1, జూన్ 2026, సోమవారం

జిల్లాలో పీఎంఏజీవై పథకం కింద రూ. 13.55 కోట్లతో అభివృద్ధి పనులు.

 జిల్లాలో పీఎంఏజీవై పథకం కింద రూ. 13.55 కోట్లతో అభివృద్ధి పనులు.

దళిత గ్రామాల రూపురేఖలు మార్చుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం

 437 అభివృద్ధి పనులలో  342 పనులు పూర్తి

మౌలిక వసతులు, విద్య, ఉపాధి, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా వెనుకబడిన దళిత వాడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (పీఎంఏజీవై) పథకం చిత్తూరు జిల్లాలో ఆశాజనక ఫలితాలను ఇస్తోంది. షెడ్యూల్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా జిల్లాలో వందలాది అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్య రంగాల్లో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను వెచ్చిస్తోంది. పీఎంఏజీవై పథకం కింద చిత్తూరు జిల్లాలో మొత్తం 437 అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. ఇందుకోసం రూ.13.19 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే 342 పనులు పూర్తి కాగా, మిగిలిన 95 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. పూర్తి చేసిన పనుల కోసం రూ.3.23 కోట్ల మేర వ్యయం చేశారు. ఇంకా కొనసాగుతున్న పనుల పూర్తి కోసం సుమారు రూ.4.68 కోట్ల నిధులు అవసరమని అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా జిల్లాలో ఈ పథకం అమలు తీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.

చిత్తూరు నియోజకవర్గంలో 14 దళితవాడలలో 2.8 కోట్ల రూపాయలతో 85 పనులు, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 29 దళిత వాడలలో 5.91 కోట్లతో 209 పనులు, కుప్పం నియోజకవర్గంలో ఐదు దళితవాడలో 1.02 కోట్ల రూపాయలతో 27 పనులు, నగరి నియోజకవర్గంలో ఐదు దళితవాడలో 1.04 కోట్ల రూపాయలతో 33 పనులు, పుంగనూరు నియోజకవర్గంలో ఒక దళితవాడలో 20.5 లక్షల రూపాయలతో ఏడు పనులు, పూతలపట్టు నియోజకవర్గం లో 12 దళితవాడలో 2.48 కోట్ల రూపాయలతో 76 పనులు ప్రతిపాదించారు. జిల్లా మొత్తం మీద 66 దళితవాడలో 13.55 కోట రూపాయల అంచనాలతో 437 పనులను చేపట్టారు. గ్రామీణ దళిత ప్రాంతాల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు అందని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ పథకం ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా తాగునీటి సమస్యలు, మురుగు కాలువల లేమి, సీసీ రోడ్ల కొరత, విద్యుత్ సౌకర్యాల లోపం, అంగన్‌వాడీ భవనాల కొరత వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని గ్రామాభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా మౌలిక వసతుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని పనులు జరుగుతున్నాయి.

పీఎంఏజీవై పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2009లో ప్రవేశపెట్టింది. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా దళిత గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉండటంతో వాటి పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను గుర్తించి వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఈ పథకం కింద గ్రామ ఎంపికకు కొన్ని ప్రత్యేక అర్హతలను నిర్దేశించారు. గ్రామ జనాభా కనీసం 500 మందికి పైగా ఉండాలి. అందులో షెడ్యూల్ కులాల జనాభా 40 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో 50 శాతానికి పైగా దళిత జనాభా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అర్హత సాధించిన గ్రామాలను ఎంపిక చేసి ఒక్కో గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు.

ఈ పథకం ద్వారా గ్రామాల్లో చేపడుతున్న పనులు ప్రజల దైనందిన జీవితాలకు నేరుగా ఉపయోగపడే విధంగా ఉంటున్నాయి. తాగునీటి ట్యాంకులు, పైప్‌లైన్లు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల మరమ్మతులు, విద్యుదీకరణ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడటంతో పాటు రవాణా సౌకర్యాలు కూడా పెరుగుతున్నాయి. దళిత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై కూడా ఈ పథకం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, స్వయం ఉపాధి అవకాశాలు, చిన్న పరిశ్రమల ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను అనుసంధానం చేయడం ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విద్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, మహిళా సాధికారత అంశాలపై కూడా ఈ పథకం ప్రభావం చూపుతోంది. చిత్తూరు జిల్లాలో పీఎంఏజీవై పథకం అమలు వల్ల గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి గణనీయంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గతంలో మురికివాడలుగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు సీసీ రోడ్లు, పారిశుధ్య సదుపాయాలు, తాగునీటి సౌకర్యాలు అందుబాటులోకి రావడం గ్రామీణ ప్రజల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. గ్రామాల్లో అభివృద్ధి పనులు కనిపించడంతో ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కూడా పెరుగుతోందని పేర్కొంటున్నారు.

అయితే ఇంకా 95 పనులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రారంభించిన కొన్ని నిర్మాణ పనులు నిధుల కొరత లేదా సాంకేతిక కారణాలతో నెమ్మదిగా సాగుతున్నాయని సమాచారం. పెండింగ్ పనుల పూర్తి కోసం అవసరమైన రూ.4.68 కోట్ల నిధులను త్వరగా విడుదల చేస్తే మరిన్ని గ్రామాల్లో అభివృద్ధి వేగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కేవలం నిర్మాణ పనులకే పరిమితం కాకుండా సామాజిక మార్పుకు కూడా దోహదపడుతోంది. దళిత వాడల్లో విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన పెరుగుతోంది. గ్రామాల్లో కమ్యూనిటీ వనరులు పెరగడంతో ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలకు అవసరమైన సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో పీఎంఏజీవై పథకం అమలు మరింత సమర్థవంతంగా కొనసాగితే దళిత గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో పూర్తయితే గ్రామీణ దళిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత గణనీయంగా తగ్గుతుందని, సామాజిక-ఆర్థిక అసమానతలు తగ్గించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ దళిత వాడల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పీఎంఏజీవై పథకం చిత్తూరు జిల్లాలో ఆశాజనక మార్పులకు నాంది పలుకుతోందని గ్రామీణ ప్రజలు చెబుతున్నారు. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తయితే దళిత గ్రామాలు నిజమైన అర్థంలో ఆదర్శ గ్రామాలుగా రూపాంతరం చెందుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *