చిత్తూరు మీదుగా మరో డైలీ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్
చిత్తూరు మీదుగా మరో డైలీ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్
గుంటూరు తిరుపతి రైలును తిరుచ్చిరాపల్లి వరకు పొడిగింపు
గోల్డెన్ టెంపుల్, తిరువణ్ణామలై, శ్రీరంగం భక్తులకు ఊరట
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
చిత్తూరు జిల్లా కేంద్రానికి మరో కీలక రైల్వే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం 17261/17262 నంబర్లతో నడుస్తున్న గుంటూరు–తిరుపతి డైలీ ఎక్స్‌ప్రెస్ రైలును తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి వరకు పొడిగిస్తూ భారతీయ రైల్వే శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రైల్వే బోర్డు మే 8వ తేదీన ఉత్తర్వులు విడుదల చేయడంతో రాయలసీమ, కోస్తా ప్రాంతాల ప్రయాణికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే సంయుక్త ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన రైల్వే బోర్డు, ప్రస్తుతం తిరుపతి వరకు నడుస్తున్న ఈ రైలును రాయగడ గుంటూరు ఎక్స్‌ప్రెస్‌తో అనుసంధానం చేస్తూ తిరుచ్చిరాపల్లి వరకు పొడిగించనున్నట్లు వెల్లడించింది. చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం మీదుగా ఈ రైలు ప్రయాణించనుండటం ప్రత్యేకతగా నిలిచింది.
ప్రస్తుతం గుంటూరులో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరే 17261 నెంబర్ గుంటూరు తిరుపతి ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు ఉదయం 4 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 4.05 గంటలకు బయలుదేరి కాట్పాడికి ఉదయం 7.10 గంటలకు చేరుకుని, 7.15 గంటలకు బయలుదేరుతుంది. అనంతరం వెల్లూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, విరుధాచలం, శ్రీరంగం మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 2 గంటలకు తిరుచ్చిరాపల్లికి చేరుకోనుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 17262 తిరుచ్చిరాపల్లి గుంటూరు ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4 గంటలకు తిరుచ్చిరాపల్లి నుంచి బయలుదేరి రాత్రి 9.25 గంటలకు కాట్పాడికి చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.30 గంటలకు బయలుదేరి రాత్రి 11.40 గంటలకు తిరుపతికి చేరుకుని, 11.45 గంటలకు తిరిగి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.20 గంటలకు గుంటూరుకు చేరుకోనుంది. పొడిగించిన మార్గంలో పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు కాంటోన్మెంట్, ఆరణి రోడ్, పోలూరు, తిరువణ్ణామలై, తిరుక్కోయిలూర్, విల్లుపురం, విరుధాచలం, అరియలూరు, శ్రీరంగం వంటి ప్రధాన స్టేషన్లలో వాణిజ్య స్టాపులు ఉండనున్నాయి. దీంతో చిత్తూరు జిల్లాకు తమిళనాడులోని పలు ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రాలతో నేరుగా రైలు అనుసంధానం మరింత బలోపేతం కానుంది.
ఈ రైలు పొడిగింపుతో గుంటూరు, నంద్యాల, ప్రొద్దుటూరు, కడప ప్రాంతాల నుంచి తిరుమల, కాణిపాకం వినాయక స్వామి ఆలయం, వెల్లూరులోని శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం, శ్రీరంగం రంగనాథస్వామి ఆలయాలకు వెళ్లే భక్తులకు ఎంతో సౌలభ్యం కలగనుంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతాలకు వెళ్లేందుకు పలుమార్లు రైళ్లు మారాల్సి వచ్చేదని, ఇకపై నేరుగా ప్రయాణించే అవకాశం లభించనుందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ప్రజలకు కూడా ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, భక్తులు తమిళనాడులోని పలు నగరాలకు సులభంగా చేరుకునే అవకాశం లభించనుంది. చిత్తూరు రైల్వే స్టేషన్‌కు మరిన్ని రైలు సౌకర్యాలు కల్పించాలని చాలా కాలంగా ప్రజలు కోరుతుండగా, ఈ నిర్ణయం ఆ దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ రైలు పొడిగింపును వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని రైల్వే బోర్డు దక్షిణ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే ప్రారంభ ప్రత్యేక రైలును నడిపించి అనంతరం రెగ్యులర్ సర్వీసుతో అనుసంధానం చేయాలని సూచించింది. ఈ కొత్త రైలుతో చిత్తూరు జిల్లాకు దక్షిణ భారత రైల్వే కనెక్టివిటీ మరింత విస్తరించనుందని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

