జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ నేడే
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ నేడే
2.33 లక్షల మందికి రూ.100 కోట్ల పంపిణీ
కొత్తగా 215 వితంతువులకు పింఛన్ల మంజూరు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
చిత్తూరు జిల్లాలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ భారీ స్థాయిలో జరగనుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 2.33 లక్షల మంది లబ్ధిదారులకు రూ.100.70 కోట్లను పింఛన్ల రూపంలో ప్రభుత్వం అందజేయనుంది. తెల్లవారుజామునే గ్రామాలు, పట్టణాల్లో పింఛన్ పంపిణీ ప్రారంభం కానుండగా, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయడానికి విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో పింఛన్ పంపిణీకి సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే మండల కేంద్రాలకు, అక్కడి నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు అవసరమైన నిధులు చేరవేశారు. ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
జిల్లాలో అత్యధికంగా వృద్ధాప్య పింఛన్ల కింద 1,13,499 మందికి రూ.46.54 కోట్లు విడుదల చేశారు. వితంతు పింఛన్ల కింద 60,476 మందికి రూ.24.99 కోట్లు, వికలాంగుల పింఛన్ల కింద 31,533 మందికి రూ.19.29 కోట్లు అందజేయనున్నారు. అభయహస్తం పింఛన్లు 9,603 మందికి, నేత కార్మికులకు 2,198 మందికి, గీత కార్మికులకు 515 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. ఒంటరి మహిళలకు 4,736 మందికి, మత్స్యకారులకు 206 మందికి, ట్రాన్స్‌జెండర్‌లకు 31 మందికి పింఛన్లు అందనున్నాయి. దప్పు కళాకారులు 5,561 మంది, సంప్రదాయ చెప్పుల కుట్టే వృత్తిదారులు 718 మంది, కళాకారులు 53 మంది, సైనిక్ వెల్ఫేర్ పింఛన్లు పొందుతున్న 41 మంది కూడా ఈ జాబితాలో ఉన్నారు. సీకేడీయూ ప్రైవేట్ విభాగంలో 383 మందికి, సీకేడీయూ ప్రభుత్వ విభాగంలో 235 మందికి, ఏఆర్‌టీ పింఛన్ల కింద 763 మందికి సహాయం అందజేయనున్నారు. సాధారణ పింఛన్ల విభాగంలో మొత్తం 2,30,551 మందికి రూ.97.99 కోట్లు విడుదలయ్యాయి. ఆరోగ్య పింఛన్ల కింద పక్షవాతం కారణంగా మంచానికే పరిమితమైన 732 మందికి, తీవ్రమైన మస్క్యులర్ డిస్ట్రోఫీ మరియు ప్రమాద బాధితులు 735 మందికి, థలసేమియా బాధితులు 31 మందికి, హీమోఫీలియా బాధితులు 44 మందికి పింఛన్లు అందనున్నాయి. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న 115 మందికి, బహుళ వికృత కుష్ఠు వ్యాధిగ్రస్తులు 353 మందికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఆరోగ్య పింఛన్ల విభాగంలో మొత్తం 2,097 మందికి రూ.2.71 కోట్లు మంజూరయ్యాయి.
కొత్తగా 215 వితంతు పెన్షన్లు మంజూరు
జిల్లాకు కొత్తగా మరో 215 మంది వికలాంగులకు ప్రత్యేక పింఛన్లు మంజూరు కావడం జిల్లాలో ఆనందాన్ని కలిగించింది. వికలాంగుల కుటుంబాల్లో భర్త మరణించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం ఈ పింఛన్లను మంజూరు చేసింది. ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున అందజేయనున్నారు. ఈ కొత్త పింఛన్లు కూడా సోమవారం నుంచే లబ్ధిదారులకు అందజేయనున్నారు. నియోజకవర్గాల వారీగా చిత్తూరు నియోజకవర్గానికి 24, గంగాధర నెల్లూరుకు 51, కుప్పంకు 32, పుంగనూరుకు 12, నగరికి 10, పలమనేరుకు 53, పూతలపట్టుకు 33 కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. పలమనేరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలకు అత్యధిక సంఖ్యలో పింఛన్లు కేటాయించడం విశేషంగా మారింది.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, అధికారులు సమన్వయంతో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు అందేలా చర్యలు చేపట్టారు. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం జిల్లాలో వేలాది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు.

