4, మే 2026, సోమవారం

అర్జీ అంటే ఆశ… కలెక్టర్ సమిత్ కుమార్ అంటే నమ్మకం


 చిత్తూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త రూపురేఖలు 

మండల స్థాయిలో కూడా పటిష్టంగా పరిష్కార వేదికలు 

జిల్లా అధికారులతో మండలాలకు తరలి వెళ్తున్న జిల్లా కలెక్టర్ 

పరిష్కార వేదికకు జిల్లా అధికారులు మాత్రమే హాజరుకావాలని ఆదేశాలు 

ప్రతిరోజు అర్ధిదారుల కోసం రెండు గంటల కేటాయింపు

శ్రద్ధగా శ్రమకలు వింటూ, పరిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

 ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లడం అంటే సాధారణ ప్రజలకు భయం, సందేహం, నిరాశల మేళవింపు. ఎవరి దగ్గరకు వెళ్లాలి, ఎప్పుడు కలుస్తారు, సమస్య వింటారా, పరిష్కార మార్గం చూపిస్తారా అన్న అనుమానాలతో అర్జీదారులు తిరిగేవారు. కానీ ఇప్పుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే వ్యవస్థకు ఆయన కొత్త ప్రాణం పోశారు. ఇప్పుడు ఆ వేదిక ప్రజలకు ఒక నమ్మక కేంద్రంగా మారింది. దూర ప్రాంతాల నుంచి తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కు విన్నవించుకోవడానికి తరలివస్తున్నారు. వచ్చిన అర్జీదారుల సమస్యలను జిల్లా కలెక్టర్ సావధానంగా వింటున్నారు. అప్పుడే సంబంధిత అధికారిని పిలిచి పరిష్కారానికి ఆదేశాలు ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క మండలానికి వెళ్లి ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. సమస్యల పరిష్కారాన్ని కోసం జిల్లా కలెక్టర్ ప్రజల వద్దకే వెళుతున్నారు మండల స్థాయిలో కూడా ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలు జరుగుతున్నాయి. వచ్చిన అర్జీలను మానిటరింగ్ చేయడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అర్జీ ఇస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందని నమ్మకం జిల్లాలోని ప్రజలలో కుదిరింది.

ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇప్పుడు కేవలం ఒక కార్యక్రమం కాదు… అది ప్రజల ఆశల వేదికగా మారింది. గతంలో ఈ కార్యక్రమం నిర్వహించినా, సంబంధిత శాఖల అధికారులు హాజరు కావడం అరుదే. దాంతో అర్జీలు తీసుకోవడమే తప్ప పరిష్కారం ఆలస్యమయ్యేది. అయితే సమిత్ కుమార్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చారు. జిల్లా స్థాయి అన్ని విభాగాల అధిపతులు తప్పనిసరిగా హాజరుకావాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా గైర్హాజరు అయితే వివరణ కోరడం, అవసరమైతే సంజాయిషీ నోటీసులు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టడంతో ఇప్పుడు ఒక్క అధికారి కూడా నిర్లక్ష్యం చూపే పరిస్థితి లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీదారుడిని గౌరవంగా స్వాగతించేందుకు కలెక్టర్ ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. కార్యాలయంలోకి వచ్చే ప్రజలు గంటల కొద్దీ నిలబడకుండా ఉండేందుకు ప్రత్యేక హాలును నిర్మించి కుర్చీలు ఏర్పాటు చేశారు. అర్జీల స్వీకరణ కోసం ప్రత్యేకంగా మరో హాలును ఏర్పాటు చేసి, ప్రతి శాఖ అధికారికి ప్రత్యేక సీటింగ్‌ను కేటాయించారు. ఎవరు ఎక్కడ కూర్చోవాలో స్పష్టంగా నిర్ణయించడం వల్ల అర్జీదారులు ఎవరిని సంప్రదించాలో స్పష్టత పొందుతున్నారు. కార్యాలయంలోకి వచ్చిన వెంటనే అర్జీదారులు కంప్యూటర్ సెక్షన్‌లో తమ వివరాలు నమోదు చేయించుకుంటారు. అలా నమోదు చేసిన వెంటనే అర్జీ అధికారికంగా రిజిస్టర్ అవుతుంది. అనంతరం సంబంధిత అధికారికి చేరుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉండేలా రూపొందించడం వల్ల అర్జీ “మిస్” అయ్యే అవకాశమే లేదు. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది.

అత్యంత ముఖ్యంగా, జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ స్వయంగా అర్జీదారుల సమస్యలను శ్రద్ధగా వింటున్నారు. కేవలం వినడమే కాకుండా, వెంటనే సంబంధిత అధికారిని పిలిచి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో చాలా సమస్యలు అదే రోజు పరిష్కారం అవుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో వచ్చిన ప్రజలు, తమ సమస్యను జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా విని స్పందించడంతో ఆనందంతో తిరిగి వెళ్తున్నారు. మా మాట వినిపించింది అన్న భావన వాళ్లలో నింపుతోంది. ఈ వేదికలో వచ్చిన అర్జీలపై సమిత్ కుమార్ ప్రతి వారం సమగ్ర సమీక్ష నిర్వహించడం మరో ప్రత్యేకత. ఏ శాఖకు ఎన్ని అర్జీలు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించబడ్డాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో అధికారులు కూడా తమ పనిలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది. ఈ పర్యవేక్షణ ప్రభావం మండల స్థాయి వరకు వెళ్లింది. అక్కడి అధికారులు కూడా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ప్రతి సోమవారం మాత్రమే కాకుండా, ప్రతిరోజూ కూడా అర్జీదారులకు సమయం కేటాయించడం సమిత్ కుమార్ ప్రత్యేకత. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. ఈ సమయంలో వచ్చిన అర్జీలను వెంటనే సంబంధిత శాఖలకు పంపించి పరిష్కరించాల్సిందిగా ఆదేశిస్తున్నారు. దీంతో ప్రజలు సోమవారం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రతిరోజూ తమ సమస్యలను తెలియజేసే అవకాశం పొందుతున్నారు.

సమిత్ కుమార్ తీసుకున్న మరో కీలక నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కార వేదికను మండల స్థాయి వరకు విస్తరించడం. గతంలో ఈ కార్యక్రమం ప్రధానంగా జిల్లా కేంద్రానికే పరిమితమై ఉండేది. దాంతో దూర ప్రాంతాల ప్రజలు చిత్తూరుకు రావాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతి మండలంలో ఎంపీడీవో కార్యాలయాల్లో ఈ వేదికలను నిర్వహిస్తున్నారు. మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ముందుకు వెళ్లి, నెలలో కొన్ని సోమవారాల్లో జిల్లా కలెక్టర్ స్వయంగా మండలాలకు వెళ్లి ప్రజా సమస్యల పరిష్కార వేదికలను నిర్వహించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముందుగానే ఏ మండలంలో ఈ కార్యక్రమం జరుగుతుందో ప్రకటించి, ఆ మేరకు జిల్లా అధికారులతో కలిసి ఆ మండలానికి వెళ్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సమస్యల పరిష్కారం మరింత వేగవంతమవుతోంది. ఇటీవల గంగాధర్ నెల్లూరు, వెదురుకుప్పం, నిండ్ర మండలాలకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెళ్లి ఈ కార్యక్రమాలు నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించేందుకు డీఎల్‌డీవో రవికుమార్‌ను నోడల్ అధికారిగా నియమించారు. ఆయన అర్జీలను డిజిటల్ రూపంలో నమోదు చేసి, వాటిని సంబంధిత శాఖలకు పంపిస్తూ పరిష్కారాన్ని ట్రాక్ చేస్తున్నారు. మండల స్థాయి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు పంపిస్తుండగా, రాష్ట్ర స్థాయి పరిష్కారం అవసరమైన వాటిని పై అధికారులకు నివేదిస్తున్నారు. దీంతో ప్రతి అర్జీకి ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పడింది. మొత్తానికి, చిత్తూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఒక కార్యనిర్వహణ విధానం నుంచి ప్రజల నమ్మక వేదికగా మారింది. ఈ మార్పుకు ప్రధాన కారణం జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ తీసుకున్న కట్టుదిట్టమైన నిర్ణయాలు, మానవీయ దృక్పథం. ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి స్పందించే నాయకత్వం ఉంటే ప్రభుత్వ వ్యవస్థ ఎలా మారుతుందో చిత్తూరు జిల్లా ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పుడు జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను తెలియజేస్తున్నారు. “మాకు న్యాయం జరుగుతుంది” అన్న నమ్మకం వారి ముఖాల్లో కనిపిస్తోంది. అదే ఈ వ్యవస్థ విజయానికి నిజమైన కొలమానం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *