మామిడి బోర్డు కోసం జిల్లా రైతుల ఎదురుచూపులు
మామిడి బోర్డు కోసం జిల్లా రైతుల ఎదురుచూపులు
అమలకు నోచుకోని తొమ్మిది గంటల నిరంతర విద్యుత్తు
నత్తనడక నడుస్తున్న చిత్తూరు తాగునీటి ప్రాజెక్టు పనులు
ప్రభుత్వ ఆమోదానికి నోచుకోని చిత్తూరు వాటర్ గ్రేడ్ ప్రాజెక్టు
నేడే చంద్రబాబు చిత్తూరు జిల్లా యాదమరి రాక
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)
చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతు సంఘాలు, పాడి రైతులు, యువజన సంఘాలు తమ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నుంచి నిర్దిష్టమైన హామీ లభిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్య, సాగునీటి కొరత, మామిడి రైతుల ఆవేదన, పాడి రైతుల ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. చిత్తూరు జిల్లాలో మామిడిను ఏర్పాటు ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి హామీ హామీగానే మిగిలిపోయింది. రైతులకు పగటిపూట నిరంతరాయంగా తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా ఇస్తామన్న హామీ జిల్లాలో అమలుకు నోచుకోలేదు. కృష్ణా జలాలతో చిత్తూరు జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదము లభించలేదు. అడవిపల్లి నుండి చిత్తూరు కార్పొరేషన్ కు తాగునీటి పనులు నత్తనడకన నడుస్తున్నాయి. చిత్తూరు కార్పొరేషన్ లో రెండు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేసే పరిస్థితి నెలకొంది. వేసవి కాలంలో పశుగ్రాసం కొరత కారణంగా పాడి ఆవుల పెంపకం కష్టం అవుతోంది.
జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా పేరుగాంచిన మామిడి పంట గత ఏడాది రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో వేలాది మంది రైతులు అప్పుల పాలయ్యారు. మామిడి పల్ప్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేసిన పంటకు సంబంధించిన బిల్లులను ఇప్పటివరకు పూర్తిగా చెల్లించకపోవడం రైతుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. మరోవైపు కొత్త మామిడి సీజన్ ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు కనీస మద్దతు ధర ప్రకటించలేదు. దీంతో ఈ ఏడాది కూడా రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నో ఏళ్లుగా చిత్తూరు జిల్లా రైతులు కోరుతున్న మామిడి బోర్డు ఏర్పాటు అంశం ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడాన్ని రైతు సంఘాలు ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. చిత్తూరు పట్టణ ప్రజలను ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్య కూడా సీఎం దృష్టికి వెళ్లనుంది. అడవిపల్లె నుంచి చిత్తూరుకు తాగునీరు అందించే ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతుండటంతో వేసవి కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పట్టణంలో రెండు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు సరఫరా చేస్తున్నారని, అది కూడా చాలాసార్లు సక్రమంగా అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కృష్ణా జలాలను మళ్లించి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికే సర్వే పూర్తి చేసి సుమారు రూ.7 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వ ఆమోదానికి పంపినప్పటికీ ఇంకా అనుమతులు రాకపోవడం జిల్లా ప్రజల్లో నిరాశ కలిగిస్తోంది. హంద్రీ-నీవా, గలేరు-నగరి జలాలను పూర్తి స్థాయిలో జిల్లాకు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రకటించినట్లుగా తొమ్మిది గంటల నిరంతర పగటి పూట విద్యుత్ సరఫరా జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఏడు గంటలే సరఫరా చేస్తున్నారని, అందులో కూడా లో ఓల్టేజ్, తరచూ విద్యుత్ అంతరాయాల వల్ల ఐదు గంటలపాటు కూడా మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని చెబుతున్నారు. విద్యుత్ కోతల కారణంగా బోర్లు పనిచేయక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా ప్రజల ప్రధాన జీవనాధారమైన పాడి పరిశ్రమ కూడా ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. వేసవి తీవ్రత కారణంగా చెరువులు ఎండిపోవడంతో పశువులకు తాగునీరు, పశుగ్రాసం దొరకడం లేదు. పాల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని పాడి రైతులు వాపోతున్నారు. జిల్లా నీటి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మినీ గోకులం” షెడ్ల నిర్మాణాలకు ఏడాది గడిచినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా పూతలపట్టు నియోజకవర్గంలో తాగునీటి సమస్య, గ్రామీణ రహదారుల దుస్థితి, డ్రైనేజీ సమస్యలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి వంటి అంశాలు కూడా ప్రధానంగా వినిపించనున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు లేక బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదమరి మండలంలో తాగునీటి కొరత, చెడిపోయిన రహదారులు, సాగునీటి కాలువల శుభ్రత లేకపోవడం, ఉపాధి హామీ పనులు తగిన స్థాయిలో లేకపోవడం వంటి సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, పట్టు పత్రాల మంజూరు, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలపై కూడా ప్రజలు వినతిపత్రాలు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వివిధ రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు వినతిపత్రాలు అందజేయనున్నారు. యాదమరిలో ప్రకటించే అభివృద్ధి కార్యక్రమాలు కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు విని, చిత్తూరు జిల్లా అభివృద్ధికి స్పష్టమైన హామీలు ఇవ్వాలని జిల్లా ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

