15, మే 2026, శుక్రవారం

జిల్లాలో 8 గ్రామాలలో బోర్ల తవ్వకంపై నిషేధం

జిల్లాలో 8 గ్రామాలలో బోర్ల తవ్వకంపై నిషేధం

ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ గ్రామాలుగా ప్రకటించిన ప్రభుత్వం

కుప్పం మండలంలో ఐదు గ్రామాలు – తాగునీటి బోర్లకు మాత్రమే అనుమతి

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు):

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాల మట్టాలు ఆందోళనకరంగా పడిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని మూడు మండలాలకు చెందిన 8 గ్రామాలను “ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ విలేజెస్”గా ప్రకటిస్తూ వ్యవసాయ బోర్ల తవ్వకాలపై నిషేధం విధించింది. ఆంధ్రప్రదేశ్ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్–2002 ప్రకారం ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన జి.ఓ.ఎంఎస్ నెం.70 ప్రకారం భూగర్భ జలాల వినియోగం రీఛార్జ్ స్థాయిని మించి పోవడంతో ఈ గ్రామాలను ప్రమాదకర జాబితాలో చేర్చారు. ఈ జాబితా ప్రకారం కుప్పం మండలంలో ఐదు గ్రామాలు, పెద్దపంజాణి మండలంలో రెండు గ్రామాలు, గుడిపల్లి మండలంలో ఒక గ్రామం వస్తాయి. ఈ గ్రామాలలో ఒక సంవత్సరం పాటు వ్యవసాయ బోర్ల తవ్వకాలపై నిషేధం కొనసాగుతుంది.

చిత్తూరు జిల్లా ఎప్పటినుంచో వర్షాభావ పరిస్థితులకు నిలయంగా ఉంది. ముఖ్యంగా పలమనేరు, కుప్పం, గుడిపల్లి, పెద్దపంజాణి, రామకుప్పం ప్రాంతాలు కరువు ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. గత రెండు దశాబ్దాలుగా వరుసగా తక్కువ వర్షపాతం నమోదవుతూ రావడం, వ్యవసాయంలో బోరు నీటిపై అధిక ఆధారపడటం, నీటి వినియోగంలో నియంత్రణ లేకపోవడం వల్ల భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు 150 నుండి 200 అడుగుల లోతులో లభించే నీరు ప్రస్తుతం 800 నుంచి 1200 అడుగుల వరకు తవ్వినా అందని పరిస్థితి ఏర్పడింది. అనేక గ్రామాల్లో రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి బోర్లు వేయించినా నీరు అందక అప్పులపాలవుతున్నారు. జిల్లాలో ప్రతి ఏడాది వందలాది బోర్లు విఫలమవుతున్నాయి. ముఖ్యంగా టమోటా, మామిడి, పూల తోటలు, కూరగాయల సాగు అధికంగా ఉండే ప్రాంతాల్లో నీటి వినియోగం మరింత పెరిగింది. భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, భూమిలోకి వర్షాల ద్వారా చేరే నీటి పరిమాణం కంటే ఎక్కువ మొత్తంలో బోర్ల ద్వారా నీటిని వినియోగిస్తే ఆ ప్రాంతాన్ని ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ గా పరిగణిస్తారని వివరించారు. సాధారణంగా వర్షాలు పడినప్పుడు కొంత నీరు భూమిలోకి చేరి భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తుందని, అయితే ప్రస్తుతం వినియోగం అధికమవడంతో రీఛార్జ్ పూర్తిగా తగ్గిపోతోందన్నారు. జిల్లాలోని గుడిపల్లి మండలంలో సంఘనపల్లి, కుప్పం మండలంలోని ఇల్లజ్జనూరు, కామాతూరు, కొత్తపల్లి, కుప్పం, మోత్త కదిరినూరు గ్రామాలు, పెద్దపంజాణి మండలంలోని ముత్తుకూరు, శివాడి గ్రామాలను ప్రభుత్వం ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ గ్రామాలుగా గుర్తించింది. ఈ గ్రామాల్లో వ్యవసాయ అవసరాలకు కొత్త బోర్లు తవ్వడం పూర్తిగా నిషేధించారు. తాగునీటి అవసరాల కోసం మాత్రమే ప్రత్యేక అనుమతులతో బోర్లు వేయవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విధించిన ఈ నిషేధం ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుందని భూగర్భ జల శాఖ అధికారులు పేర్కొన్నారు. అనంతరం జాతీయ భూగర్భ జల సంస్థ, రాష్ట్ర భూగర్భ జల శాఖ సంయుక్తంగా మళ్లీ అంచనాలు వేసి పరిస్థితిని సమీక్షిస్తాయి. వర్షపాతం మెరుగుపడి భూగర్భ జలాలు పెరిగితే ఆంక్షలను సవరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

భూగర్భ జలాల అంచనాలో పంటల సాగు తీరు, విద్యుత్ వినియోగం, మోటార్ల సామర్థ్యం, సాగునీటి వినియోగం, పంటల రకాలు, వర్షపాతం వంటి అంశాలను పరిశీలిస్తామని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా నీటిని అధికంగా వినియోగించే పంటల సాగు ఉన్న ప్రాంతాల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో గత కొన్నేళ్లుగా కరువు పరిస్థితులు రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. వానలు ఆలస్యంగా పడటం, చెరువులు నిండకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల సాగుభూములు బీడుగా మారుతున్నాయి. అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా తీవ్రమవుతోంది. వేసవి కాలంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సాధారణమైపోయింది. నీటి కొరత కారణంగా రైతులు పంటల సాగును తగ్గించుకోవాల్సి వస్తోంది. కొంతమంది రైతులు పంటలు పూర్తిగా వదిలి వలసలు వెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోని సరిహద్దు మండలాల్లో భూగర్భ జలాల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

*భూగర్భ జలాలను కాపాడుకోవాలి*

ఈ నేపథ్యంలో భూగర్భ జల శాఖ చిత్తూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తు తరాలకు నీటిని కాపాడే చర్యగా భావించాలన్నారు. భూగర్భ జలాలను విచక్షణారహితంగా వినియోగిస్తే రానున్న రోజుల్లో తీవ్ర నీటి సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతులు కూడా సంప్రదాయ నీటి సంరక్షణ పద్ధతులను అవలంబించాలని, వర్షపు నీటిని భూమిలోకి చేరేలా చెక్‌డ్యామ్‌లు, పర్కొలేషన్ ట్యాంకులు, ఫార్మ్ పాండ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఇకపై భూగర్భ జలాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ప్రతి గ్రామంలో నీటి వినియోగంపై అవగాహన పెంచి, అవసరానికి తగ్గట్టుగా సాగు విధానాలను మార్చుకోవడానికి జలధార, జలహారతి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో నాలుగు మీటర్ల భూగర్భ జలాలను పెంచడమే ధ్యేయంగా పేర్కొన్నారు. జిల్లాలోని రైతులు భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించకపోతే భవిష్యత్తులో నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *