మండుతున్న ఎండలకు భారీగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు
ట్రాన్స్ఫార్మర్ల పునరుద్ధరణను పట్టించుకోని అధికారులు
విద్యుత్ అంతరాలు, లో ఓల్టేజితో రైతాంగం సతమతం
సీఎం జిల్లాలో అమలుకాని తొమ్మిది గంటల ఉచిత విద్యుత్
అద్వాన్నంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ చిత్తూరు జిల్లాలో విద్యుత్ సంక్షోభం తీవ్రమవుతోంది. భూగర్భ జలాలు పడిపోవడంతో రైతులు మోటార్లపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోలేక విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు భారీ ఎత్తున కాలిపోతుండగా, అవి సకాలంలో పునరుద్ధరించకపోవడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. పంటలకు నీరు అందక ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు పగటిపూట నిరంతరాయంగా తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నా, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ హామీ అమర జరగడం లేదు. అడుగడుగునా విద్యుత్ అంతరాలతో రైతాంగం కుదేలు అవుతుంది. అధికారికంగా ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్న, వాస్తవంగా అయిదారు గంటలు కూడా రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా కావడం లేదు. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో పంటలను కాపాడుకోవడం రైతులకు సవాల్ గా మారింది.
జిల్లాలో ఎక్కడ చూసినా విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మండుతున్న ఎండలు, అధిక లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు తరచూ దగ్ధమవుతున్నాయి. అయితే కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను వెంటనే మార్చాల్సిన బాధ్యత ఉన్న ట్రాన్స్కో అధికారులు సకాలంలో స్పందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రైతులే సొంత ఖర్చులతో ట్రాన్స్ఫార్మర్లను తీసుకువచ్చి, మరమ్మతులు చేయించి తిరిగి అమర్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రక్రియలో రోజుల తరబడి ఆలస్యం జరుగుతుండటంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో సుమారు 1800 వరకు విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త కనెక్షన్ల కోసం రైతులు ట్రాన్స్కో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండా, లంచాలు ఇచ్చిన వారికి ముందుగా కనెక్షన్లు ఇస్తున్నారనే ఆరోపణలు పలుచోట్ల వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కొంతమంది అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని రైతులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పగటిపూట నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించినప్పటికీ, చిత్తూరు జిల్లాలో ఆ హామీ అమలుకావడం లేదు. వాస్తవానికి రోజుకు 7 గంటలకే విద్యుత్ సరఫరా పరిమితమవుతోంది. అంతేకాకుండా ఆ 7 గంటల సరఫరా కూడా అంతరాయం లేకుండా ఉండటం లేదు. తరచూ విద్యుత్ అంతరాలు ఏర్పడుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటకు ఒకటి రెండు సార్లు విద్యుత్ సరఫరా నిలిపివేయడం, మళ్లీ 10 నుంచి 20 నిమిషాల తర్వాత పునరుద్ధరించడం సాధారణంగా మారింది. ఈ అంతరాల వల్ల మోటార్లు సక్రమంగా పనిచేయకపోవడం, నీటి సరఫరా అంతరాయం కలగడం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో రోజుకు 6 గంటలకే విద్యుత్ నిలిపివేయడం జరుగుతుండగా, వాస్తవానికి 5 గంటలపాటు కూడా సరైన విద్యుత్ అందడం లేదని రైతులు చెబుతున్నారు. లో వోల్టేజ్ సమస్య మరింత తీవ్రంగా మారింది. విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ, వోల్టేజ్ తక్కువగా ఉండటంతో మోటార్లు పనిచేయకపోవడం సాధారణంగా మారింది. దీని కారణంగా రైతులు రాత్రింబవళ్లు పొలాల్లోనే ఉండి విద్యుత్ కోసం వేచి చూడాల్సి వస్తోంది. విద్యుత్ వచ్చినప్పుడు వెంటనే నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిపై అధికారులను ప్రశ్నిస్తే లైన్ ట్రిప్ అయింది, మెయిన్ సప్లై నిలిచింది వంటి సాకులు చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వారు అంటున్నారు. భూగర్భ జలాలు పడిపోవడంతో జిల్లాలో మోటార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. అయితే అవసరమైన స్థాయిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో అధికారులు ఇష్టానుసారంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మండుతున్న ఎండలకు తోడు ట్రాన్స్ఫార్మర్లు వరుసగా కాలిపోవడం పరిస్థితిని మరింత విషమం చేస్తోంది. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను వెంటనే పునరుద్ధరించకపోవడం వల్ల రైతులు రోజులు గడపాల్సి వస్తోంది. పంటలకు నీరు అందక ఎండిపోవడం, పెట్టుబడులు నష్టపోవడం రైతులకు పెద్ద దెబ్బగా మారుతోంది. విద్యుత్ సరఫరాలో అంతరాలు, లో వోల్టేజ్ సమస్య, భూగర్భ జలాల కొరత అన్నీ కలిసి రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన పంటలు కాపాడుకోవడానికి రైతులు ఆత్మనిర్భరంగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ట్రాన్స్కో ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లను తక్షణమే పునరుద్ధరించడం, పెండింగ్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయడం, విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా 9 గంటలు అందించడం వంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే ఈ సంక్షోభం మరింత తీవ్రమై వ్యవసాయ రంగం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

