14, మే 2026, గురువారం

చిత్తూరు జిల్లా పంచాయత్ రిసోర్స్ సెంటర్ కు జాతీయ అవార్డు


చిత్తూరు జిల్లా పంచాయత్ రిసోర్స్ సెంటర్ కు జాతీయ అవార్డు

పంచాయత్ క్షమత నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కార్‌తో జాతీయ స్థాయిలో ఘనత

కోటి రూపాయల బహుమతి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

పీఏఐ 2.0 శిక్షణలతో గ్రామ పాలనలో కొత్త దిశగా చిత్తూరు జిల్లా

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, ప్రజాప్రతినిధుల సామర్థ్యాభివృద్ధి, ఆధునిక గ్రామ పాలనలో చిత్తూరు జిల్లా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2026లో సంస్థల విభాగం కింద ప్రదానం చేసే ప్రతిష్టాత్మకమైన పంచాయత్ క్షమత నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కార్‌ను చిత్తూరు జిల్లా పంచాయత్ రిసోర్స్ సెంటర్ డీపీఆర్‌సీ దేశంలోనే మొదటి స్థానంతో కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించినందుకు కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించడం మరో విశేషంగా నిలిచింది. ఈ బహుమతి కింద కోటి రూపాయల నగదు పారితోషికం లభిస్తుంది. రాష్ట్రపతి స్వయంగా అవార్డును అందజేస్తారు. జిల్లా పంచాయత్ రిసోర్స్ సెంటర్ కు జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్ నాయుడు ప్రిన్సిపాల్ గా, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు వైస్ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తారు. వీరితోపాటు ఒక జిల్లా కోఆర్డినేటర్, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఐదు మంది రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. 


జిల్లా పంచాయత్ రిసోర్స్ సెంటర్ ఇదివరకు చిత్తూరులోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఉండేది. భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిధులతో గంగాధర నెల్లూరులో నూతన భవనం నిర్మాణం జరుగుతోంది. భవన నిర్మాణం తుది దశలో ఉంది. గ్రామపంచాయతీల సామర్థ్యాభివృద్ధి, ప్రజాప్రతినిధులకు శిక్షణ, గ్రామస్థాయి పాలనలో సాంకేతికత వినియోగం, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన అమలు చేసే సంస్థలకు ఈ పురస్కారం అందజేస్తారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ వినూత్న కార్యక్రమాలు చేపట్టిన సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంపిక చేస్తుంది. ఈ విభాగంలో చిత్తూరు జిల్లా పంచాయత్ రిసోర్స్ సెంటర్ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం జిల్లా ప్రతిష్టను మరింత పెంచింది. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీర్లు, ఫీల్డ్ స్థాయి సిబ్బందికి సమర్థవంతమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం డీపీఆర్‌సీ ప్రత్యేకతగా నిలిచింది. గ్రామ సభల నిర్వహణ, పంచాయతీ నిధుల వినియోగం, పన్నుల వసూళ్లు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, పారదర్శక అకౌంటింగ్ విధానాలు, ఈ-గవర్నెన్స్ సేవలపై నిరంతర శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామ పాలనలో సమర్థత పెంచారు. అలాగే గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో పంచాయతీలకు సాంకేతిక సహాయం అందించడం, గ్రామాల్లో తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సీసీ రోడ్లు, కాలువలు, స్ట్రీట్ లైటింగ్, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయడంలో డీపీఆర్‌సీ కీలక పాత్ర పోషించింది. గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల సామర్థ్యాభివృద్ధిలో చిత్తూరు జిల్లా రిసోర్స్ సెంటర్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు పరిపాలనా అవగాహన కల్పించడం, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, గ్రామస్థాయి సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణలు అందించింది. గ్రామపంచాయతీల్లో డిజిటల్ సేవల అమలు, ఆన్‌లైన్ విధానాల వినియోగం, వేగవంతమైన ప్రజా సేవల అందుబాటులో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే డీపీఆర్‌సీ ఆధ్వర్యంలో పంచాయతీ అధికారులకు పీఏఐ 2.0 పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రామ స్థాయిలో పీఏఐ 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, దాని లక్ష్యాలు, మార్గదర్శకాలు, అమలు విధానాలపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించడం ఈ శిక్షణల ముఖ్య ఉద్దేశ్యంగా నిలిచింది.

ఈ శిక్షణల్లో పంచాయతీ అధికారులు, కార్యదర్శులు, ఫీల్డ్ స్థాయి సిబ్బందికి పీఏఐ 2.0 అమలులో అనుసరించాల్సిన విధానాలు, పర్యవేక్షణ, నివేదికల తయారీ, కార్యాచరణ ప్రణాళికల అమలు వంటి అంశాలపై సవివరంగా వివరించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. శిక్షణలో భాగంగా గ్రామస్థాయి సమస్యల గుర్తింపు, అవసరాల ప్రాధాన్యత నిర్ణయం, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనుల ప్రణాళిక, అమలైన పనుల పర్యవేక్షణ, సమయానుకూల నివేదికల సమర్పణ వంటి అంశాలపై ప్రాయోగిక శిక్షణ అందించారు. గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించడం, గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు. పీఏఐ 2.0 ద్వారా గ్రామపంచాయతీల పనితీరును మరింత బలోపేతం చేయడం, ఫీల్డ్ స్థాయి అధికారుల సామర్థ్యాన్ని పెంచడం డీపీఆర్‌సీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో సమన్వయం పెంపొందించి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా ఈ శిక్షణలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.

గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టడం, మహిళా సంఘాలు, యువతను గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామస్థాయి ఆదాయ వనరులను పెంచేందుకు మార్గదర్శకత్వం ఇవ్వడం వంటి వినూత్న కార్యక్రమాలు కూడా డీపీఆర్‌సీ ప్రత్యేకతగా నిలిచాయి. ఈ అవార్డు కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల బహుమతిని గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల బలోపేతం, శిక్షణా మౌలిక వసతుల విస్తరణ, ఆధునిక డిజిటల్ సదుపాయాల ఏర్పాటు, మరిన్ని ప్రజాప్రతినిధులకు శిక్షణ అందించే కార్యక్రమాలకు వినియోగించనున్నారు. జాతీయ స్థాయిలో చిత్తూరు జిల్లా పేరు మారుమోగడం పట్ల జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థాయి పాలనను బలోపేతం చేస్తే అభివృద్ధి గ్రామాల నుంచే ప్రారంభమవుతుందనే విషయాన్ని చిత్తూరు జిల్లా మరోసారి దేశానికి చాటి చెప్పిందని అధికారులు పేర్కొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *