కోచింగ్ సెంటర్ల నియంత్రణపై ప్రభుత్వ దృష్టి
మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు
పాటించకుంటే అనుమతులు రద్దుకు హెచ్చరిక
సీసీ కెమెరాలు, మానసిక నిపుణులు ఉండాలి
సెలవు రోజుల్లో కోచింగ్ సెంటర్లు నడపరాదు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
అస్తవ్యస్తంగా నడుస్తున్న కోచింగ్ సెంటర్లను గాడిలో పెట్టడానికి, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం దృష్టిని సారించింది. కోచింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం ఇటీవల కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. రోజుకు ఐదు గంటలకే శిక్షణ పరిమితం చేయడం, ఆదివారాలు కోచింగ్ నిషేధం, ఫీజు రీఫండ్ విధానం, మానసిక నిపుణుల నియామకం వంటి పలు కీలక నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. అయితే జిల్లాలో ఈ నిబంధనల అమలు స్థితి పరిశీలిస్తే, వాస్తవ పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఐదు నిబంధనలు పాటించకుంటే కోచింగ్ సెంటర్లకు తొలిత జరిమానా విధిస్తారు. అప్పటికే వసతులు మెరుగుపరచకుంటే కోచింగ్ సెంటర్ల అనుమతులను రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం సుమారు 180కు పైగా కోచింగ్ సెంటర్లు నమోదు అయ్యాయి. ఇవి ప్రధానంగా చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి, బంగారుపాలెం, వీకోట వంటి పట్టణాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే అనధికారికంగా నడుస్తున్న కోచింగ్ సెంటర్ల సంఖ్య దీనికంటే ఎక్కువగానే ఉన్నట్లు అంచనా. విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రకారం కనీసం 250కి పైగా సెంటర్లు అనుమతులు లేకుండా లేదా తాత్కాలిక అనుమతులతో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం కేంద్రాల్లో ప్రభుత్వం పేర్కొన్న 10 నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నవి చాలా తక్కువే. ప్రాథమిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు కలిగి ఉన్నవి కేవలం 20 నుంచి 25 శాతం వరకు మాత్రమే ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తున్న కోచింగ్ సెంటర్లలో నిబంధనల అమలు మరింత వెనుకబడి ఉంది. జిల్లాలో పేరున్న కొన్ని ప్రముఖ కోచింగ్ కేంద్రాలు మాత్రమే కొంతవరకు నిబంధనలు పాటిస్తున్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో అన్ని మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వడం కష్టం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఫీజు రీఫండ్ విధానం అమలు చేయడం వంటి అంశాల్లో కొంత పురోగతి కనిపిస్తున్నప్పటికీ, మానసిక నిపుణుల నియామకం, విద్యార్థులకు తగిన స్థలం కేటాయించడం వంటి అంశాల్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా జిల్లాలోని కోచింగ్ సెంటర్లలో కనిపిస్తున్న ప్రధాన లోపాలు పలు అంశాల్లో ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులపై అధిక ఒత్తిడి, రోజుకు ఐదు గంటలకంటే ఎక్కువ శిక్షణ ఇవ్వడం, సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహించడం వంటి చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కొందరు నిర్వాహకులు విద్యార్థుల ర్యాంకులను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా పోటీ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఇది విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైన పేర్కొన్న 10 నిబంధనల్లో అమలులో ప్రధానంగా నిర్లక్ష్యం వహిస్తున్న అంశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మానసిక నిపుణుల నియామకం దాదాపు ఎక్కడా కనిపించడం లేదు. ఫీజు రీఫండ్ విధానం అమలు విషయంలో కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల ఏర్పాటు, టెర్రస్‌లకు ప్రవేశం నిరోధించడం వంటి భద్రతా చర్యలు చాలా కేంద్రాల్లో అమలులో లేవు. అలాగే ప్రతి విద్యార్థికి చదరపు మీటరు స్థలం కేటాయించడం కూడా చాలా చోట్ల పాటించడంలేదు. ఇక సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో కూడా పూర్తిస్థాయి అమలు కనిపించడం లేదు. కొందరు కేంద్రాల్లో కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవడం, లేదా కేవలం పేరుకే ఏర్పాటు చేయడం వంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే స్కూల్, కాలేజీ సమయాల్లో కోచింగ్ ఇవ్వకూడదన్న నిబంధనను కూడా కొందరు నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు మూడు నెలల గడువు ఇచ్చిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ గడువులోపల నిబంధనలు పాటించని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మొదటి తప్పుకు జరిమానా, రెండోసారి రెట్టింపు జరిమానా, మూడోసారి అనుమతుల రద్దు వంటి చర్యలు అమల్లోకి రానున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కోచింగ్ సెంటర్లపై నియంత్రణ అవసరమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కేవలం మార్కులు, ర్యాంకుల కోసం కాకుండా విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కోచింగ్ వ్యవస్థ ఉండాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు సరైన దిశలో ఉన్నప్పటికీ, వాటి అమలులో నిర్లక్ష్యం కొనసాగితే ఆశించిన ఫలితాలు సాధ్యం కావని స్పష్టమవుతోంది.

