కుప్పం సంజీవని వైద్య విధానానికి రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు
కలెక్టర్ల సదస్సులో చిత్తూరు జిల్లా నమూనాను ప్రస్తావన
రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సేవలను అభినందించిన సీఎం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో అమలు చేస్తున్న సంజీవని డిజిటల్ వైద్య సేవల విధానం రాష్ట్ర స్థాయిలో విశేష గుర్తింపు పొందింది. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ ప్రాజెక్టు మరో మారు ప్రత్యేక చర్చకు రావడం విశేషం. గ్రామీణ ప్రజలకు ఆధునిక వైద్య సేవలను సాంకేతిక పరిజ్ఞానంతో చేరువ చేస్తున్న ఈ విధానాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసిస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పనితీరును అభినందించారు. కుప్పంలో విజయవంతంగా అమలవుతున్న ఈ నమూనాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. సదస్సులో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ పిల్లలే సంపద, సంజీవని కార్యక్రమాలపై సమగ్ర ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడం, ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స ద్వారా ప్రసవాలు పెరగడం, తక్కువ వయస్సులోనే గర్భధారణలు అధికమవడం వంటి అంశాలు భవిష్యత్తులో రాష్ట్ర జనాభా సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఆయన వివరించారు. భవిష్యత్తులో పనిచేసే యువత శాతం తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగే పరిస్థితులు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పెద్ద కుటుంబం సంపద పెంచే కుటుంబం అనే భావనతో పిల్లలే సంపద కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. కుటుంబ వ్యవస్థ బలోపేతం కావడం ద్వారా సమాజ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.
అనంతరం సంజీవని వైద్య సేవల వేదిక గురించి వివరిస్తూ ప్రతి పౌరుడికి మెరుగైన వైద్య సేవలు అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఆభా కార్డుల అనుసంధానంతో ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లో భద్రపరిచే విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. వైద్య పరీక్షల ఫలితాలను కేవలం 48 గంటల్లోనే వాట్సాప్ ద్వారా ప్రజలకు పంపే విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారానే వైద్యుల అపాయింట్‌మెంట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించామని, మాట్లాడే ఆదేశాల ద్వారా ఆరోగ్య సంబంధిత సందేహాలకు సమాధానాలు పొందే విధంగా సంజీవని అనువర్తనాన్ని రూపొందించామని వివరించారు. దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నేరుగా నిపుణులైన వైద్యులతో మాట్లాడేలా టెలీ సంప్రదింపుల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ ఆధ్వర్యంలో కుప్పంలో బ్రిడ్జిటల్ నమూనాను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సాంకేతికతతో పాటు మానవ సేవలను సమన్వయం చేస్తూ గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వీడియో సంప్రదింపుల కేంద్రాల ద్వారా ప్రజలు నేరుగా నిపుణులైన వైద్యులతో వీడియో కాల్‌లో మాట్లాడే అవకాశం కల్పించామని తెలిపారు. స్థానికంగా పనిచేస్తున్న నర్సులు, ఆరోగ్య సమన్వయకర్తలు ముందుగా రోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి, అనంతరం వైద్యులతో టెలీ సంప్రదింపులు కల్పిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేక ఆరోగ్య పర్యవేక్షణ చేపడుతున్నామని, వారికి ఆన్‌లైన్ ద్వారా యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామీణ మహిళల్లో ఆరోగ్య చైతన్యం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కుప్పంలో అమలవుతున్న ఈ విధానం వల్ల గ్రామీణ ప్రజలు చిన్న చిన్న వైద్య అవసరాల కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిందని అధికారులు తెలిపారు. వైద్య ఖర్చులు తగ్గడంతో పాటు సమయపాలన కూడా మెరుగుపడిందని వెల్లడించారు. వైద్య సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువెళ్లే వినూత్న ప్రయత్నంగా ఈ ప్రాజెక్టు నిలుస్తోందని పేర్కొన్నారు. సదస్సులో పలువురు ఉన్నతాధికారులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో అమలవుతున్న సంజీవని విధానం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి ఇది ఉత్తమ ఉదాహరణ అని కొనియాడారు.
ఈ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలంటే ప్రతి అధికారి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఆర్థికాభివృద్ధి వేగవంతం చేసే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రజలకు పాలన మరింత చేరువయ్యేలా పది సూత్రాల కార్యాచరణను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు పనిచేయాలని సూచించారు. జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఫైళ్లలో కాకుండా ఫలితాల్లో మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పాలన అందించే వేగం కేవలం నినాదంగా కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టంగా కనిపించాలి అని అన్నారు. ప్రతి కలెక్టర్, ప్రతి అధికారి తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని, గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారానే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న ఈ కలెక్టర్ల సదస్సులో చిత్తూరు జిల్లా అమలు చేస్తున్న సంజీవని వైద్య సేవల విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జిల్లా ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నాయకత్వంలో చిత్తూరు జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

