28, మే 2026, గురువారం

చిత్తూరు జిల్లాలో టిడిపి మహానాడు విజయవంతం

చిత్తూరు జిల్లాలో టిడిపి మహానాడు విజయవంతం

78 చోట్ల వర్చువల్‌గా 37వేల మంది హాజరు

జిల్లా నుంచి పార్టీకి రూ.48 లక్షలు విరాళాలు

మహానాడు స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలలో ఘనవిజయం లక్ష్యం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రెండు రోజుల వర్చువల్ మహానాడు కార్యక్రమం చిత్తూరు జిల్లాలో ఘనవిజయాన్ని సాధించింది. జిల్లా వ్యాప్తంగా 78 క్లస్టర్లలో ఏర్పాటు చేసిన మహానాడు కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొని పసుపు జెండాలతో సందడి చేశారు. మహానాడు సందర్భంగా పార్టీ అధినేతల ప్రసంగాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్న సంకల్పాన్ని మరింత బలపరిచాయి. ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ మహిళలకు రానున్న ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం మహిళా కార్యకర్తల్లో విశేష ఆనందాన్ని నింపింది. మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోందని మహిళా నాయకులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు పెద్దఎత్తున మహానాడును వీక్షించి హర్షం వ్యక్తం చేశారు.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహానాడు వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. క్లస్టర్ కేంద్రాల వద్ద కార్యకర్తలు ఉదయం నుంచే చేరుకొని పార్టీ గీతాలు ఆలపిస్తూ ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ చిత్రాలతో అలంకరించిన వేదికలు ఆకట్టుకున్నాయి. పలుచోట్ల సీనియర్ కార్యకర్తలను సత్కరించి వారి సేవలను గుర్తు చేశారు. మహానాడు తొలి రోజునే చిత్తూరు జిల్లా నుంచి సుమారు 37 వేల మంది కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే కుప్పం నియోజకవర్గం నుంచి అత్యధికంగా 9,313 మంది కార్యకర్తలు పాల్గొని జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. పూతలపట్టు నియోజకవర్గం నుంచి 7,485 మంది కార్యకర్తలు హాజరై రెండో స్థానాన్ని దక్కించుకుంది. చిత్తూరు నియోజకవర్గం నుంచి 5,295 మంది, పలమనేరు నియోజకవర్గం నుంచి 3,253 మంది, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి 827 మంది కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నారు. మిగిలిన నియోజకవర్గాల నుంచి కూడా వేలాదిగా కార్యకర్తలు హాజరై మహానాడు విజయవంతానికి తోడ్పడ్డారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సాంకేతిక సమస్యల కారణంగా హాజరు సంఖ్య తక్కువగా నమోదైనట్లు పార్టీ నాయకులు వివరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు లగ్గుమల్లి ప్రసాదరావు, మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే నూతనకాల్వ రామిరెడ్డి మహానాడులో పాల్గొన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు స్థానికంగా కార్యకర్తలతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తదితరులు క్లస్టర్లను సందర్శిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. మహానాడు సందర్భంగా పార్టీకి భారీగా విరాళాలు రావడం మరో విశేషంగా నిలిచింది. చిత్తూరు జిల్లా నుంచి మొత్తం రూ.48 లక్షల విరాళాలు పార్టీకి అందాయి. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాశ్ రూ.10 లక్షలు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన 14 మంది నాయకులు కలిసి రూ.21 లక్షలు సమర్పించారు. కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కళిచర్ల శ్రీకాంత్ రూ.5 లక్షలు, డాక్టర్ సురేష్‌బాబు రూ.1 లక్ష, మాజీ మున్సిపల్ చైర్మన్ సుధీర్ రూ.1 లక్ష విరాళంగా అందజేశారు. ఈ విరాళాలను జిల్లా పార్టీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్‌ చౌదరి స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి మాట్లాడుతూ మహానాడు పార్టీ క్యాడర్‌లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. చిత్తూరు జిల్లా నుంచి రికార్డు స్థాయిలో కార్యకర్తలు పాల్గొనడం పార్టీ బలాన్ని చాటిచెప్పిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని, భవిష్యత్‌లో పార్టీ పదవులు, టికెట్లు కూడా అంకితభావంతో పనిచేసిన వారికే లభిస్తాయని స్పష్టం చేశారు. మహానాడు ముగిసే సమయానికి కార్యకర్తల ముఖాల్లో కనిపించిన ఉత్సాహం, నాయకత్వంపై ఉన్న విశ్వాసం, పార్టీ విజయంపై వ్యక్తమైన నమ్మకం చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరింత బలాన్ని తీసుకొచ్చిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *