గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్‌లకు గ్రీన్ సిగ్నల్
గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్‌లకు గ్రీన్ సిగ్నల్
పన్ను రశీదు ఉంటే చాలు.. ఇక రిజిస్ట్రేషన్ సులువు
గ్రామస్తులకు భారీ ఊరట కలిగించిన రాష్ట్ర ప్రభుత్వం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్‌లకు సంబంధించిన దశాబ్దాల సమస్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పరిష్కారం చూపింది. గ్రామ కంఠం భూములు, పాత ఇళ్లు, వారసత్వంగా వచ్చిన స్థలాల రిజిస్ట్రేషన్‌లకు ఉన్న చిక్కుముడులను తొలగిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటివరకు డాక్యుమెంట్లు లేక, రెవెన్యూ రికార్డుల్లో స్పష్టత లేక వేలాది మంది గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, తాజా నిర్ణయంతో వారికి పెద్ద ఊరట లభించింది. ఇకపై గ్రామ కంఠం భూములు వెబ్‌లాండ్ రికార్డుల్లో నమోదై ఉంటే, అవి 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గతంలో ఇలాంటి భూముల విషయంలో రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మధ్య ప్రజలు నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ సమస్యలకు చెక్ పడనుంది.
గ్రామాల్లో చాలాకాలంగా నివాసాలుగా ఉన్న ప్రాంతాలను సాధారణంగా గ్రామ కంఠం భూములుగా పరిగణిస్తారు. చాలా చోట్ల ఈ భూములకు పాత దస్తావేజులు లేకపోవడం, వారసత్వంగా తరతరాలుగా నివసిస్తున్నప్పటికీ సరైన రికార్డులు అందుబాటులో లేకపోవడం వల్ల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయేవి. పైగా కొన్ని సర్వే నంబర్లు పొరపాటున 22 ఏ నిషేధిత జాబితాలో చేరడంతో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్‌ల కోసం లింక్ డాక్యుమెంట్లు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ లేదా స్థానిక సంస్థలకు చెల్లించిన ఇంటి పన్ను, ఆస్తి పన్ను రశీదులను ఆధారంగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పాత దస్తావేజులు అందుబాటులో లేని వారు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించినా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం డాక్యుమెంట్లు లేవనే కారణంతో రిజిస్ట్రేషన్లను తిరస్కరించరాదని సూచించింది.
ఇప్పటివరకు గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్‌లకు రెవెన్యూ అధికారుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి వచ్చేది. దీంతో ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ అవసరాన్ని కూడా ప్రభుత్వం తొలగించింది. ప్రత్యేక అనుమతులు లేకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చని తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామాల్లోని వేలాది కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా పాత ఇళ్లు, వారసత్వ స్థలాలు ఉన్న కుటుంబాలు తమ ఆస్తులను అధికారికంగా రిజిస్టర్ చేసుకునే అవకాశం లభించింది. ఇప్పటివరకు డాక్యుమెంట్ల సమస్యల కారణంగా అమ్మకాలు జరగక, బ్యాంకు రుణాలు పొందలేక ఇబ్బందులు పడిన వారికి ఇది ఊరటనివ్వనుంది. గ్రామాల్లో ఎక్కువగా గ్రామ కంఠం భూములే ఉండటం విశేషం. చాలా మంది దశాబ్దాలుగా ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ వారి పేర్లపై సరైన రిజిస్ట్రేషన్ లేకపోవడంతో భవిష్యత్తులో వివాదాలు తలెత్తే పరిస్థితులు ఉండేవి. కొత్త మార్గదర్శకాలతో ఆ సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామీణ ప్రజలు స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందని చెబుతున్నారు. గ్రామ కంఠం భూముల క్రయవిక్రయాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా వేగం పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఈ సడలింపులను దుర్వినియోగం చేయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. నిజమైన వారసత్వ హక్కుదారులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా స్పష్టమైన పరిశీలన జరగాలని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్‌లపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత ప్రజలకు భారీ ఊరట కలిగించిందనే చెప్పాలి. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడంతో గ్రామస్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

