ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో సమూల మార్పులు
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో సమూల మార్పులు
పీజీఆర్‌ఎస్‌పై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం సమగ్ర మార్గదర్శకాలు
నేటి నుంచి నూతన మార్గదర్శకాలతో జిపిఆర్ఎస్ నిర్వహణ
భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
తరచుగా ఫిర్యాదులు చేసే వ్యక్తులను గుర్తించి ట్యాగ్ చేయడం
నిర్లక్ష్యం, అవినీతి, తప్పిదాలపై జీరో టాలరెన్స్ విధానం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టంగా, పారదర్శకంగా, వేగవంతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం కీలక చర్యలు చేపట్టింది. ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతి, ఫిర్యాదు సమయానికి పరిష్కారం కావడంతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరగేలా కొత్త విధివిధానాలను అమలు చేయాలని ఆదేశించింది. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) ద్వారా నమోదయ్యే ప్రతి వినతిపై సంబంధిత నోడల్ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. లాగిన్ ద్వారా వినతి అందిన వెంటనే సంబంధిత అధికారి స్వయంగా అర్జీదారుతో మాట్లాడి సమస్యను పూర్తిగా తెలుసుకోవాలని, పరిష్కారం జరిగే సమయాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించింది. తమ శాఖ పరిధిలో లేని వినతులను ఆలస్యం చేయకుండా సంబంధిత జిల్లా లేదా నియోజకవర్గ నోడల్ అధికారికి వెంటనే బదిలీ చేయాలని ఆదేశించింది. నూతన మార్గదర్శకాలతో జూన్ నెల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించాలని ఆశించింది.
పీజీఆర్‌ఎస్ ద్వారా నమోదు అయ్యే ప్రతి పిటిషన్‌పై ముఖ్యమంత్రి కార్యాలయం స్థాయిలోనే ప్రీ ఆడిట్, ఆడిట్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఏ ఫిర్యాదు ఎక్కడ పెండింగ్‌లో ఉందో, ఎంతకాలంగా పరిష్కారం కాకుండా ఉందో, ఏ అధికారి వద్ద ఉందో అన్న వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు అవుతాయని పేర్కొంది. ఆలస్యాలకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రజల సమస్యలను ప్రధానంగా రెండు విభాగాలుగా విభజించారు. ఆర్థిక సంబంధిత సమస్యలను అర్హత, నిధుల లభ్యత ఆధారంగా పరిష్కరించాల్సి ఉంటుందని, ఈ అంశాల్లో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి ఓపికగా వివరించాలని సూచించారు. ఆర్థికేతర సమస్యలను మాత్రం అధికారుల ప్రత్యక్ష బాధ్యతగా పరిగణించి శాతం శాతం పరిష్కరించాల్సిందేనని ఆదేశించారు.
తరచూ ఫిర్యాదులు చేసే వ్యక్తుల వివరాలను ప్రత్యేకంగా ట్యాగ్ చేసి జిల్లా స్థాయి అధికారులు సమగ్ర విచారణ నిర్వహించాలని సూచించారు. వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదిస్తూ సమస్యల మూల కారణాలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజలతో వ్యవహరించే తీరు ప్రభుత్వ ప్రతిష్ఠను ప్రతిబింబిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. అధికారులు ప్రజలతో సహనంతో, మర్యాదపూర్వకంగా, సహానుభూతితో వ్యవహరించాలని సూచించింది. ఒకే విషయాన్ని పలుమార్లు వివరించాల్సి వచ్చినా ఓపికగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. వ్యక్తిగత లేదా కుటుంబ వివాదాలను ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకురాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది.
కేవలం నివేదికలు పంపించడం లేదా ఎండార్స్‌మెంట్‌లు ఇవ్వడం కాకుండా ప్రజలకు స్పష్టమైన ఫలితాలు కనిపించేలా పనిచేయాలని ఆదేశించింది. ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలంటే ఫలితాల ఆధారిత పాలన అవసరమని పేర్కొంది. ప్రజలు అధికారుల పనితీరును నిశితంగా గమనిస్తున్నారని, మంచి పని చేసిన అధికారులను అభినందిస్తారని, నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై విమర్శలు వస్తాయని పేర్కొంది. 1100 వ్యవస్థ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి అధికారుల పనితీరుకు రేటింగ్ ఇస్తున్నట్లు వెల్లడించింది.
ప్రభుత్వ సేవల పంపిణీ, అర్జీల పరిష్కారంలో వేగం మరియు సామర్థ్యం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. సర్టిఫికెట్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, భూమి మ్యుటేషన్ వంటి అత్యవసర సేవల విషయంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిర్లక్ష్యం, అవినీతి, తప్పిదాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది. పూర్తి పారదర్శకతతో ప్రజా పాలన కొనసాగించాలని సూచించింది. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బ్లాక్‌చైన్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి డేటా భద్రత, పారదర్శకత, ప్రజా సేవలను మరింత బలోపేతం చేస్తున్నట్లు వివరించింది.
భూ వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, గతంలో జరిగిన అక్రమాల కారణంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను ప్రత్యేక కార్యక్రమం ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపింది. మార్చి 2027 నాటికి జీరో పెండెన్సీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రజలకు వివిధ సమస్యలు ఉంటాయని ఉదాహరణగా పేర్కొంటూ, అధికారులు ప్రజలతో కూర్చొని వారి సమస్యలను పూర్తిగా వినాలని, సాధ్యమైన పరిష్కారాలు, పరిమితులను స్పష్టంగా వివరించాలని సూచించింది. ప్రజల్లో నమ్మకం పెంపొందించే విధంగా వ్యవహరించాలని కోరింది. మొత్తంగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడం, వేగవంతమైన సేవలు అందించడం, అధికారుల్లో బాధ్యతను పెంపొందించడం, పారదర్శక పాలనను బలోపేతం చేయడమే ఈ కొత్త మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

