12, మే 2026, మంగళవారం

అత్యంత వైభవంగా ప్రారంభమైన చిత్తూరు గంగమ్మ జాతర

అత్యంత వైభవంగా ప్రారంభమైన చిత్తూరు గంగమ్మ జాతర

తొలి పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు

అంబళ్లు, నైవేద్యాలతో కళకళలాడిన జాతర వీధులు

600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు నగర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ప్రసిద్ధ గంగమ్మ జాతర మంగళవారం వేకువజామున భక్తి శ్రద్ధల మధ్య అత్యంత ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ మహా జాతరకు నగరం మొత్తం పండుగ వాతావరణంలో ముస్తాబయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు నడివీధి గంగమ్మ వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు తొలి పూజలు నిర్వహించి జాతర వేడుకలకు శ్రీకారం చుట్టారు. ముందుగా సీకే బాబు, లావణ్య దంపతులు బజారు వీధిలో ఏర్పాటు చేసిన గంగమ్మ మండపానికి చేరుకుని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి సమర్పించే తాళిని  భక్తులకు చూపించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా అమ్మవారికి అలంకరించారు. ఆ తర్వాత సీకే బాబు ముసుగును తొలగించి గంగమ్మ తల్లిని ఆవిష్కరించగా భక్తులు జై గంగమ్మ తల్లి అంటూ నినాదాలతో మారుమోగించారు. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న అమ్మవారి రూపం భక్తులను ఆధ్యాత్మిక భావంలో ముంచెత్తింది.

తొలి పూజల అనంతరం సీకే బాబు దంపతులు భక్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు. నగరంలోని పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, చిన్నారులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఉదయం నుంచే అమ్మవారికి అంబళ్లు సమర్పించే కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ గానుగ పెనాలు పొంగిపొర్లుతూ వీధులంతా ఆధ్యాత్మిక సువాసనతో నింపేశాయి. మధ్యాహ్నం నుంచి నైవేద్య సమర్పణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఈ సందర్భంగా సీకే లావణ్య మాట్లాడుతూ చిత్తూరు నగర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, గంగమ్మ తల్లి చల్లని దీవెనలు అందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. జాతర ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా, వైభవంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులందరూ కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించామని పేర్కొన్నారు.

చిత్తూరు పట్టణంలో నడివీధి గంగమ్మతో పాటు మరో ఏడు గంగమ్మలు వివిధ ప్రాంతాల్లో కొలువుతీరడం ఈ జాతర ప్రత్యేకత. అందుకే దీనిని ఏడు గంగల జాతరగా పిలుస్తారు. సంతపేట, మంగసముద్రం, దొడ్డిపల్లి, మురకంబట్టు, కొంగారెడ్డిపల్లి, కాజూరు, గిరింపేట ప్రాంతాల్లో గంగమ్మ తల్లి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తోంది. అన్ని ప్రాంతాల్లో మంగళవారం ఉదయమే తొలి పూజలు నిర్వహించి జాతరను ఘనంగా ప్రారంభించారు. అంబళ్లు, నైవేద్యాలు, ప్రత్యేక అలంకరణలతో మండపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జాతర సందర్భంగా జిల్లా పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి స్వయంగా నడివీధి గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ధర్మకర్తలు ఎస్పీకి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ట్రాఫిక్ మళ్లింపులను ప్రజలు గమనించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా ప్రత్యేక పోలీసు బృందాలు, షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు, డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. గాంధీ కూడలి వద్ద ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటల పాటు జాతర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలపై వేధింపులు, జేబుదొంగతనాలు, గొలుసు చోరీలు, ఆకతాయిల అల్లర్లను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

జాతర కోసం మొత్తం 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు చెక్ పోస్టులు, 14 పికెట్లు, రక్షక్ మొబైల్ వాహనాలు, బ్లూకోట్ మొబైల్ బృందాలు నిరంతరం విధుల్లో ఉండనున్నాయి. భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా అమ్మవారిని దర్శించుకునేలా ప్రత్యేక పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, ఫైర్ సేఫ్టీ చర్యలు చేపట్టారు. చిత్తూరు డీఎస్పీ జె. వెంకటనారాయణ మాట్లాడుతూ జాతర ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. చిన్నారులు తప్పిపోకుండా పేరెంట్స్ ట్యాగింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతర నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి తెచ్చారు. పుత్తూరు, తిరుత్తణి, బెంగళూరు, చెన్నై వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. భారీ వాహనాలను పట్టణంలోకి అనుమతించకపోవడంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బుధవారం జరిగే “ఓం శక్తి” వాహనాల ఊరేగింపు సందర్భంగా మరిన్ని ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
 భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక ఉత్సాహం, పోలీసు భద్రతా ఏర్పాట్లు అన్నీ కలగలిసి చిత్తూరు గంగమ్మ జాతర ఈసారి మరింత వైభవంగా ప్రారంభమైంది. నగరం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో జాతర వీధులన్నీ కిక్కిరిసిపోగా, జై గంగమ్మ తల్లి నినాదాలతో చిత్తూరు నగరం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *