారీ ఎత్తున నిర్వహించారు. గత ఎన్నికల్లో చిత్తూరు టికెట్టు ఆశించారు. కాగా ఇప్పటి వరకు దళితులకు అవకాశం ఇవ్వనందున తనకు అవకాశం కల్పించాలని రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ కోరుతున్నారు. ఆయన విద్యార్థి దశ నుంచి పార్టీకి వివిధ హోదాలలో సేవలు అందిస్తున్నారు. గతంలో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. చిత్తూరు కేంద్రంగా నిత్యం ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారు. అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు. ప్రజల తరఫున సమస్యలపై పోరాటం చేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా సి ఆర్ రాజన్ ను  నియమించి ఏడాది అవుతుంది. మరో పర్యాయం కూడా ఆయనను కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయనను అధ్యక్షుడుగా కొనసాగిస్తే ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్న వారు ప్రధాన కార్యదర్శి పదవికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో పార్టీ పటిష్టతకు  ఎవరి పట్ల మగ్గుచూపుతారు వేచి చూడాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *