24, మే 2026, ఆదివారం

పిల్లలే సంపదపై యాదమరిలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనకు రంగం సిద్ధం

పిల్లలే సంపదపై యాదమరిలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనకు రంగం సిద్ధం

తగ్గుతున్న జననాల రేటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆందోళన

మూడో బిడ్డకు రూ.30 వేలు.. నాలుగో బిడ్డకు రూ.40 వేల ప్రోత్సాహకం

భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి యువ జనాభానే బలం అంటున్న ప్రభుత్వం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న జననాల రేటు, భవిష్యత్తులో ఏర్పడే కార్మికుల కొరత, వృద్ధాప్య జనాభా పెరుగుదల వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పిల్లలే సంపద పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ పథకం కింద మూడవ బిడ్డ పుట్టిన కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం, నాలుగవ బిడ్డ పుట్టిన కుటుంబానికి రూ.40 వేల ప్రోత్సాహకాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు అయ్యాయి. వెబ్సైట్ కూడా సిద్ధమయింది. ఈ పథకానికి పిల్లలే సంపద అని పేరు పెట్టారు. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా యాదమరి పర్యటన సందర్భంగా లాంఛనంగా ప్రకటించనున్నారు.

దక్షిణ భారత రాష్ట్రాల్లో గత కొన్ని దశాబ్దాలుగా జననాల రేటు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణీకరణ, పెరుగుతున్న విద్యా స్థాయి, ఆలస్య వివాహాలు, చిన్న కుటుంబాలపై మొగ్గు వంటి కారణాలతో జనాభా పెరుగుదల తగ్గిపోతోందని ప్రభుత్వం గుర్తించింది. దీని ప్రభావం భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పలు సందర్భాల్లో జనాభా సమతుల్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో జననాల రేటు తగ్గిపోవడంతో ప్రస్తుతం తీవ్రమైన కార్మికుల కొరత, వృద్ధాప్య జనాభా పెరుగుదల, ఆర్థిక మందగమనం వంటి సమస్యలు తలెత్తాయని ఆయన ప్రస్తావించారు. ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన యువ జనాభా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అత్యంత కీలకం. పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగం, నిర్మాణ రంగం వంటి అన్ని రంగాలకు భవిష్యత్తులో తగిన శ్రామిక శక్తి అవసరం అవుతుంది. యువత సంఖ్య తగ్గిపోతే ఉత్పాదకత దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పిల్లలను భవిష్యత్ సంపదగా చూస్తూ పిల్లలే సంపద అనే భావనతో ఈ పథకాన్ని తీసుకొస్తోంది. ఈ పథకం కేవలం నగదు ప్రోత్సాహకాలకు మాత్రమే పరిమితం కాకుండా, సమగ్ర కుటుంబ సంక్షేమ దిశగా కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడవ బిడ్డకు ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.1000 పోషకాహార సహాయం అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదేవిధంగా మూడవ సంతానానికి 18 ఏళ్ల వయస్సు వరకు ప్రభుత్వ లేదా రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉచిత విద్య కల్పించే అంశాన్ని కూడా పరిశీలనలో ఉంచినట్లు సమాచారం.

మాతృ, శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రసూతి సెలవులను పెంచే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. మూడవ బిడ్డ పుట్టిన తర్వాత తల్లులకు అదనంగా 12 నెలల ప్రసూతి సెలవు, తండ్రులకు రెండు నెలల పితృత్వ సెలవు కల్పించే ప్రతిపాదనలు చర్చలో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ ఆరోగ్య భద్రత కోసం సమగ్ర ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. పిల్లలే సంపద కార్యక్రమాన్ని ప్రభుత్వం మూడు ప్రధాన స్తంభాల ఆధారంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. పోషణ, శిక్ష, సురక్ష అనే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. గర్భిణీ స్త్రీలు, చిన్నారులకు పోషకాహార భద్రత, పిల్లలకు నాణ్యమైన విద్య, కుటుంబాలకు ఆరోగ్య రక్షణ అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తల్లికి వందనం వంటి పథకాల ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. కొత్తగా తీసుకువస్తున్న పిల్లలే సంపద కార్యక్రమం ఆ పథకాలకు అనుసంధానంగా ఉండే అవకాశముంది. పిల్లల విద్య, ఆరోగ్యం, పోషకాహారంపై దీర్ఘకాలిక దృష్టితో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అధికారులు చెబుతున్నారు.

ప్రాథమిక అర్హతల ప్రకారం దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి. పథకం అమలులోకి వచ్చిన తర్వాత జన్మించిన మూడవ లేదా నాలుగవ బిడ్డలకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తించే అవకాశం ఉంది. శిశు జనన నమోదు తప్పనిసరి కావచ్చని సమాచారం. తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, నివాస ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు వంటి పత్రాలు అవసరం కావచ్చని తెలుస్తోంది. అయితే పూర్తి విధివిధానాలు, అర్హత నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియ, ఆన్‌లైన్ పోర్టల్, నగదు బదిలీ విధానం వంటి అంశాలపై ప్రభుత్వం ఇంకా అధికారిక మార్గదర్శకాలను విడుదల చేయలేదు. యాదమరి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. తగ్గుతున్న జననాల రేటుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న పిల్లలే సంపద కార్యక్రమం జాతీయస్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *