27, మే 2026, బుధవారం

1వ తేదీ నుంచి తోతాపురి కొనుగోలుకు ఫ్యాక్టరీలు సిద్ధం

1వ తేదీ నుంచి తోతాపురి కొనుగోలుకు ఫ్యాక్టరీలు సిద్ధం
ప్రారంభపు ధర 7 లేక 8 రూపాయలు
క్రమంగా పెరగనున్న ధరలు
పక్వానికి వచ్చిన కాయలనే కోయాలని విజ్ఞప్తి

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)

చిత్తూరు జిల్లా మామిడి రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తోతాపురి మామిడి కొనుగోళ్లకు రంగం సిద్ధమవుతోంది. జూన్ 1వ తేదీ నుంచి జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమలు తోతాపురి రకం మామిడికాయల కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. ఈసారి ప్రారంభ ధర కిలోకు రూ.7 నుంచి రూ.8 వరకు ఉండే అవకాశముందని రైతులు, వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. తరువాత డిమాండ్ పెరుగుదల ఆధారంగా ధరలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రధాన మామిడి ఉత్పత్తి ప్రాంతంగా గుర్తింపు పొందింది. జిల్లాలో మొత్తం 31 మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నప్పటికీ ప్రస్తుతం సుమారు 12 పరిశ్రమలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో పండిన ఖాదర్ రకం మామిడికాయలను కొన్ని పరిశ్రమలు పల్ప్ తయారీ కోసం వినియోగిస్తున్నాయి. మరికొన్ని పరిశ్రమలు విజయవాడ ప్రాంతం నుంచి తోతాపురి మామిడికాయలను తెప్పించుకుని ప్రాసెసింగ్ కొనసాగిస్తున్నాయి.

అయితే ఈసారి విజయవాడ ప్రాంతంలో కూడా మామిడి దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అక్కడి నుంచి సరఫరా తగ్గుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయవాడ మార్కెట్‌లో కిలో మామిడి ధర సుమారు రూ.4.50 ఉండగా, అక్కడి నుంచి చిత్తూరుకు రవాణా చేయడానికి అదనంగా మరో రూ.2.50 వరకు ఖర్చవుతోంది. దీంతో కిలో మామిడికాయ చిత్తూరు పరిశ్రమలకు చేరేసరికి రూ.7 వరకు వ్యయం అవుతోంది. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా మామిడికాయలు నాణ్యతలో ఎంతో మెరుగ్గా ఉండటంతో స్థానిక తోతాపురి కొనుగోళ్లపై పరిశ్రమలు దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో పండే తోతాపురి మామిడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గుజ్జు శాతం ఎక్కువగా ఉండటం, రుచి, రంగు, నిల్వ సామర్థ్యం బాగుండటంతో చిత్తూరు మామిడి పల్ప్‌కు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈసారి స్థానిక మామిడి రైతులకు మంచి అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది మామిడి పంట ఒకేసారి కాకుండా మూడు దఫాలుగా పక్వానికి వస్తుండటం ప్రత్యేక పరిస్థితిగా మారింది. ప్రస్తుతం కొన్ని తోటల్లో కాయలు పూర్తిగా పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని తోటల్లో ఇంకా కొంత సమయం పడుతోంది. ఇంకొన్ని ప్రాంతాల్లో మామిడికాయలు ఆలస్యంగా పక్వానికి వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందకుండా ఓపికగా వ్యవహరించాలని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు. పక్వానికి రాని కాయలను తొందరపడి కోయడం వల్ల రైతులకు ధర నష్టం కలగడంతో పాటు ఫ్యాక్టరీల్లో గుజ్జు నాణ్యత కూడా దెబ్బతింటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పూర్తిగా పక్వానికి వచ్చిన కాయలనే కోసి సరఫరా చేయాలని సూచిస్తున్నారు. రైతులందరూ ఒకేసారి కోతలు ప్రారంభిస్తే మార్కెట్‌పై ఒత్తిడి పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంటుందని, దశలవారీగా సరఫరా చేస్తే రైతులకే లాభం ఉంటుందని చెబుతున్నారు. జిల్లాలోని గుజ్జు పరిశ్రమలు ఈసారి అన్ని రకాల పక్వమైన తోతాపురి కాయలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని, రైతులు భయపడాల్సిన అవసరం లేదని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ప్రారంభంలో ధరలు రూ.7 లేదా రూ.8 వద్ద ఉండే అవకాశం ఉన్నప్పటికీ, సరఫరా పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా తరువాత ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల ఈదురు గాలులు, అకాల వర్షాలతో కొంత మేర మామిడి కాయలు నేలరాలినప్పటికీ, ఇంకా జిల్లాలో పెద్ద మొత్తంలో పంట అందుబాటులో ఉందని రైతులు చెబుతున్నారు. సరైన సమయంలో సరైన విధంగా మార్కెటింగ్ చేస్తే ఈసారి మామిడి రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశముందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతులు నాణ్యమైన కాయలను మాత్రమే ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తే చిత్తూరు మామిడి పేరు మరింత పెరుగుతుందని, దీర్ఘకాలంలో జిల్లాకు ఇంకా మంచి మార్కెట్ ఏర్పడుతుందని అధికారులు సూచిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *