25, మే 2026, సోమవారం

ప్రజా సమస్యలతో కలెక్టరేట్‌కు పోటెత్తిన ప్రజలు






ప్రజా సమస్యలతో కలెక్టరేట్‌కు పోటెత్తిన ప్రజలు

పీజీఆర్ఎస్‌లో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ 

 సమస్యల పరిష్కారానికి హామీ

చిత్తూరు, మే 25 (ఆంధ్రప్రభ బ్యూరో): చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. భూవివాదాలు, కుటుంబ సమస్యలు, రైతు సమస్యలు, విద్యా సంస్థల ఫీజుల దోపిడీ, అనాథల ఆర్థిక ఇబ్బందులు, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి పలు అంశాలపై అర్జీలు అందాయి. ప్రతి సమస్యను సంబంధిత శాఖల ద్వారా పరిశీలించి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.

మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి

చిత్తూరు జిల్లాలో మామిడి సాగు వేలాది మంది రైతుల ప్రధాన జీవనాధారంగా కొనసాగుతున్న నేపథ్యంలో రైతు సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గత రెండు మూడు సంవత్సరాలుగా మామిడి పంటకు కనీస గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉత్పత్తి వ్యయం పెరగడం, మార్కెట్‌లో ధరలు పడిపోవడం, వ్యాపారుల ఆధిపత్యం, నిల్వ సదుపాయాల కొరత కారణంగా రైతులు నష్టాల్లోకి వెళ్తున్నారని పేర్కొన్నారు. తోతాపూరి మామిడి టన్నుకు కనీస ధర రూ.18 వేలుగా, బేనిషా, బంగినపల్లి రకాల మామిడికి టన్నుకు కనీసం రూ.25 వేలుగా నిర్ణయించాలని కోరారు. రసాలు మరియు ఇతర రకాల మామిడికి కిలోకు రూ.18 చొప్పున ధర నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రాసెసింగ్ యూనిట్లను వెంటనే ప్రారంభించి, ఫ్యాక్టరీల వారీగా ప్రాంతాలను కేటాయించి రైతుల వద్ద నుంచే కొనుగోళ్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.

అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అడ్మిషన్లు నిర్వహిస్తూ భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు నియంత్రణను పట్టించుకోకుండా విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అనుమతులు లేకుండానే కొన్ని పాఠశాలలు నడుస్తున్నాయని, అనుమతులు ఒకచోట ఉండగా భవనాలు మరోచోట నిర్వహిస్తున్నారని ఆరోపించారు. మౌలిక వసతులు లేకపోయినా భారీ ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకుని అవసరమైతే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్, నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలల జాబితాను అందిస్తే కచ్చితంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సంజయ్, లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటి నుంచి వెళ్లగొట్టారని మహిళ ఆవేదన

జీడీ నెల్లూరు మండలం చింతలరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సరస్వతి జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. తన తండ్రి వీలునామా ప్రకారం ఇంటి ఆస్తి తన పేరున ఉందని, అయితే తన తమ్ముడు మరియు అతని భార్య కలిసి తనను ఇంటి నుంచి బయటకు పంపించి తాళాలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేసి ఇంటిని తిరిగి ఇప్పించాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులను విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

హెచ్ఐవీతో బాధపడుతున్న అనాథ యువతికి సాయం

కార్వేటినగరం మండలం గోపిశెట్టి పల్లెకు చెందిన మౌనిషా కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. తల్లిదండ్రులు హెచ్ఐవీ కారణంగా మరణించడంతో తాను మరియు తన తోబుట్టువు అనాథలమయ్యామని తెలిపారు. తానూ హెచ్ఐవీతో బాధపడుతున్నానని, తమను చూసుకునేందుకు బంధువులు కూడా ముందుకు రావడం లేదని వాపోయారు. ప్రభుత్వం ద్వారా పెన్షన్ మరియు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ), పీడీ ఆర్డీఏ అధికారులను ఆదేశించారు.

భూమి ఆక్రమణ ప్రయత్నంపై ఫిర్యాదు

జీడీ నెల్లూరు మండలం పాతపల్లి హరిజనవాడకు చెందిన ఎం. దినేష్ తన భూమిని గ్రామానికి చెందిన వ్యక్తి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 202/5బి, 202/7ఎలో భూమి తమ తాత పేరుపై ఉందని, ఓనర్‌షిప్ సర్టిఫికెట్, పట్టా పత్రాలు కూడా ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ రవి అనే వ్యక్తి భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖ ద్వారా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గుడియాత్తం రోడ్డులో ప్రమాదాల నివారణకు చర్యలు కోరిన కాంగ్రెస్ నాయకుడు

చిత్తూరు నగరంలోని గుడియాత్తం రోడ్డు నాలుగు రోడ్ల కూడలి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, శాశ్వత పరిష్కారం చూపించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు టెక్కీ రాయల్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. రాత్రివేళల్లో వెలుతురు లేక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వెంటనే హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గాంధీ సర్కిల్, దర్గా సర్కిల్ వద్ద ఉన్న మహనీయుల విగ్రహాల ప్రాంతాలను ‘నో పోస్టర్, నో కటౌట్, నో బ్యానర్ జోన్’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *