3, మే 2026, ఆదివారం

చిత్తూరు–తచ్చూరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం


చిత్తూరు నుంచి ఉతుక్కొట్టై వరకు వాహనాల అనుమతి 

చిత్తూరు జిల్లాలో 11 ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ మాత్రమే

నాలుగు గంటల ప్రయాణం రెండు గంటల్లోనే పూర్తి 

డిసెంబర్ నాటికి పోర్టుల వరకు కనెక్టివిటీ పూర్తి

 (ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)


ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చిత్తూరు–తచ్చూరు గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్‌వే ఇప్పుడు దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే దాదాపు 92 నుంచి 96 కిలోమీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయి. అధికారులు ప్రయోగాత్మకంగా వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వడం ప్రారంభించారు. దీంతో చిత్తూరు నుంచి చెన్నై ప్రయాణం గణనీయంగా సులభమైంది. .5,486 కోట్ల భారీ వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. 75 శాతం పనులు పూర్తి అయ్యాయి. రోడ్డు నిర్మాణం, నిర్వహణకు అత్యధిక సాధ్యతిగా పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్స్ కూడా పరిమితంగానే ఉన్నాయి. డిసెంబర్ నాటికి మొత్తం రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి అయితే చిత్తూరు నుంచి చెన్నైకి నాలుగు గంటలు పట్టే ప్రయాణం రెండు గంటలకి పూర్తి అవుతుంది. నగరంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నేరుగా ఓడరేవుకు చేరుకొనవచ్చును. ఇందువల్ల కూరగాయలు, పండ్లు ఎగుమతులకు సమయం ఆదా అవుతుంది.

ఈ ప్రతిష్టాత్మక జాతీయ రహదారి మొత్తం 116.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణంలో ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలో 75 కిలోమీటర్లు, తమిళనాడు పరిధిలో 41.5 కిలోమీటర్లు ఉన్నాయి. రూ.5,486 కోట్ల భారీ వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా గంగాసాగరం నుంచి తమిళనాడులోని ఉతుక్కొట్టై వరకు వాహనాలను అనుమతిస్తుండగా, మిగిలిన తచ్చూరు వరకు పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తిగా యాక్సెస్ కంట్రోల్ విధానంలో నిర్మించడం ఈ హైవే ప్రత్యేకత. అంటే ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఎక్కడం, దిగడం ఉండదు. కేవలం నిర్ణీత ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల ద్వారానే రాకపోకలు సాగించాలి. దీంతో ప్రమాదాలు తగ్గడంతో పాటు, వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు. ఈ హైవేలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించడం మరో విశేషం. అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమలు చేసి, రహదారి భద్రతను మరింత పటిష్టం చేశారు. మొత్తం 115 పాన్-టిల్ట్-జూమ్ కెమెరాలు, 120 సర్వైలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదనంగా 58 వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిస్టమ్స్ అమర్చారు. వాహనాల వేగాన్ని గుర్తించే అత్యాధునిక పరికరాలు కూడా ఏర్పాటు చేయడంతో, ఎక్కడైనా ప్రమాదం జరిగినా లేదా ట్రాఫిక్ సమస్య తలెత్తినా అధికారులు వెంటనే స్పందించే అవకాశం ఉంది.

చిత్తూరు జిల్లాలో ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు 11 ప్రధాన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అనుపల్లె, నర్సింహాపురం, నగరి, పల్లిపట్టు, శ్రీరంగరాజపురం, వీరకావేరిరాజపురం వంటి ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో జిల్లాలోని పలు మండలాలకు నేరుగా ఈ హైవేతో కనెక్టివిటీ లభిస్తుంది. ఇప్పటివరకు చిత్తూరు నుంచి చెన్నైకు వెళ్లేందుకు సుమారు 4 గంటల సమయం పట్టేది. ట్రాఫిక్, నగర రద్దీ వంటి సమస్యలతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. కానీ ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రావడంతో, ఇప్పుడు అదే దూరాన్ని కేవలం 1.5 నుంచి 2 గంటల్లోనే పూర్తి చేయవచ్చు. అంటే దాదాపు రెండు గంటల సమయం ఆదా కానుంది. ఇది రోజువారీ ప్రయాణికులు, వ్యాపారవేత్తలు, సరకు రవాణా రంగానికి ఎంతో ఊరటనిచ్చే అంశం. ఈ హైవే చెన్నై నగర ట్రాఫిక్‌ను పూర్తిగా బైపాస్ చేస్తూ నేరుగా పోర్టులకు కనెక్టివిటీ కల్పించడం ఈ హైవే ప్రత్యేకత. చెన్నైలోని కామరాజార్ పోర్ట్, కట్టుపల్లి పోర్ట్లకు సరకు రవాణా వాహనాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేరుకోవచ్చు. దీని వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, సమయం కూడా ఆదా అవుతుంది. ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతులకు ఇది కీలక మార్గంగా మారనుంది. టోల్ విధానంలో కూడా ఆధునిక మార్పులు తీసుకొచ్చారు. క్లోజ్డ్ టోల్ సిస్టమ్ను అమలు చేస్తూ, వాహనం ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికే టోల్ వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ప్రయాణికులపై అనవసర భారం తగ్గుతుంది. త్వరలోనే ఈ టోల్ వసూళ్లను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకు వెళ్లే రహదారి మార్గంలో ఇది ప్రధాన మార్గంగా మారనుంది. అలాగే బెంగళూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు కూడా ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. చిత్తూరు–తచ్చూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం రాష్ట్ర రవాణా రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది. వేగవంతమైన ప్రయాణం, ఆధునిక సదుపాయాలు, భద్రత, సమయ ఆదా అన్నీ కలిపి ఈ హైవేను ప్రజల జీవనశైలిలో కీలక మార్పుకు నాంది పలికేలా చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో పనులు పూర్తయ్యాక, ఇది దేశంలోనే అత్యాధునిక ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటిగా నిలవడం ఖాయం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *