20, మే 2026, బుధవారం

నేడు చిత్తూరు జిల్లాలో మెడికల్ షాపుల బంద్


నేడు చిత్తూరు జిల్లాలో మెడికల్ షాపుల బంద్

ఈ-ఫార్మసీలు, కార్పొరేట్ డిస్కౌంట్ విధానాలకు వ్యతిరేకంగా 

ప్రజారోగ్య రక్షణ కోసమే సమ్మె అంటున్న అసోసియేషన్ 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్  దేశవ్యాప్త పిలుపు మేరకు బుధవారం చిత్తూరు జిల్లాలోని అన్ని మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. జిల్లాలో సుమారు 900కు పైగా మెడికల్ షాపులు ఉండగా, చిత్తూరు పట్టణంలోనే 200కు పైగా దుకాణాలు బంద్‌లో పాల్గొననున్నట్లు చిత్తూరు జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. చిత్తూరు జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. నరేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కె. బాబు నాయుడు, కోశాధికారి రాజపసిద్ధి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం తమ ఉద్దేశం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి బంద్‌ల సమయంలో చిత్తూరు పట్టణంలో కనీసం ఒక మెడికల్ షాపును తెరిచి ఉంచి ప్రజలకు సేవలు అందించేవారమని, అయితే ఆ విషయంలో పలు సమస్యలు రావడంతో ఈసారి పూర్తిస్థాయిలో బంద్ పాటించనున్నట్లు తెలిపారు.

ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో మందులు అవసరమైతే తమను సంప్రదిస్తే అందుబాటులో ఉన్న మేరకు సహాయం చేస్తామని అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. ప్రజలు తమ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. దేశవ్యాప్తంగా జరుగనున్న ఈ సమ్మెను విజయవంతం చేయాలని చిత్తూరు పట్టణ కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాసు, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, కోశాధికారి చంద్రమోహన్ పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు ప్రధాన కారణం అక్రమ ఈ-ఫార్మసీల కార్యకలాపాలు, పెద్ద కార్పొరేట్ కంపెనీల అధిక డిస్కౌంట్ విధానాలు, చిన్న, మధ్య తరహా మెడికల్ షాపుల మనుగడపై ఏర్పడుతున్న ముప్పు అని కెమిస్టులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కెమిస్టులు, డ్రగ్గిస్టులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ప్రస్తుతం అమలవుతున్న విధానాల వల్ల వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ నాయకుల ప్రకారం ప్రస్తుతం ఆన్‌లైన్ ఫార్మసీలు నియంత్రణ లేకుండా విస్తరిస్తున్నాయి. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం, యాంటీబయాటిక్స్ వంటి మందులు ఎవరైనా సులభంగా పొందగలగడం, నకిలీ ప్రిస్క్రిప్షన్ల వినియోగం పెరగడం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. అలాగే మందుల నిల్వలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని తెలిపారు.

మందులు సాధారణ వస్తువులు కావని, అవి నేరుగా ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్నాయని కెమిస్టులు స్పష్టం చేస్తున్నారు. అర్హత కలిగిన వైద్యుడు సూచించిన మందులు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ద్వారా సరైన రోగికి చేరడం ప్రస్తుత వ్యవస్థ ముఖ్య లక్ష్యమని, ఆ వ్యవస్థ బలహీనపడితే ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ-ఫార్మసీల ద్వారా మందులు కొనుగోలు చేసే సమయంలో రోగులకు సరైన మార్గదర్శనం ఉండడం లేదని అసోసియేషన్ పేర్కొంటోంది. ఒక ఫార్మసిస్ట్ నేరుగా రోగితో మాట్లాడి మందుల మోతాదు, వాడే విధానం, జాగ్రత్తలు వివరించే అవకాశం ఆన్‌లైన్ వ్యవస్థలో ఉండదని చెబుతున్నారు. దీని వల్ల మందుల దుర్వినియోగం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యాంటీబయాటిక్స్‌ను అధికంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ మార్కెట్‌ను ఆక్రమిస్తున్నాయని, దీని వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కెమిస్టులు తెలిపారు. చిన్న వ్యాపారులు అద్దెలు, సిబ్బంది జీతాలు, విద్యుత్ చార్జీలు, లైసెన్సు ఫీజులు చెల్లిస్తూ వ్యాపారం కొనసాగించడం కష్టమవుతోందని చెప్పారు. ఒకవైపు భారీ పెట్టుబడులతో కార్పొరేట్ సంస్థలు మార్కెట్‌ను నియంత్రిస్తుండగా, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రాత్రింబవళ్లు సేవలు అందించే చిన్న మెడికల్ షాపులు మూతపడే పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2018లో జారీ చేసిన జీఎస్‌ఆర్ 817(ఈ) నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని, అలాగే కోవిడ్ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో తీసుకొచ్చిన జీఎస్‌ఆర్ 220(ఈ) నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన నిబంధనలు ఇప్పటికీ కొనసాగుతుండటంతో వాటి దుర్వినియోగం పెరుగుతోందని కెమిస్టులు ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

 పెద్ద కార్పొరేట్ కంపెనీలు అమలు చేస్తున్న అధిక డిస్కౌంట్ విధానాలపై ప్రభుత్వం నియంత్రణ తీసుకురావాలని కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో చిన్న మెడికల్ షాపులు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న మెడికల్ షాపులే ప్రజలకు ప్రధాన ఆధారం అని, అవి మూతపడితే అత్యవసర సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. బుధవారం జరగనున్న బంద్ కారణంగా జిల్లాలో ప్రజలు కొంత అసౌకర్యం ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ముందుగానే అవసరమైన మందులు కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. రోజువారీగా మందులు వాడే రోగులు మంగళవారం సాయంత్రానికల్లా అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని కెమిస్టులు సూచించారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంతమంది అసోసియేషన్ నాయకులు ఫోన్ ద్వారా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. అత్యవసర మందుల అవసరం ఉన్నవారికి వ్యక్తిగతంగా స్పందించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. ఈ సమ్మె తమ వ్యాపార ప్రయోజనాల కోసమే కాదని, ప్రజారోగ్య రక్షణ కోసం కూడా చేస్తున్న పోరాటమని కెమిస్టులు పేర్కొన్నారు. మందుల విక్రయంలో నియంత్రణలు తప్పనిసరిగా ఉండాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతో దేశవ్యాప్త సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి త్వరగా పరిష్కారం చూపాలని, లేకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *