మామిడి రైతుల దుస్థితికి కారణం ఎవరు?
గత ఏడాది 4 లక్షల టన్నుల దిగుబడి, కిలో రూ. 30
ప్రస్తుతం 5 లక్షల టన్నుల దిగుబడి, కిలో రూ. 2
ఆలస్యంగా ప్రారంభం అయిన కొనుగోళ్ళు
హడావిడి చేసిన ఉద్యానవన శాఖ
పెరగని స్థానిక వినియోగం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గత సంవత్సరం తోతాపురి మామిడి నాలుగు లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. అయినా, జిల్లాలో కిలో 25 నుంచి 30 రూపాయలు పలికింది. ఈ సంవత్సరం ఐదు లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అయితే, ఉన్నపలంగా కిలో రెండు రూపాయలకు పడిపోయింది. జ్యూస్ ఫ్యాక్టరీలు మామిడిని తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఏ ఫ్యాక్టరీ వద్ద చూసిన వందలాది ట్రాక్టర్లు బారులు తీరి కనిపిస్తున్నాయి. అన్లోడ్ చేయడానికి మూడు నుంచి నాలుగు రోజులు సమయం పడుతుంది. కొంతమంది రైతులు మామిడికాయలను రోడ్లమీద పారబోస్తున్నారు. మామిడి తోటలోనే కాయలు పండు మాగి కిందపడిపోతున్నాయి. వాటిని కోయడానికి కూడా రైతులు ముందుకు రావడంలేదు. మరికొందరు రైతులు మామిడి చెట్లను నరికేస్తున్నారు. జిల్లాలో ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అయ్యిందో పరిశీలిద్దాం.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల కారణంగా చిత్తూరు జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు సంక్షోభంలో కొరుకుపోయాయి. జ్యూస్ ఫ్యాక్టరీలలో తయారైన మామిడి పల్ప్ నిల్వలు ఎగుమతికి నోచుకొక పేరుకుపోతున్నాయి. మామిడి పల్ప్ అమ్మకాలు ఆగిపోవడంతో జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు కొన్ని గత రెండు సంవత్సరాలుగా రైతుల నుంచి తీసుకున్న మామిడి కాయలకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. గత సంవత్సరం జిల్లాలో మామిడి పంట చాలా తక్కువ వచ్చింది. ఈ సంవత్సరం మరో లక్ష టన్నులు అదనంగా వచ్చాయి. చిత్తూరు జిల్లాలో 1.50 లక్షల ఎకరాలలో మామిడి తోటలు విస్తరించి ఉండగా, ఉమ్మడి జిల్లాలో 2.70 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న మామిడి తోటల నేపద్యంలో మామిడికాయలను పల్ప్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 47 మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవి 2023లో 8 లక్షలు మెట్రిక్ టన్నుల మామిడికాయలను కొనుగోలు చేసి తద్వారా నాలుగు లక్షల టన్నుల పల్పును ఉత్పత్తి చేశాయి. 2024 సంవత్సరంలో మామిడి పంట గణనయంగా తగ్గింది. దీంతో నాలుగు లక్షల మామిడి కాయలను క్రస్సింగ్ చేసి రెండు లక్షల టన్నుల పల్పును ఉత్పత్తి చేశాయి. చిత్తూరు జిల్లాలో ఉత్పత్తి అయిన పల్ప్ ఎక్కువగా యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంది. అలాగే కొంత గల్ఫ్ దేశాలకు, సింగపూర్ కూడా ఏగుమతి అవుతుంది. జిల్లాలో తయారయ్యే మామిడి పల్పు మనదేశంలో వినియోగం చాలా తక్కువ. మన దేశంలోని స్లైడ్, మాజా, రియల్, ఫ్రూటీ, గల్లా వంటి జ్యూస్ లు తయారు చేస్తారు. వీటిల్లో వాడకం అంత ఆశాజనకంగా లేదు. ఇదివరకు ఈ జ్యూస్ లో మామిడి పల్పును18 నుంచి 20 శాతం ఉపయోగించేవారు. ప్రస్తుతం సగానికి పైగా మ్యాంగో బల్బును తగ్గించారు. ప్రస్తుతం పది నుంచి 12 శాతం మాత్రమే ఉపయోగించి ఈ జ్యూస్ లను తయారు చేస్తున్నారు. గత సంవత్సరంగా జరుగుతున్న అమాస్ ఇజ్రాయిల్ యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ యుద్దాల కారణంగా ఇతర దేశాలకు చిత్తూరు నుండి మ్యాంగో పల్ప్ ఎగుమతి ఆగిపోయింది. గత రెండు సంవత్సరాలలో తయారైన మామిడి పళ్ళు ఇంకా 2.85 లక్షల టన్నుల నిల్వ ఉండగా, రెండు ఓడలలో సుమారు రెండు లక్షల టన్నుల పల్ప్ ఎగుమతి చేశారు. జిల్లాలోని ఫ్యాక్టరీ లలో ఇంకా 90 లక్షల టన్నుల వరకు పల్ప్ నిల్వలు ఉన్నాయి. దేశంలో మామిడి జ్యూస్ తాగే వారి శాతం చాలా తక్కువ. తంసప్, కోకోకోలా, స్పైట్ వంటి శీతల పానీయాలకే డిమాండ్ ఎక్కువ. గతంలో ఇతర దేశాలకు రెడ్ సీ ద్వారా మామిడి పల్ప్ ఎగుమతి జరిగేది. యుద్ధాల కారణంగా రెడ్ సీలో నాలుగు కంటైనర్లను బాంబులు వేసి ధ్వంసం చేశారు. దీంతో అటువైపు కంటైనర్ల రాకపోకలు ఆగిపోయింది. ప్రస్తుతం శ్రీలంక మీదుగా గల్ఫ్, యూరప్ దేశాలకు మామిడి పల్పును ఎగుమతి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఎగుమతి వ్యయం భారీగా అంటే ఎనిమిది రెట్లు వరకు పెరిగింది. గల్ఫ్ లోని యామన్ పోర్టు యుద్ధం కారణంగా ధ్వంసం అయింది. ప్రస్తుతం ఆ పోర్టు ద్వారా దిగుమతి దిగుమతి ఆగిపోయాయి. చిత్తూరు జిల్లా నుంచి వెళ్లే పల్ప్ ఎక్కువగా యామన్ పోర్టు ద్వారా ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం నిల్వ ఉన్న మామిడి పల్ప్ కు ఎగుమతి ఆర్డర్లు వచ్చిన, ఎగుమతి చేయడానికి తగినన్ని కంటైనర్లు అందుబాటులో లేవు. మన దేశంలో నుంచి గల్ఫ్, యూరప్ దేశాలకు వెళ్లిన కంటైనర్లకు తిరుగు బాడుగ లభించకపోవడంతో అక్కడే నిలిచిపోయాయి. పేరుకుపోతున్న మామిడి పల్ప్ నిల్వలు మరోవైపు జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులకు భారంగా మారాయి. వాటికి గోడౌన్ల అద్దెను చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు మామిడి సరఫరా చేసిన రైతులకు బిల్లులు చెల్లించాలని ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమ సమైఖ్య ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకువెళ్లారు. జూస్ ఫ్యాక్టరీలకు బ్యాంకర్లు ఇచ్చిన రుణాలను రెన్యువల్ చేయాల్సిందిగా కోరారు. అయితే ఈ విషయమై జిల్లా కలెక్టర్ రెండు మూడు సార్లు బ్యాంకు అధికారులకు లేఖలు రాసిన, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు జ్యూస్ ఫ్యాక్టరీలలో ఉన్న మామిడి పల్ప్ ఖాళీ కాకపోవడంతో ప్రస్తుతం కాయలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. మరోవైపు మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు ప్రారంభానికి పెట్టుబడి లేకుండా యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు. మామిడికాయలు సరఫరా చేసిన రైతులకు వెంటనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద జ్యూస్ ఫ్యాక్టరీలు అప్పులు తీసుకొని రైతులకు చాలావరకు చెల్లించారు. ఆ అప్పులకు వడ్డీలు చెల్లించలేక సతమతం అవుతున్నారు. గత సంవత్సరం జిల్లాలో 4 లక్షల టన్నులు క్రస్సింగ్ చేశారు. ఈ సంవత్సరం పై మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు 5 లక్షల టన్నులకు పైగా కాయలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సుమారు 1.5 లక్షల టన్నులను రైతులు కోసి ఫ్యాక్టరీలకు, మండిలకు సరఫరా చేశారు. ఇంకా 3.5 లక్షల టన్నుల మామిడి తోటల మీదనే ఉన్నాయి. ఈ మామిడిని ఫ్యాక్టరీలు తీసుకొని క్రషింగ్ చేయడం సందేహంగానే కనిపిస్తోంది.
*ఉద్యానవన శాఖ హడావిడి*
జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమల పరిస్థితి జిల్లా ఉద్యానవన శాఖ అధికారులకు బాగా అవగాహన ఉంది. ఈ సంవత్సరం ఎంత దిగుబడి వస్తుందన్న విషయం కూడా వారికి తెలుసు. ఈ సంవత్సరం మామిడి రైతులు, జ్యూస్ ఫ్యాక్టరీలు సంక్షోభాన్ని ఎదుర్కొన పోతున్నాయని ఐదు నెలల ముందుగానే ఆంధ్రప్రభ హెచ్చరించింది. అయితే హడావిడిగా ఉద్యానవన శాఖ అధికారులు రైతులతో ఫ్యాక్టరీ యజమానులతో సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీజన్ ప్రారంభానికి ముందే మూడుసార్లు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో మద్దతు ధర మీద నిర్దిష్టంగా చర్చ జరగలేదు. అధికారులు, రాజకీయ నాయకుల ఊక దంపుడు ఉపన్యాసాలకే పరిమితమయ్యారు. ఈ సమావేశాలకు మాత్రం లక్షలాది రూపాయలను వృధా చేశారని ఒక రైతు సంఘం నాయకుడు వ్యాఖ్యానించారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసన్ వారం రోజులపాటు జిల్లాలోనే ఉండి రైతుల, ఫ్యాక్టరీ యజమానుల స్థితిగతులను పరిశీలించారు. ఇంత కసరత్తు జరిగిన మామిడి రైతులు ఈ సీజన్లో తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. మామిడి ధరను నిర్ధారించడంలో జరిగిన ఆలస్యం కారణంగా ఈ సంక్షోభం ఏర్పడిందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. నెలరోజులకు ముందుగా ప్రారంభం కావాల్సిన మామిడి క్రషింగ్ నెల రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో కాయలు పక్వానికి రావడంతో ఒకేసారి రైతులు కాయలను కోసి ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నారు. కోయకుంటే తోటలోనే కాయలు పాడయ్యే పరిస్థితి. దీంతో రైతులు చేయునది లేక పండించిన పంటను అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారు. ఇందుకు తగిన సామర్థ్యం ఫ్యాక్టరీల వద్ద లేకపోవడంతో అన్లోడ్ చేసుకోవడానికి మూడు నుంచి నాలుగు రోజులు సమయం పడుతుంది. పర్మిట్లు దొరకడం లేదు. కావున రైతులు రోడ్లమీద కాయలను ప్రారంభోస్తున్నారు.
*స్థానిక వినియోగం ఎక్కడ?*
మామిడిపల్పును స్థానికంగా వినియోగించుకుంటే ఈ సంక్షోభం నుంచి గట్టెక్క వచ్చనని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. టిటిడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర ఆలయాల్లో భక్తులకు మామిడి జ్యూస్ ను పంచి పెట్టాలని, ఆలయ ఆవరణంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు, అంగనవాడి పిల్లలకు మామిడి జ్యూస్ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ సభలు, సమావేశాలలో కూడా మామిడి జ్యూస్ నే వినియోగించాలని కోరారు. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. ఫలితంగా జిల్లాలో మామిడి పల్ప్ పేరుకు పోవడంతో రైతులు, ఫ్యాక్టరీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
*జ్యూస్ పరిశ్రమల పరిస్థితి బాగాలేదు*
జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమల, రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రానున్న సీజన్లో మామిడి గుజ్జు పరిశ్రమల పునః ప్రారంభానికి తగిన పెట్టుబడి కూడా లేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల పల్ప్ నిల్వలు పేరుకుపోయాయి. బ్యాంకులు గతంలో ఇచ్చిన రుణాల చెల్లించాలని వత్తిడి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప జిల్లాలో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు రోజుకు ఒకసారి పాలకు బదులుగా మామిడి జ్యూస్ ను సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. అలాగే ప్రసిద్ధ దేవాలయాల్లో, టూరిజం ప్రాంతాలలో తమకు స్టాల్స్ కేటాయించాల్సిందిగా కోరాము. మధ్యాహ్న భోజన పథకంలో ఒకరోజు విద్యార్థులకు మామిడి జ్యూస్ సరఫరా చేయాలని మనవి చేశాం. ఇలా చేస్తే కొంతవరకు మామిడి గుజ్జు పరిశ్రమకు చేయూత ఇచ్చిన వాళ్ళు అవుతారు. మామిడి రైతులకు కూడా గిట్టుబాటు ధర లభిస్తుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద రానున్న సీజన్ కు మామిడి రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. మామిడి రైతులు ఈ సీజన్లో మామిడి మీద ఎక్కువ ఖర్చు చేయవద్దని జిల్లా పండ్ల పరిశ్రమ సమాఖ్య తరఫున మామిడి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
చిత్తూరు జిల్లాలోని ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్-సౌత్ జోన్ చైర్‌పర్సన్ మరియు పల్ప్ ఇండస్ట్రీ ప్రతినిధి గోవర్ధన్ బాబీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న మామిడి తోటలు ఈ సీజన్‌లో అధికంగా పండించాయని చెప్పారు.
"ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మామిడి రెండు సంవత్సరాలకు ఒకసారి పండే పంట, అంటే, ఈ సంవత్సరం అది బాగా పండితే, వచ్చే ఏడాది పంట బాగా ఉండదు. 2024 ఉదాహరణ తీసుకోండి, అప్పుడు దిగుబడి 30% కంటే తక్కువగా ఉంది. 2025లో, దిగుబడి 75% కంటే ఎక్కువగా ఉంది," అని ఆయన చెప్పారు.
అలాగే, COVID-19 తరంగాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరియు పశ్చిమాసియాలో ప్రస్తుత ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం చిత్తూరు జిల్లాలో గుజ్జు పరిశ్రమను దెబ్బతీశాయి. 2023 నుండి ఇది ₹1,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. గోవర్ధన్ బాబీ మాట్లాడుతూ
ప్రస్తుతం గుజ్జు కర్మాగారాలు తమ గిడ్డంగులలో 1.75 లక్షల టన్నుల గుజ్జు నిల్వను కలిగి ఉన్నాయి, ఎందుకంటే కొనుగోలుదారులు (యూనిట్ల నుండి గుజ్జు కొనుగోలు చేసేవారు) 2023 మరియు 2024లో ముందుకు రాలేదు.
పశ్చిమ ఆసియాలో అవాంతరాల తర్వాత, ఎర్ర సముద్ర మార్గాన్ని పరిమిత షెడ్యూల్‌లతో నిర్వహిస్తున్నారు. దీని కారణంగా, ఎగుమతిదారులు శ్రీలంక మరియు ఆగ్నేయాసియా దేశాల చుట్టూ తిరుగుతూ చుట్టుపక్కల మార్గాలపై ఆధారపడవలసి వస్తుంది. "ఇది ఎర్ర సముద్రం మార్గంతో పోలిస్తే ఎనిమిది రెట్లు ఖరీదైనది." "కొనుగోలుదారుల నుండి డిమాండ్ లేనప్పటికీ, ప్రభుత్వం ఒత్తిడి కారణంగా, మేము రైతుల నుండి కిలోకు ₹5 లేదా ₹6 చొప్పున స్టాక్‌లను కొనుగోలు చేస్తున్నాము. తమిళనాడులో, గుజ్జు పరిశ్రమ కిలోకు ₹3 మాత్రమే చెల్లిస్తుంది, కర్ణాటకలో ఇది కేవలం ₹2 మాత్రమే" అని ఆయన జతచేశారు.

