18, మే 2026, సోమవారం

నేరస్తులతో సహవాసం నేరాలలో భాగస్వామ్యం

నేరస్తులతో సహవాసం  నేరాలలో భాగస్వామ్యం

చిత్తూరు పోలీస్ శాఖలో వరుస వివాదాలు

దొంగనోట్లు.. బెట్టింగ్ మామూళ్లు.. లైంగిక వేధింపులు.. బంగారం మాయం కేసులు

సస్పెన్షన్లు, బదిలీలు, అరెస్టులతో ఉలిక్కిపడ్డ జిల్లా పోలీస్ విభాగం

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలే వరుస వివాదాల్లో చిక్కుకోవడం చిత్తూరు జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లా ఉన్నతాధికారులు నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ, కిందిస్థాయిలో కొంతమంది అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొంగనోట్ల ముఠాలతో చేతులు కలపడం నుంచి క్రికెట్ బెట్టింగ్ మామూళ్లు, లైంగిక వేధింపులు, అక్రమ వసూళ్లు, రికవరీ చేసిన బంగారు ఆభరణాల మాయం వరకు వరుస ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.

ఇటీవల గంగాధర నెల్లూరు మండలంలో వెలుగులోకి వచ్చిన దొంగనోట్ల కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడుకు చెందిన వ్యాపారులను “రూ.10 లక్షలు ఇస్తే రూ.1 కోటి నకిలీ నోట్లు ఇస్తాం” అంటూ వలలో వేసుకుని డబ్బులు దోచుకునేందుకు ముఠా పక్కా స్కెచ్ వేసింది. ఈ కేసులో చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్ఐ లోకనాథం, ఏఆర్ కానిస్టేబుల్ రవి పేర్లు బయటపడటం పోలీస్ శాఖను షాక్‌కు గురిచేసింది. గంగాధర నెల్లూరు మండలంలోని బట్టుకండ్రిగ డంపింగ్ యార్డు వద్ద జరిగిన ఈ వ్యవహారంలో స్థానిక నేరస్తులతో కలిసి పోలీసులు ఫేక్ రైడ్ నిర్వహించినట్లు విచారణలో తేలింది. ఖాకీ యూనిఫాంలో వెళ్లిన ఏఎస్ఐ, కానిస్టేబుల్ దొంగనోట్ల కేసు అంటూ తమిళనాడు వ్యాపారులను బెదిరించి నగదు లాక్కునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకుని ఇద్దరు పోలీసులను అరెస్టు చేశారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

మరోవైపు చిత్తూరు వన్‌టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహేశ్వర  కూడా క్రికెట్ బెట్టింగ్ ముఠాలతో సంబంధాల ఆరోపణల్లో చిక్కుకుని సస్పెండ్ అయ్యారు. ఐపీఎల్ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేయడం, కేసుల నుంచి నిందితులను తప్పించడం, ప్రజలను బెదిరించి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ప్రత్యేక విచారణ చేపట్టారు. విచారణలో ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లభించడంతో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.

చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఎస్ఐ మల్లికార్జున కూడా వివాదంలో చిక్కుకున్నారు. దీపావళి సందర్భంగా వ్యాపారుల నుంచి ఉచితంగా టపాసులు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు రావడంతో బాధితుడు ఆడియో రికార్డును జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపినట్లు తెలిసింది. విచారణ అనంతరం ఎస్పీ మల్లికార్జునను సస్పెండ్ చేశారు.

బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో ఘటన పోలీస్ శాఖను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. భర్తతో కుటుంబ కలహాల నేపథ్యంలో రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించిన ఒక వివాహితను కానిస్టేబుల్ ఉమాశంకర్, హోంగార్డు కిరణ్ వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఇదివరకు చిత్తూరు వన్‌టౌన్ సీఐగా పనిచేసిన జయరాం నాయక్‌పై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. రాయచోటి ప్రాంతానికి చెందిన దొంగల ముఠా నుంచి రికవరీ చేసిన బంగారు ఆభరణాల్లో దాదాపు ఒక కిలో వరకు మాయం చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందడంతో విచారణ ప్రారంభమైంది. అనంతరం జయరాం నాయక్‌ను విఆర్‌కు పంపించారు. రికవరీ చేసిన బంగారం గల్లంతవడం అప్పట్లో సంచలనంగా మారింది.

పూతలపట్టు ఎస్ఐగా పనిచేసిన హరిప్రసాద్‌పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేయడం మరో వివాదంగా మారింది. క్రిష్ణగిరికి చెందిన దొంగల ముఠా మహిళా సభ్యులను వేధించారనే ఆరోపణలతో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం హరిప్రసాద్‌ను బదిలీ చేసి విఆర్‌కు పంపించారు.

ఈ వరుస ఘటనలతో చిత్తూరు జిల్లా పోలీస్ శాఖలో అవినీతి, అక్రమాలు, క్రమశిక్షణ లేమి పెరుగుతోందనే విమర్శలు బలపడుతున్నాయి. కొంతమంది పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై భూ అక్రమాలు, బెట్టింగ్, దొంగతనాలు, అక్రమ వసూళ్లలో భాగస్వామ్యం అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ మాత్రం అవినీతిపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఎంత పెద్ద అధికారి అయినా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై సస్పెన్షన్, బదిలీ చర్యలు తీసుకోవడం శాఖలో చర్చనీయాంశమైంది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *