12, మే 2026, మంగళవారం

జీవనోపాధి రంగంలో భారీ కార్యాచరణకు శ్రీకారం


జీవనోపాధి రంగంలో భారీ కార్యాచరణకు శ్రీకారం

మహిళా సంఘాల ద్వారా కుటుంబాల ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి

గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళిక

ప్రతి మండలంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక 

ప్రతి గ్రామంలో 20 మందికి ఉపాధి అవకాశాలు

ఆంధ్రప్రభతో డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీదేవి 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక స్వావలంబన, పేద కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి విస్తృత స్థాయి జీవనోపాధి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు చిత్తూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డిఆర్డిఎ) ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీదేవి తెలిపారు. సోమవారం చిత్తూరులో ఆంధ్రప్రభ వివ్రత మాట్లాడుతూ ... గ్రామీణ పేద కుటుంబాలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యమని, మహిళా స్వయం సహాయక సంఘాల ఆధారంగా జీవనోపాధి రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 8.23 లక్షల స్వయం సహాయక సంఘాలలో 3.02 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఈ మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం, గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయం అందించడం కోసం ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 50 శాతం కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

గ్రామీణ మహిళలలో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించడం, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం, చిన్న చిన్న వ్యాపార యూనిట్లను స్థాపించేందుకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహాయం, ఆర్థిక వనరులు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, పశుసంవర్ధక, పాల ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్, ఈ-రిటైల్, కమ్యూనిటీ బిజినెస్, సూక్ష్మ పరిశ్రమలు వంటి రంగాల్లో మహిళలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తున్నాయని శ్రీదేవి పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా గ్రామీణ కుటుంబాల్లో పొదుపు అలవాటు పెరిగిందని, బ్యాంకు లింకేజీ బలోపేతమైందని, ఇప్పుడు అదే సంఘాలను జీవనోపాధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మహిళలు కేవలం పొదుపు, రుణాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి రంగంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు.

ఈ కార్యాచరణలో భాగంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గ్రామ స్థాయిలో వీఓఏలు, సీసీలు, మండల స్థాయిలో ఏపీఎంలు, మండల సమాఖ్యలు, జిల్లా స్థాయిలో డీపీఎంలు, జిల్లా సమాఖ్యలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించి జీవనోపాధి అవకాశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామ సంఘంలో కనీసం 20 మంది మహిళలను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వీరిని సూక్ష్మ వ్యాపారాల వైపు ప్రోత్సహించి బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు, వ్యాపార నిర్వహణ నైపుణ్యాలు అందించనున్నట్లు తెలిపారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా వినియోగించనున్నట్లు చెప్పారు.

ఈ-రిటైల్, డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయని, గ్రామీణ మహిళలు కూడా ఆధునిక వ్యాపార విధానాలకు అలవాటు పడేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళల ఉత్పత్తులను స్థానికంగా మాత్రమే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రదర్శనలు, ఎగ్జిబిషన్‌లు, ఆన్‌లైన్ వేదికల ద్వారా విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జీవనోపాధి కార్యక్రమాల అమలులో పర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు బి. శ్రీదేవి తెలిపారు. ప్రతి మండలంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పురోగతిని సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు డేటా సేకరణ కోసం ప్రత్యేక ఐబీ-ఎంఐఎస్ వ్యవస్థను వినియోగించనున్నట్లు వెల్లడించారు.

జిల్లాలోని అన్ని మండలాల్లో జీవనోపాధి అవకాశాలపై సర్వే నిర్వహించి ఆయా ప్రాంతాలకు అనుకూలమైన వ్యాపారాలను గుర్తించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో పశుసంవర్ధక, పాల ఉత్పత్తి, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తామని, పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ-రిటైల్, సేవారంగ వ్యాపారాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని శ్రీదేవి పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు పిల్లల విద్య, ఆరోగ్యం, పోషణ అంశాల్లో కూడా సానుకూల మార్పులు వస్తాయని అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనలో మహిళల పాత్ర కీలకమని, అందుకే ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ జీవనోపాధి కార్యక్రమాలు గ్రామీణ మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంతో పాటు స్వయం ఉపాధి రంగంలో కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తామని డిఆర్డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీదేవి స్పష్టం చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *