డీఎన్‌టీ, ఎన్‌టీలుగా బీసీ కులాలకు గుర్తింపు
బీసీలకు శుభవార్త
కుల ధ్రువీకరణ పత్రాలలో మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రత్యేక రిజర్వేషన్ల అమలుపై బీసీ సంఘాల డిమాండ్
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
ఆంధ్రప్రదేశ్‌లోని పలు వెనుకబడిన వర్గాల (బీసీ) కులాలకు డీ-నోటిఫైడ్ ట్రైబ్స్ (డి ఎన్ టి), నోమాడిక్ ట్రైబ్స్ (ఎన్ టి, సంచార జాతులు) గుర్తింపు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు సంబంధిత కులాలకు డీఎన్‌టీ, ఎన్‌టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ విడుదల చేసిన మెమో నం.3070581/బీసీడబ్ల్యు/ఎఫ్/2025, తేదీ 07-04-2026 ద్వారా అధికారికంగా మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. దశాబ్దాలుగా సంచార జీవనం, సంప్రదాయ వృత్తులు, సామాజిక వివక్షతో వెనుకబడిన అనేక వర్గాలకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని బీసీ సంఘాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే డీఎన్‌టీ, ఎన్‌టీ వర్గాలకు ప్రత్యేక ధ్రువీకరణ పత్రాలతో పాటు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని సంఘాల నాయకులు గుర్తుచేస్తున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేక వర్గీకరణ చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో ఆశలు రేకెత్తించింది. రాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్ సిఫార్సుల మేరకు 28 బీసీ కులాలను జాతీయ డీఎన్‌టీల జాబితాలో, మరో 14 కులాలను జాతీయ ఎన్‌టీల జాబితాలో చేర్చాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా డీఎన్‌టీ, ఎన్‌టీ ధ్రువీకరణ పత్రాల జారీపై మార్గదర్శకాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డీఎన్‌టీల జాబితాలో కంజర భట్ట, బుడబుక్కల, దాసరి, దొమ్మర, జోగి, కేప్మారే, మోండివారు, వీరముష్టి, పార్ధి, నొక్కర్, పారికిముగ్గుల, వంశరాజ్, పిచ్చిగుంట్ల, యాట, కైకాడి, వాల్మీకి బోయ, ఒడ్డె, పూసల, భట్రాజు, రజక, ఉప్పర లేదా సాగర, ముదిరాజ్, బాలసంతు, కటికపాల తదితర వర్గాలు ఉన్నాయి. ఎన్‌టీల (సంచార జాతుల) జాబితాలో గంగిరెద్దులవారు, జంగం సంప్రదాయ భిక్షాటన వర్గం, కొర్చ, కాశికపాడి, దమ్మలి, మండుల, రాజన్నలు, బండార, గుడాల, కునపులి, పాత్ర, సిక్లిగర్, అరే మరాఠి, కురుబ వర్గాలు ఉన్నాయి. ఈ కులాలకు ఇకపై జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాల్లో సంబంధిత కమ్యూనిటీ పేరుకు ముందు డీ-నోటిఫైడ్ ట్రైబ్ (డి ఎన్ టి)) లేదా నోమాడిక్ ట్రైబ్ (ఎన్ టి) అని నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికోసం సీసీఎల్ఏ ఆధ్వర్యంలో వెబ్‌ల్యాండ్, గ్రామ/వార్డు సచివాలయ సేవల సాఫ్ట్‌వేర్‌లలో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
బీసీ సంఘాల నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా అస్తిత్వ గుర్తింపుకోసం పోరాడుతున్న సంచార, అర్ధసంచార వర్గాలకు ఇది చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. అయితే కేవలం ధ్రువీకరణ పత్రాల జారీతో సరిపెట్టకుండా, తమిళనాడు తరహాలో ప్రత్యేక రిజర్వేషన్లు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, శాసనసభ, పార్లమెంట్ రాజకీయ ప్రాతినిధ్యంలో ప్రత్యేక కోటా ఉండాలని వారు కోరుతున్నారు. ఈ వర్గాలు చారిత్రాత్మకంగా సామాజికంగా అణచివేతకు గురై జీవనోపాధి అవకాశాలు కోల్పోయాయని, సంచార జీవన విధానం కారణంగా విద్య, ఉపాధి రంగాల్లో వెనుకబడ్డాయని నాయకులు చెబుతున్నారు. అందువల్ల ప్రత్యేక ఉప ప్రణాళికలు, ఆర్థిక సహాయం, హాస్టళ్లు, విద్యా రాయితీలు, ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో డీఎన్‌టీ, ఎన్‌టీ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ల అమలుకు దారితీసే అవకాశముందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

