విద్యార్థుల వేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు
ఎండలను లెక్కచేయకుండా ఊరూరూ తిరుగుతున్న అధ్యాపకులు
ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు, ఉచిత భోజనంపై ప్రచారం
అమ్మ వడి, నీట్, ఎంసెట్ కోచింగ్ లపై అవగాహన
సెలవులను త్యజించి మనుగడ కోసం పోరాటం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
ఎండలు మండుతున్నా, వేసవి సెలవులు ఉన్నా వాటిని లెక్కచేయకుండా చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు విద్యార్థుల కోసం గ్రామ గ్రామానికీ తిరుగుతున్నారు. ప్రతి ఇంటి గడప తట్టి తల్లిదండ్రులను కలుస్తూ తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించాలని మనవి చేస్తున్నారు. కేవలం చేర్పించండి అని మాత్రమే కాకుండా, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న నాణ్యత, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పరీక్షల విధానం, గత ఫలితాలు అన్నింటినీ ఓర్పుగా వివరించి నమ్మకం కల్పిస్తున్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల ఆకర్షణలతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలలు ఏ విధంగా మెరుగైనవో ఉదాహరణలతో వివరిస్తూ అవగాహన పెంచుతున్నారు. ఉచిత విద్య, ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలు, ఎంసెట్, నీట్ లకు కోచింగ్, ఉచిత మధ్య భోజనం, అమ్మ ఒడి తదితర పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరకుంటే తమ కళాశాల ఎక్కడ రద్దు అవుతుందో అన్న ఆందోళనతో, అంకితభావంతో విద్యార్థుల కోసం కాన్వాస్ చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలు యూనిఫారాలు, రవాణా సదుపాయాలు, ప్రత్యేక కోచింగ్ పేరుతో తల్లిదండ్రులను ఆకర్షిస్తుండగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ పరిస్థితి అధ్యాపకులకు ఆందోళన కలిగిస్తోంది. ప్రతి సెక్షన్‌కు కనీసం 20 మంది విద్యార్థులు లేకపోతే ఆ సెక్షన్‌ను రద్దు చేసే పరిస్థితి ఉంది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతే సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులకు బదిలీలు, కాంట్రాక్ట్ లెక్చరర్ల మార్పులు, గెస్ట్ లెక్చరర్ల తొలగింపులు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో తమ ఉద్యోగ భద్రతను కాపాడుకోవడమే కాకుండా ప్రభుత్వ విద్యను నిలబెట్టాలనే ఉద్దేశంతో అధ్యాపకులు స్వయంగా ప్రచార బాట పట్టారు. గ్రామాల్లోకి వెళ్లిన అధ్యాపకులు కరపత్రాలు పంచుతూ ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న ప్రత్యేకతలను వివరంగా చెబుతున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, డిజిటల్ తరగతులు, విశాలమైన గదులు, ప్రయోగశాలలు, ఉచిత పుస్తకాలు, ఈఏపీసెట్, ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, నిపుణుల ఆన్‌లైన్ బోధన, శుద్ధమైన తాగునీరు, వసతి గృహాలు, ప్రతిరోజూ సందేహ నివృత్తి తరగతులు, క్రీడలు, ప్రతిభ పరీక్షలు, పేద విద్యార్థులకు రాయితీలు వంటి అంశాలను స్పష్టంగా వివరిస్తున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యా వేతనాలు, ప్రోత్సాహకాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.
ఇదే సమయంలో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి విడుదలైన ఇంటర్మీడియట్ విద్యా కాలెండర్‌ను కూడా తల్లిదండ్రులకు వివరించడం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో విద్య క్రమబద్ధంగా సాగుతుందని నమ్మకం కల్పిస్తున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచే తరగతులు ప్రారంభమవుతాయని, ఏప్రిల్ 24 నుండి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని, జూన్ 1న అన్ని తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని వివరిస్తున్నారు. జూలై 29 నుంచి 31 వరకు యూనిట్-1 పరీక్షలు, ఆగస్టు 27 నుంచి 29 వరకు యూనిట్-2 పరీక్షలు జరుగుతాయని చెబుతున్నారు. అక్టోబర్ 5 నుంచి 9 వరకు త్రైమాసిక పరీక్షలు నిర్వహించి, అక్టోబర్ 10 నుంచి 20 వరకు దసరా సెలవులు ఇచ్చి, అక్టోబర్ 21న తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వివరంగా చెబుతున్నారు. అలాగే నవంబర్ 5 నుంచి 7 వరకు యూనిట్-3 పరీక్షలు, నవంబర్ 25 నుంచి 30 వరకు అర్ధవార్షిక పరీక్షలు ఉంటాయని, డిసెంబర్ 18 నుంచి 23 వరకు ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారని తెలియజేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9 నుంచి 17 వరకు సెలవులు ఇచ్చి, జనవరి 18న కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయని, జనవరి 19 నుంచి 23 వరకు రెండో విడత ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారని చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలు, ఫిబ్రవరి, మార్చిలో ఐపీఈ థియరీ పరీక్షలు జరుగుతాయని, మార్చి 18ను విద్యాసంవత్సరపు చివరి పని దినంగా నిర్ణయించారని స్పష్టం చేస్తున్నారు. మొత్తం 314 రోజుల్లో 82 రోజులు సెలవులు, 232 పని దినాలు ఉంటాయని చెప్పి విద్యా వ్యవస్థ క్రమశిక్షణతో సాగుతుందని తల్లిదండ్రులకు నమ్మకం కల్పిస్తున్నారు.
ప్రైవేట్ కళాశాలల మాదిరిగా ఆకర్షణలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల మౌలిక అభివృద్ధి, క్రమబద్ధమైన అధ్యయనం, పరీక్షల ప్రణాళిక, నాణ్యమైన బోధన ఉంటుందని అధ్యాపకులు చెబుతున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారి ప్రతిభను వెలికి తీసే విధంగా బోధన జరుగుతుందని, పరీక్షల షెడ్యూల్ ముందుగానే ఉండడం వల్ల విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకోవచ్చని వివరిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజలైన, అర్హత కలిగిన అధ్యాపకుల చేత బోధనలు జరుగుతాయని తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు చేస్తున్న ఈ విస్తృత ప్రచారం విద్యార్థుల అడ్మిషన్లపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, ప్రభుత్వ విద్యను నిలబెట్టేందుకు, విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచేందుకు గురువులు చేస్తున్న ఈ కృషి నిజంగా అభినందనీయమే.

