లోకేష్ ప్రకటనతో మహిళా లోకంలో ఆనందోత్సాహాలు
లోకేష్ ప్రకటనతో మహిళా లోకంలో ఆనందోత్సాహాలు
2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ప్రకటించడంపై హర్షం
మహిళా సాధికారతలో తెలుగుదేశం పార్టీ మరో చారిత్రాత్మక అడుగు
రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించనున్న పార్టీ
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
రానున్న 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం టికెట్లు కేటాయిస్తామని నారా లోకేష్ మహానాడు వేదికగా ప్రకటించడంతో మహిళా లోకంలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలను రాజకీయాల్లో మరింత భాగస్వామ్యం చేయాలన్న తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని మహిళా సంఘాలు, మహిళా నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం మహిళల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇది మా సంకల్పం... మా బాధ్యత... మా కట్టుబాటు అంటూ లోకేష్ చేసిన ప్రకటన మహానాడు వేదికను మారుమోగించింది. మహిళలు కేవలం ఓటర్లుగానే కాకుండా నిర్ణయాలు తీసుకునే నాయకులుగా ఎదగాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మరింత మంది మహిళా శాసనసభ్యులు, మహిళా నాయకులు, విధాన నిర్ణేతలు అవసరమని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో మహిళలకు ఆస్తి హక్కు కల్పించే చట్టాన్ని తీసుకురావడం దేశ రాజకీయ చరిత్రలోనే సంచలనాత్మక నిర్ణయంగా నిలిచింది. కుటుంబ ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న ఎన్టీఆర్ నిర్ణయం మహిళా సాధికారతకు బలమైన పునాది వేసిందని మహిళా సంఘాల నాయకులు చెబుతున్నారు. అలాగే మహిళల ఉన్నత విద్యాభివృద్ధి కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం వేలాది మంది మహిళలకు విద్యావకాశాలు కల్పిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది. మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ మహిళా విద్యకు ఇచ్చిన ప్రాధాన్యం స్పష్టమైందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టిన డ్వాక్రా సంఘాలు మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపు అలవాట్లు పెంపొందడంతో పాటు మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి కుటుంబ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. దీపం పథకం ద్వారా పేద మహిళలకు వంటగ్యాస్ కనెక్షన్లు అందించడం కూడా మహిళా సంక్షేమంలో కీలక ఘట్టంగా నిలిచింది. వంట పొగ సమస్య నుంచి గ్రామీణ మహిళలకు ఉపశమనం కలిగించడంలో ఈ పథకం ముఖ్య పాత్ర పోషించింది. ప్రస్తుతం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి కార్యక్రమాలు కూడా మహిళా సంక్షేమ దిశగా ముందడుగుగా భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా వేలాది మంది మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. గ్రామస్థాయి నుంచి మహిళలను నాయకత్వ స్థానాలకు తీసుకువచ్చిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక గుర్తింపు పొందిందని చెబుతున్నారు.
ఇప్పుడు అదే ఆలోచనను శాసనసభ ఎన్నికల స్థాయికి తీసుకువస్తూ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని లోకేష్ ప్రకటించడం మహిళా నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 శాసనసభ స్థానాలు ఉండగా అందులో ఐదు స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుత చిత్తూరు జిల్లాలో కూడా కనీసం రెండు స్థానాల్లో మహిళలకు అవకాశం దక్కవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రకటనతో మహిళా నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తమకూ అవకాశం లభిస్తుందన్న ఆశాభావంతో పలువురు మహిళా నేతలు రాజకీయంగా చురుకుగా మారుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళా కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మహిళలను రాజకీయాల్లో మరింత శక్తివంతం చేయాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

